సాగులో సిరులు పండిస్తున్నారు

women farmers success story - Sakshi

వ్యవసాయ రంగంలో రాణిస్తున్న మహిళలు

కష్టాలను ఎదుర్కొని దూసుకెళ్తున్న స్త్రీమూర్తి

తాగుడుకు బానిసై ఒకరు.. విద్యుదాఘాతానికి గురై మరొకరు.. మనస్తాపంతో ఇంకొకరు..! ఇలా వేర్వేరు కారణాలతో ఇంటి యజమానులు కుటుంబాన్ని వదిలేసి కానరాని లోకాలకు వెళ్లిపోయారు. అయితే పిల్లలను ఉన్నతులుగా తీర్చిదిద్దాలనే ఆశయం.. పలువురు మహిళలను ముందుకు నడిపించింది. కన్నీళ్లను దిగమింగి.. కష్టాలకు ఎదురొడ్డి వారు సాగుబాట పట్టారు. భూమాతను నమ్ముకుని  వ్యవసాయ రంగంలో మేము సైతం అంటూ దూసుకెళ్తున్నారు.. పిల్లలను చక్కగా చదివిస్తూ.. పెళ్లిళ్లు చేయిస్తూ.. తోటివారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని పలువురు మహిళా రైతుల విజయప్రస్థానంపై ప్రత్యేక కథనం. 

శభాష్‌ లత

భీమదేవరపల్లి(హుస్నాబాద్‌): ఆమె నాగలి దున్నుతోంది.. గొర్రు కొడుతోంది.. పురుషులతో సమానంగా ప్రతి వ్యవసాయ పనిని చేస్తోంది.. ఏడుగురు ఆడపిల్లలున్న కుటుం బంలో ఒక్కతే పలుగు, పార పట్టింది.. తండ్రి, భర్త మరణించినా.. మనోధైర్యంతో కుటుంబభారాన్ని భుజాలపై వేసుకుంది.. వ్యవసాయ రంగంలో నూతన పద్ధతులు పాటిస్తూ నేటితరానికి ఆదర్శంగా నిలు స్తోంది ఓ మహిళా రైతు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తపల్లికి చెందిన తోట రాజయ్య–రాజమ్మ దంపతులకు ఏడుగురు కూతుర్లు ఉన్నారు. వీరికి నాలుగెకరాల భూమి ఉంది. అయితే రాజయ్య ఆరో కూతురు లత తనకు ఏడేళ్ల వయస్సు నుంచే తండ్రితో కలిసి వ్యవసాయ పనులకు వెళ్లేది. కాగా, రాజయ్య వ్యవసాయం చేసుకుంటూనే ఐదుగురు కూతుళ్ల పెళ్లిళ్లు జరిపించారు. 14 ఏళ్ల క్రితం ఆయన అనారోగ్యంతో మంచం పట్టాడు. అప్పటినుంచి లత వ్యవసాయ పనులు చేయడం ప్రారంభించింది.  తండ్రి కుదుట పడేందుకు పలు ఆస్పత్రులు తిరిగినా ప్రయోజనం లేకపోయింది. ఈ క్రమంలో ఆయన 2004లో మృతి చెందాడు. తండ్రి మరణంతో లత జీవితం పూర్తిగా వ్యవసాయానికే అంకితమైంది. ఆ సమయంలోనే నాగలి దున్నడం, గొర్రు కొట్టడం తదితర పనులు నేర్చుకుంది. అప్పటి నుంచే ఇంటికి పెద్ద దిక్కుగా మారి ఆర్థిక వ్యవహారాలన్ని కూడా ఆమె చూసుకునేది. అక్క, బావలను పండుగలకు ఆహ్వానించడం, శుభకార్యాలు నిర్వహిస్తూ ఉండేది. 
 

వివాహం..
ఇంటికి మగ దిక్కు ఉండాలనే ఉద్దేశంతో కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలంలోని కన్నాపూర్‌కు చెందిన సంపత్‌తో గత 8 ఏళ్ల క్రితం లతకు వివాహమైంది. ఈ సందర్భంగా సంపత్‌ను ఇల్లరికం తీసుకొచ్చారు. కొద్దికాలాని కి కుమారుడు అవినాష్‌ జన్మించాడు. అయితే ఆర్థిక ఇబ్భందుల కారణంగా భర్త సంపత్‌ పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ వైపు తండ్రి, మరో వైపు భర్త చనిపోవడంతో మానసికంగా కుంగిపోయిన లత కొన్ని రోజులకు గుండె ధైర్యం తెచ్చుకుని ముందుకుసాగింది. చెల్లి, అమ్మ, కుమారుడి పోషణకు తిరిగి వ్యవసాయ పనులు ప్రారంభించిం ది. కాగా, లత.. తల్లి రాజమ్మ కిడ్నీ వ్యాధితో అనారోగ్యబారిన పడగా ఆమెకు చికిత్స చేయించింది. ఆమె ఏడా ది క్రితం తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందింది. లత తన చెల్లె మాధవిని పీజీతో పాటుగా బీఈడీ పూర్తి చేయించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఆమెకు డీఎస్సీ కోచింగ్‌ ఇప్పిస్తోంది. ఉన్న ఎకరంలో వరి, మరో ఎకరంలో మొక్కజొన్న సాగు చేస్తూనే మూడు పాడి గేదెలను పెంచుతూ జీవిస్తుంది.

కష్టపడి పని చేస్తా..
నన్ను ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా మనోధైర్యంతో ముందుకు వెళ్తున్నా. చెల్లెలు మాధవికి ఉద్యోగం వచ్చిన తర్వాత ఆమెకు పెళ్లి చేసే బాధ్యత నాపై ఉంది. తర్వాత నా కుమారుడు అవినాష్‌ను కష్టపడి ఉన్నత చదువులు చదివిస్తా. ప్రభుత్వం నాకు ఏదైనా సాయం అందించాలి.
–తోట లత 

సలాం.. శకుంతల
ఏటూరునాగారం: తాగుడుకు బానిసై భర్త ఆత్మహత్య చేసుకున్నప్పటికీ ఓ మహిళ తన పిల్లలను అల్లారుముద్దుగా పెంచుకుంటోంది. భూమాతను నమ్ముకుని అహర్నిషలు శ్రమిస్తూ వివిధ రకాల పంటలను పండిస్తోంది. అందుబాటులో ఉన్న వనరులతో పిల్లలను మంచిగా చదివిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తోంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం మండలం రాంనగర్‌కు చెందిన గగ్గూరి రాంబాబు, శకుంతల దంపతులకు లక్ష్మీకాంత, స్వప్న, తిరుపతమ్మ, సంధ్యారాణి నలుగురు కూతుళ్లు ఉన్నారు. వీరికి మూడెకరాల భూమి ఉంది. అయితే నలుగురు పిల్లలతో హాయిగా ఉంటున్న సమయంలో రాంబాబు తాగుడుకు బానిసయ్యాడు. ఈ క్రమంలో ఓ రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆయన పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో శకుంతల గుండెలవిసేలా రోదించింది. చిన్న పిల్లలను పట్టుకుని కాలం ఎలా వెళ్లతీయాలని లోలోపల కుమిలిపోతుండేది. అయితే కళ్ల ముందే కనిపిస్తున్న కూతుర్లకు మంచి భవిష్యత్‌ కల్పించాలంటే తాను ఏదైనా పనులు చేయాలని భావించింది.

దీంతో 15 ఏళ్ల క్రితం వ్యవసాయరంగంలోకి దిగింది. సాగుపనులను నిర్విరామంగా చేస్తూ దూసుకుపోతోంది. తనకున్న 3 ఎకరాల్లో వరి, మిరప పంటలను పండిస్తూ పిల్లలను చదివిస్తోంది. కాగా, పెద్ద కూతురు లక్ష్మీకాంతను పదో తరగతి వరకు చదివించి 2012లో వివాహం చేసింది. రెండో కూతురు స్వప్నను ఇంటర్‌ వరకు చదివించి 2014లో, మూడో కూతురు తిరుపతమ్మను ఇంటర్‌ వరకు చదివించి 2016లో పెళ్లి జరిపించింది. ప్రస్తుతం నాలుగో కుమార్తె సంధ్యారాణి వరంగల్‌లోని ఓ ప్రైవే ట్‌ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదివిస్తోంది. శకుంతల వరి, మిరప పంటలను సాగు చేసేందుకు మహిళా సంఘాల వద్ద, అడ్తి వ్యాపారస్తులు, బ్యాంకులో నుంచి ఏటా రుణం తీసుకుంటుంది. ఇంటిపెద్ద లేకపోయినా నలుగురు ఆడపిల్లలను చదివించి పెద్దచేసి శకుంతల తోటి మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది. 

భళా.. భాగ్యలక్ష్మి

పరకాల రూరల్‌: చిన్న కుటుంబం, ఇద్దరు కూతుర్లు, భర్తతో సంతోషంగా కాలం గడుపుతున్న సమయంలో విధి ఆమెపై విషం చిమ్మింది. వ్యవసాయ పనులు చేస్తూ హాయిగా కుటుంబాన్ని పోషిస్తున్న ఇంటి పెద్దను కరెంట్‌ కాటేసి మంచానికి పరిమితం చేసింది. అయితే తమకున్న ఆస్తుల్లో కొంత అమ్ముకుని భర్తకు చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. నాలుగేళ్లు నరకయాతన అనుభవించిన ఇంటి యజమాని కానరానిలోకాలకు వెళ్లిపోవడంతో దిక్కులు పిక్కటిల్లేలా రోదించింది. గుండెను రాయి చేసుకుని ఓ మాతృమూర్తి పిల్లల భవిష్యత్‌కు బాటలు వేస్తోంది.  పరకాల మండలంలోని నాగారం గ్రామానికి చెందిన పల్లెబోయిన ఎల్లస్వామితో భాగ్యలక్ష్మీకి 1997లో వివాహమైంది. అనంతరం వీరికి ఇద్దరు కూతుర్లు రాఘవి, రవళి జన్మించారు. అయితే తనకున్న రెండెకరాల పది గుంటల భూమిలో వ్యవసాయం చేసుకుం టూ భార్య, పిల్లలను పోషించుకుంటున్న క్రమంలో ఎల్లస్వామి 2007 ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితమయ్యాడు. దీంతో భాగ్యలక్ష్మి తన భర్తను బాగు చేసుకునేందుకు ఎన్ని ఆస్పత్రులకు వెళ్లినా ఫలితం లేకపోయింది. ఈక్రమంలో 2011లో ఎల్లస్వామి మృతి చెందాడు.  

భూమాతను నమ్ముకుని..
ఎల్లస్వామి చనిపోయిన సమయంలో పెద్ద కూతురు రాఘవికి 9 ఏళ్లు, చిన్న కూతురుకి రవళికి 3 ఏళ్లు ఉన్నాయి. దీంతో కుటుంబ బాధ్యతలను భాగ్యలక్ష్మి తన భుజాలపై వేసుకుని ముందుకుసాగింది. ఉన్న భూమిలో ఏటా పత్తి, వరిని పండిస్తూ ఇద్దరు కూతుళ్లను చదివిస్తోంది. ప్రస్తుతం పెద్ద కూతురు కస్తూర్బా పాఠశాలలో తొమ్మిది, చిన్న కూతురు నాగారం  ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ భర్త చనిపోయినప్పుడు తీవ్రంగా కుం గిపోయానని, కూతుర్లలోనే భర్తను చూసుకుని ముందుకు సాగుతున్నానని చెప్పారు. ఇద్దరు పిల్లల ను విద్యావంతులను చేస్తానని ఆమె పేర్కొన్నారు.
 

Read latest Warangal News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top