ప్రాణాలతో చెలగాటమా?

People Demand Justice On Accidents Deaths - Sakshi

ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్‌లేని వాహనాలిచ్చి మా ప్రాణాలు తీస్తారా?

 మీ యాజమాన్యంలో ఎవరైనా చనిపోతే రూ.50 లక్షలిస్తాం.. ఒప్పుకుంటారా?

104 వాహన సిబ్బంది, సంఘ నాయకుల ఆగ్రహం 

మృతదేహాలను తీసుకెళ్లబోమంటూ బైఠాయింపు

బొబ్బిలి సీహెచ్‌సీ వద్ద ఉద్రిక్తత

ఎట్టకేలకు పరిహారానికి అంగీకారం 

బొబ్బిలి : ప్రభుత్వానితో ఒప్పందం కుదుర్చుకుని బీమా ప్రీమియంలు చెల్లించకుండా.. ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు లేకుండా ఉన్న వాహనాలిచ్చి మా ప్రాణాలు తీస్తారా? ఇదెక్కడి అన్యాయం.. మా ప్రాణాలకు విలువ లేదా? మీరు చనిపోతే మే ము రూ.50 లక్షలిస్తాం అంగీకరిస్తారా? వియ్‌ వాంట్‌ జస్టిస్‌.. అంటూ 104 వాహన సిబ్బంది, రాష్ట్ర స్థాయి నాయకులు నినదించారు. బొబ్బిలి ప్రభుత్వాస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. పోయిన ప్రాణాలకు పరిహారమివ్వాల్సిందేనని పట్టుబట్టారు. ఉద్యోగులపై పాలకులు, యాజ మాన్యం తీరును దుయ్యబట్టారు.

బలిజిపేట మండలం మిర్తివలస వద్ద 104 వాహనం, ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో వాహనం డ్రైవర్‌ పిల్లా మోహనరావు, స్టాఫ్‌ నర్సు నెమలి సంతో షికుమారిలు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తెలుసుకున్న 104 ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు, సీఐటీయూ, సీపీఎం నాయకులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆది వారం ఆందోళన చేశారు. ఆస్పత్రి నుంచి మృతదేహాలను తీసుకెళ్లబోమంటూ డ్రైవర్‌ భార్య శిల్లా దమయంతి, స్టాఫ్‌నర్సు భర్త గౌరీ ప్రసాద్‌లతో పాటు 104 ఉద్యోగులంతా  బైఠాయించా రు.

104 వాహనాల కాంట్రాక్టర్, ఏజెన్సీ ప్రతి నిధులు వచ్చి న్యాయం చేసేవరకూ కదిలేది లేదని స్పష్టం చేశారు. దీంతో అక్కడకు చేరుకున్న 104 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.సింహాచలం, మెడికల్‌ అండ్‌ హెల్త్‌ రాష్ట్ర నాయకులు పలివెల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశముందని, మీరిచ్చిన వాహనాలకు ఫిట్‌నెస్‌ లేదని ఎన్నోమార్లు ప్రభుత్వానికి నివేదించామన్నారు. అయినా పట్టించుకోలేదన్నారు. సీఎం చంద్రబాబుకు సైతం వినతిపత్రం అందజేశామన్నారు. 

అన్నీ ఉన్నాయని బుకాయించారు.. 
రాష్ట్ర స్థాయిలో ఉన్న 104 వాహనాలకు ఎటువంటి అనుమతులు లేవని చెప్పినా ఆ ఏజెన్సీ తిరిగి మాకు అన్ని అనుమతులూ ఉన్నాయని లేఖ రాసిందనీ అయినా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోలేదని 104 ఉద్యోగ సంఘాల నాయకులు ఆరోపించారు. అంబేడ్కర్‌ జయంతి రోజున ముఖ్యమంత్రి పలు ప్రసంగాలు చేశారని, ఇప్పుడు చనిపోయింది దళితులేనని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులంటే సీఎంకు చులకనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పరిహారం కోసం చర్చలు.. 
మృతుల కుటుంబాలకు పరిహారం అందజేసే విషయంపై 104 సేవల ఏజెన్సీ ప్రతినిధి బేరమాడుతూ వచ్చారు. ఉదయం ఆరు గంటల నుంచి స్టేట్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వీఆర్‌ ఫణికుమార్, కోశాధికారి నాయుడు, విజయనగరం, తూర్పు గోదావరి  జిల్లాల అధ్యక్షులు త్రిమూర్తులు, బాలరాజులతో పాటు స్థానిక సీపీఎం, సీటీయూ నాయకులు టీవీ రమణ, రెడ్డి వేణు, పొట్నూరు శంకరరావులు ఆస్పత్రివద్దనే ఉన్నారు. వీరితో పాటు డీఎస్పీ పి.సౌమ్యలత, ఆర్డీఓ సుదర్శన దొర, సీఐ మోహనరావు, ప్రసాదరావులతో పాటు బేబీనాయన, పార్వతీపురం ఎమ్మెల్యే బి.చిరంజీవులు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అచ్యుతవల్లిలు పరిహారం గూర్చి యాజమాన్య ప్రతినిధులతో మాట్లాడారు.

చివరకు డీఎం హెచ్‌ఓ వచ్చి రూ.10 లక్షలకు అంగీకరించేలా చేశారు. దీంతో పాటు మృతుల కుటుంబంలో ఒకరికి అవుట్‌సోర్సింగ్‌లో ఉద్యో గం, చంద్రన్న బీమా, 104 ఉద్యోగుల తరఫున బీమా, ఆర్టీసీ సంస్థ తరపున బీమా వచ్చే అవకాశం ఉండటంతో ఉద్యోగుల సంఘ నాయకులు అంగీకరించారు. ఈ పరిహారం ఇచ్చేందుకు రాతపూర్వకంగా ఉండాలని, ఎప్పుడిస్తారో స్పష్టం చేయాలని  డిమాండ్‌ చేయడంతో రెండు వారాల్లోగా ఇస్తామని చెప్పిన యాజమాన్య ప్రతినిధి అక్కడి నాయకులు, అధికారుల ఒత్తిడితో ఎట్టకేలకు అంగీకరించారు. 

తక్షణ సాయం అందజేత... 
ప్రమాదంలో మృతి చెందిన వాహన డ్రైవర్‌ పిల్లా మోహనరావు, స్టాఫ్‌ నర్స్‌ నెమలి సంతోషి కుమారి కుటుంబాలకు రూ.50వేల చొప్పున  కలెక్టర్‌ జారీ చేసిన తక్షణ సాయాన్ని ఆర్డీఓ బి. సుదర్శనదొర,  ఎమ్మెల్యే బి చిరంజీవులు,  బేబీ నాయన, ఎమ్మెల్సీ జగదీష్‌లు అందజేశారు.

బాసటగా నిలిచిన వైఎస్సార్‌ సీపీ నాయకులు 
ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలంటూ వైఎస్సార్‌ సీపీ పార్వతీపురం నాయకులు జమ్మాన ప్రసన్నకుమార్‌ డిమాండ్‌ చేశారు. ఆస్పత్రికి చేరుకుని మృతులకు బాసటగా నిలిచారు. దుర్ఘటన తీరు, పరిహారం విషయంలో యాజమాన్యం అవలంభిస్తున్న వైఖరిని దుయ్యబట్టారు. బొబ్బిలి వైఎస్సార్‌ సీపీ నాయకులు ఇంటి గోపాలరావు సైతం ఆస్పత్రికి చేరుకుని సిబ్బంది కుటుంబాలకు న్యాయం చేయాలని, 104 ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. 

Read latest Vizianagaram News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top