breaking news
Devulapalli Ramanuja Rao
-
దిలీప్ రెడ్డికి దేవులపల్లి రామానుజరావు పురస్కారం
సాక్షి, హైదరాబాద్: డాక్టర్ దేవులపల్లి రామానుజరావు పురస్కారాన్ని 2023 సంవత్సరానికి ప్రముఖ పాత్రికేయుడు ఆర్ దిలీప్ రెడ్డికి అందజేయాలని తెలంగాణ సారస్వత పరిషత్తు నిర్ణయించింది. నాటి ఆంధ్ర సారస్వత పరిషత్తుకు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీకి అధ్యక్షులుగా, కవిగా, విమర్శకునిగా, శోభ పత్రిక సంపాదకునిగా విశేష సేవనందించిన దేవులపల్లి రామానుజరావు పేరుతో పురస్కారాన్ని ఏటా పరిషత్తు అందజేస్తున్నది. ఈ ఏడాదికిగానూ పురస్కారానికి ఎంపికైన దిలీప్ రెడ్డి మెదక్ జిల్లాకు చెందినవారు. ప్రముఖ తెలుగు దినపత్రికల్లో వివిధ హోదాల్లో సేవలు అందించడమే కాకుండా సమాచార హక్కు చట్టం కమిషనర్ గా, పర్యావరణ వేత్తగా విశిష్ట సేవలు అందించారని పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె చెన్నయ్య బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈనెల 25వ తేదీ ఉదయం 10:30 కు పరిషత్తులోని డాక్టర్ దేవులపల్లి రామానుజ రావు కళామందిరం లో జరిగే కార్యక్రమంలో పురస్కారాన్ని తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కె.వి.రమణాచారి చేతుల మీదుగా అందజేస్తామని, 25 వేల రూపాయల నగదు, శాలువా,జ్ఞాపికతో సత్కరిస్తామని వారు పేర్కొన్నారు. -
దేవులపల్లి రామానుజరావు శతజయంతి ప్రత్యేక సంచిక
(పరిచయం) తెలుగు భాషా సాహిత్యాల పరిరక్షణకు, పరివ్యాప్తికి అవిరళ కృషి జరిపిన అగ్రేసర సంస్థగా తెలంగాణ సారస్వత పరిషత్తు కీర్తినొందింది. ప్రస్తుతం తెలంగాణ సారస్వత పరిషత్తుగా పేరు మారిన ఆంధ్ర సారస్వత పరిషత్తుకు స్థల సేకరణ నుంచి, భవనాల నిర్మాణానికి ప్రభుత్వం నుండి గ్రాంట్లు రాబట్టడం నుంచి ‘ఏకవ్యక్తి సైన్యం’గా దేవులపల్లి రామానుజరావు పనిచేశారు. 1943 నుంచి 93లో మరణించేంత వరకు అందులో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర సాహిత్య అకాడమీలో వివిధ హోదాల్లోనూ, రాజ్యసభ సభ్యునిగానూ ఆయన సేవలందించారు. కవి, వ్యాసకర్త, సంపాదకుడు అయిన దేవులపల్లి 1917లో వరంగల్ జిల్లాలో జన్మించారు. ఆయన శతజయంతి సందర్భంగా పరిషత్తు ప్రత్యేక సంచిక వెలువరించింది. ఇందులో రామానుజరావు వ్యక్తిత్వాన్నీ, సాహిత్యాన్నీ పట్టించే 35 వ్యాసాలున్నాయి. ‘పత్రికా రంగానికి ‘శోభ’ తెచ్చిన దేవులపల్లి రామానుజరావు’ పేరిట రాసిన వ్యాసంలో శోభ పత్రిక ప్రత్యేకతను సంగిశెట్టి శ్రీనివాస్ వివరించారు. ‘నేడు తెలంగాణమునకున్న ముఖ్యమైన కొఱతలలో మాసపత్రిక యొకటి’ అన్న మాడపాటి హనుమంతరావు ప్రసంగమే ప్రేరణగా రామానుజరావు 1947 ఉగాది రోజున శోభ ప్రారంభించారు. అదీ యుద్ధం వలన న్యూస్‌ప్రింట్ కొరత ఉన్న కాలంలో. మూడేళ్లు నడిపారు. ‘అప్పటివరకూ ఎక్కువగా పత్రికలూ సాహిత్యమూ హైదరాబాద్ చుట్టూతా తిరిగేది. శోభ పత్రిక ప్రధానంగా జిల్లాల నుంచి వచ్చిన రచయితలు, కవులకు అధిక ప్రాధాన్యత నిచ్చింది’. 1948లో పోలీసు చర్య అనంతరం అప్పటి వైస్ చాన్స్‌లర్ అలియావర్ జంగ్ ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ‘తెలుగువాళ్లకు దక్కకుండా చేయాలనే దుర్బుద్ధితో దక్షిణాదిలో హిందీ విశ్వవిద్యాల యంగా’ మార్చడానికి చేసిన ప్రయత్నాన్ని అడ్డుకున్నది రామానుజరావేనని అమ్మంగి వేణుగోపాల్ రాశారు. శృంగార కవి అంటే శ్రీనాథుడు అన్న కీర్తిని పక్కన పెట్టి, పోతన్నను శృంగారకవిగా రామానుజరావు నిరూపించిన సంగతిని మల్లెగోడ గంగాప్రసాద్ ప్రస్తావించారు. ఇంట్లో మాటల సందర్భంలో సమయానుకూలంగా ఎన్నో కొటేషన్స్ ఎన్నో గ్రంథాల నుండి ‘బాపు’ ఉటంకించేవాడని రామానుజరావు కూతురు ఎం.విమల గుర్తు చేసుకున్నారు. భూస్వామిక కుటుంబం నుంచి వచ్చినా ప్రజాస్వామికవాదిగా వ్యవహరించాడని సుంకిరెడ్డి నారాయణరెడ్డి తన అనుభవాలు పంచుకున్నారు. - సాహిత్యం డెస్క్ తెలంగాణ వైతాళికుడు డాక్టర్ దేవులపల్లి రామానుజరావు శతజయంతి ప్రత్యేక సంచిక; సంపాదకులు: ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, డాక్టర్ జె.చెన్నయ్య; వెల: 200; ప్రతులకు: తెలంగాణ సారస్వత పరిషత్తు, తిలక్ రోడ్, అబిడ్స్, హైదరాబాద్–1. ఫోన్: 040–24753724