దేవులపల్లి రామానుజరావు శతజయంతి ప్రత్యేక సంచిక

దేవులపల్లి రామానుజరావు శతజయంతి ప్రత్యేక సంచిక


(పరిచయం)

తెలుగు భాషా సాహిత్యాల పరిరక్షణకు, పరివ్యాప్తికి అవిరళ కృషి జరిపిన అగ్రేసర సంస్థగా తెలంగాణ సారస్వత పరిషత్తు కీర్తినొందింది. ప్రస్తుతం తెలంగాణ సారస్వత పరిషత్తుగా పేరు మారిన ఆంధ్ర సారస్వత పరిషత్తుకు స్థల సేకరణ నుంచి, భవనాల నిర్మాణానికి ప్రభుత్వం నుండి గ్రాంట్లు రాబట్టడం నుంచి ‘ఏకవ్యక్తి సైన్యం’గా దేవులపల్లి రామానుజరావు పనిచేశారు. 1943 నుంచి 93లో మరణించేంత వరకు అందులో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర సాహిత్య అకాడమీలో వివిధ హోదాల్లోనూ, రాజ్యసభ సభ్యునిగానూ ఆయన సేవలందించారు. కవి, వ్యాసకర్త, సంపాదకుడు అయిన దేవులపల్లి 1917లో వరంగల్‌ జిల్లాలో జన్మించారు. ఆయన శతజయంతి సందర్భంగా పరిషత్తు ప్రత్యేక సంచిక వెలువరించింది. ఇందులో రామానుజరావు వ్యక్తిత్వాన్నీ, సాహిత్యాన్నీ పట్టించే 35 వ్యాసాలున్నాయి.



‘పత్రికా రంగానికి ‘శోభ’ తెచ్చిన దేవులపల్లి రామానుజరావు’ పేరిట రాసిన వ్యాసంలో శోభ పత్రిక ప్రత్యేకతను సంగిశెట్టి శ్రీనివాస్‌ వివరించారు. ‘నేడు తెలంగాణమునకున్న ముఖ్యమైన కొఱతలలో మాసపత్రిక యొకటి’ అన్న మాడపాటి హనుమంతరావు ప్రసంగమే ప్రేరణగా రామానుజరావు 1947 ఉగాది రోజున శోభ ప్రారంభించారు. అదీ యుద్ధం వలన న్యూస్‌ప్రింట్‌ కొరత ఉన్న కాలంలో. మూడేళ్లు నడిపారు. ‘అప్పటివరకూ ఎక్కువగా పత్రికలూ సాహిత్యమూ హైదరాబాద్‌ చుట్టూతా తిరిగేది. శోభ పత్రిక ప్రధానంగా జిల్లాల నుంచి వచ్చిన రచయితలు, కవులకు అధిక ప్రాధాన్యత నిచ్చింది’.



1948లో పోలీసు చర్య అనంతరం అప్పటి వైస్‌ చాన్స్‌లర్‌ అలియావర్‌ జంగ్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ‘తెలుగువాళ్లకు దక్కకుండా చేయాలనే దుర్బుద్ధితో దక్షిణాదిలో హిందీ విశ్వవిద్యాల యంగా’ మార్చడానికి చేసిన ప్రయత్నాన్ని అడ్డుకున్నది రామానుజరావేనని అమ్మంగి వేణుగోపాల్‌ రాశారు.



శృంగార కవి అంటే శ్రీనాథుడు అన్న కీర్తిని పక్కన పెట్టి, పోతన్నను శృంగారకవిగా రామానుజరావు నిరూపించిన సంగతిని మల్లెగోడ గంగాప్రసాద్‌ ప్రస్తావించారు. ఇంట్లో మాటల సందర్భంలో సమయానుకూలంగా ఎన్నో కొటేషన్స్‌ ఎన్నో గ్రంథాల నుండి ‘బాపు’ ఉటంకించేవాడని రామానుజరావు కూతురు ఎం.విమల గుర్తు చేసుకున్నారు. భూస్వామిక కుటుంబం నుంచి వచ్చినా ప్రజాస్వామికవాదిగా వ్యవహరించాడని సుంకిరెడ్డి నారాయణరెడ్డి తన అనుభవాలు పంచుకున్నారు.



- సాహిత్యం డెస్క్‌



తెలంగాణ వైతాళికుడు డాక్టర్‌ దేవులపల్లి రామానుజరావు శతజయంతి ప్రత్యేక సంచిక; సంపాదకులు: ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, డాక్టర్‌ జె.చెన్నయ్య; వెల: 200; ప్రతులకు: తెలంగాణ సారస్వత పరిషత్తు, తిలక్‌ రోడ్, అబిడ్స్, హైదరాబాద్‌–1. ఫోన్‌: 040–24753724

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top