‘పల్లెవెలుగు’ల్లో ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు | express survices in palle velugu busses | Sakshi
Sakshi News home page

‘పల్లెవెలుగు’ల్లో ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు

Jan 15 2018 10:39 AM | Updated on Jan 15 2018 10:39 AM

విజయనగరం అర్బన్‌: సంక్రాంతి పండగ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆదివారం కూడా ప్రయాణికులతో కిటకిటలాడింది. దూరప్రాంతాల నుంచి రైళ్లల్లో వచ్చి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వెళ్లడానికి ఇక్కడి నుంచి బస్సులను ఆశ్రయిస్తారు. ప్రధానంగా పాలకొండ, రాజాం, సాలూరు, పార్వతీపురం, రణస్థలం ప్రాంతాలకు వెళ్లేవారు అధికంగా ఉన్నారు. పట్టణంలోని వివిధ ప్రైవేటు, వ్యాపార సంస్థల్లో పనిచేసిన కార్మిక, చిరుద్యోగులకు పండగ మూడురోజులు మాత్రమే సెలవిస్తారు. దీంతో భోగీ రోజున సొంత ఊర్లకు వెళ్లేవాళ్ల సంఖ్య పెరిగింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా జిల్లా కేంద్రానికి ఆనుకొని ఆర్టీసీ అధికారులు 60 బస్సుల వరకు విజయగరం, సాలూరు, పార్వతీపురం, ఎస్‌కోట డిపోల నుంచి నడిపారు. అధిక శాతం విశాఖ నుంచి ప్రయాణికులను తీసుకొని రావడానికి ఉపయోగించారు. సంస్థకున్న ఎక్స్‌ప్రెస్‌ సర్వీ సు బస్సులు సరిపోకపోవడంతో పల్లెవెలుగు బస్సులను వినియోగించారు. చార్జీలు మాత్రం ఎక్స్‌ప్రెస్‌ బస్సులవే వసూళ్లు చేశారు. స్థానిక బస్‌ కాంప్లెక్స్‌ ప్రాంతంలో, విశాఖలోని ద్వారకానగర్‌ కాంప్లెక్స్‌ ఆవరణలో జిల్లా ఆర్టీసీ అధికారులు కాపుకాసి జనాల రద్దీకి అనుగుణంగా ఆయా ప్రాంతాల రూట్లకు సిటీ బస్సులు, పల్లెవెలుగు సర్వీసులను నడిపారు.

రెండోవైపు సర్వీసులకు జనాలు నిల్‌..
విశాఖ నుంచి జిల్లాకు, జిల్లా కేంద్రం నుంచి వివిధ ప్రాంతాలకు నిర్వహించిన సర్వీసులకు రెండోవైపు ప్రయాణికులు లేకపోవడంతో ఆర్టీసీ అధికారులు డీలాపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న చార్జీలకు రెండువైపులా జనాలు ఉన్నపుడే దానిమీద వచ్చిన ఆదాయం బాగుంటుంది. ఒకవైపు ప్రయాణికులను తీసుకెళ్లి రెండోవైపు ఖాళీగా వస్తే కిట్టుబాటుండదని వ్యాఖ్యానిస్తున్నారు. ఆదివారం భోగీ రోజున దాదాపుగా 70 శాతం సర్వీసులకు రెండో వైపు సర్వీసులకు జనాలు లేరని, దీని వల్ల సంస్థకు సేవే తప్ప ఆదాయం అంతంత మాత్రమేనని చెబుతున్నారు. పల్లెవెలుగు బస్సులు అయినప్పటికీ స్టాపుల సంఖ్యను తగ్గిస్తూ ఎక్స్‌ప్రెస్‌ బస్‌ల స్పీడులోనే నడుపుతున్నామని, ఆ కారణంగానే ఎక్స్‌ప్రెస్‌ చార్జీలు వసూలు చేస్తున్నామని విజయనగరం డిపో మేనేజర్‌ ఎన్‌విఎస్‌.వేణుగోపాల్‌ వివరణ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement