మరో వెన్నుపోటు విషాదం

మరో వెన్నుపోటు విషాదం - Sakshi


డేట్‌లైన్‌ హైదరాబాద్‌

నాగిరెడ్డిని మంత్రిని చేస్తానని, తామే పెట్టిన తప్పుడు కేసులు ఎత్తేస్తాననీ చెప్పి పార్టీ ఫిరాయించేటట్టు చేసిన చంద్రబాబు ఆయనను తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేశారు. తీరా చివరకు నీ ప్రత్యర్థి వర్గ అభ్యర్థిని ఎంఎల్‌సీగా గెలిపించుకోనిస్తేనే అవన్నీ చేస్తామన్నారు. ఆ కారణంగానే నాగిరెడ్డి తీవ్ర మానసిక వ్యధకు గురై మరణించారని బాబుకు బాగా తెలుసు. కాబట్టే నాగిరెడ్డి మరణ వార్త విన్నప్పటి నుంచి ఆయన ఏ పదవీ ఆశించలేదు, ఆయనకు ఏ కోరికలూ లేవు అంటూ పదే పదే మాట్లాడుతున్నారు.శవయాత్ర సాగుతుండగా పాడె మీదకు విసిరే చిల్లర డబ్బులు, పేలాలు ఏరుకునే వారు ఉంటారు. అది వారి వృత్తి కావొచ్చు లేదా పేదరికం వారిచేత ఆ పని చేయిస్తూ ఉండొచ్చు. అంత హీన స్థితిలో ఉన్న మనుషులు ఇంకా మన మధ్య జీవిస్తున్నందుకు, వారి బ్రతుకులను మార్చలేక పోతున్నందుకు మనం అందరం సిగ్గుపడాలి తప్ప వారిని అగౌరవంగా చూడాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ, దాని అధినాయకుడు చంద్రబాబునా యుడు నాయకత్వంలో ప్రస్తుతం చేస్తున్న రాజకీయం అంతకన్నా హీనంగా ఉన్నది. ఇటువంటి రాజకీయం చేస్తున్న వారిని చూసి సభ్య సమాజం సిగ్గుతో తల దించుకునే పరిస్థితి.కర్నూల్‌ జిల్లా నంద్యాల వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ శాసన సభ్యుడు భూమా నాగిరెడ్డి మొన్న ఆకస్మికంగా మరణించారు. ఆయన ఏడాది క్రితం ఏవో ప్రలోభాలకో లేదా ఒత్తిడులకో లొంగి తెలుగుదేశం పార్టీ పంచన చేరినా సాంకేతికంగా ఆయన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శాసనసభ్యుడే. అందుకే ఈ మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ విస్తరణ చేస్తానని గవర్నర్‌ దగ్గరికి వెళ్లినప్పుడు... తాను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ శాసనసభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించేదిలేదని, వారి శాసనసభ సభ్యత్వాలకు రాజీ నామా చేయించి అప్పుడు రండని చెప్పి పంపేశారు. తెలంగాణలో పార్టీ ఫిరాయించి మంత్రివర్గంలో చేరిన తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చేత ప్రమా ణం చేయించినందుకు తెలుగుదేశం వాళ్లు తిట్టిన తిట్లను గవర్నర్‌ ఎలా మరచి పోతారు? కాబట్టి భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు అఖిలప్రియ, ఆయన బావమరిది ఎస్‌వీ మోహన్‌రెడ్డి సహా మొత్తం 21 మంది ఎంఎల్‌ ఏలూ సాంకేతికంగా ఇంకా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏలే. అఖిలప్రియ, మోహన్‌రెడ్డి సహా ఆ ఫిరాయింపుదారుల్లో ఎవరికి మంత్రి పదవి కట్టబెట్టాల నుకున్నా ఇప్పుడు చంద్రబాబు రాష్ట్ర గవర్నర్‌ను మార్పించి, అందుకు అను కూలంగా నడుచుకునే గవర్నర్‌ను వేయించుకోవాలి. ప్రస్తుతానికి అది ఆయన వల్ల జరిగే పనిలా కనిపించడం లేదు. ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఎన్ని కల్లో సాధించిన అద్భుత విజయం తరువాత మోదీకి చంద్రబాబు కోరికలను తీర్చాల్సిన పరిస్థితి లేదు. మోదీ గురించి తెలిసిన వారు ఇప్పుడు అసలు బాబుకు ప్రధాని అపాయింట్మెంట్‌ దొరకడం కూడా కష్టమే అంటున్నారు.క్షుద్ర రాజకీయంతోనే గుండెలు పగిలే వ్యధ

నాగిరెడ్డి చితి మంటలు ఇంకా ఆరక ముందే ఆయన కుమార్తెను, బావమరి దిని శాసనసభకు రప్పించి వారి చేత రాజకీయాలు మాట్లాడించిన వైనం చూసి విస్తుపోవాల్సి వచ్చింది. అందువల్లనే మంత్రి పదవుల విషయంలో అఖిలప్రియ, మోహన్‌రెడ్డిల పేర్లను ప్రస్తావించాల్సి వచ్చింది. నాగిరెడ్డి మర ణించిన విషయం తెలిసినప్పటి నుండి ఆయన భౌతిక కాయానికి అంత్య క్రియలు జరిగే వరకూ... ఆయన ఏ పదవీ ఆశించలేదు, ఆయనకు ఏ కోరి కలూ లేవు అంటూ పదే పదే అరిగిపోయిన రికార్డ్‌లా బాబు మాట్లాడిన తీరు అట్లాగే ఉంది. నాగిరెడ్డిని మంత్రిని చేస్తానని, తామే పెట్టిన తప్పుడు కేసులు ఎత్తేస్తాననీ ప్రలోభపెట్టి, పార్టీ ఫిరాయించేటట్టు చేసి ఒక ఏడాది పాటు తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేశారు. తీరా చివరి రోజున నీ ప్రత్యర్ధి ముఠా వ్యక్తిని ఎంఎల్‌సీగా గెలిపించుకోనిస్తేనే అవన్నీ చేస్తామని చెప్పి పంపించిన కార ణంగానే నాగిరెడ్డి తీవ్ర మానసిక వ్యథకు గురై, దాన్ని తట్టుకోలేకనే మర ణించారని బాబు మనసుకు బాగా తెలుసు. కాబట్టే ఆయన ఇప్పుడు ఈ మాటలు వల్లెవేస్తున్నాడు. శిల్పా చక్రపాణిరెడ్డిని గెలిపించుకు రావడం అంత సులభం కాదు. రాయలసీమలో ముఠాలు, ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ముఠాలు ఎట్లా పని చేస్తాయో అందరికీ తెలుసు. చట్టసభలోకి ప్రవేశించే నాటికే నాగిరెడ్డికి అది అనుభవపూర్వకంగా తెలుసు. ఆ తరువాత కూడా అదే రాజకీయాల్లో జీవించాడు కాబట్టి ప్రలోభపెట్టి పార్టీ ఫిరాయింపు చేయించిన చంద్రబాబే షరతులు పెట్టే దగ్గరికి వచ్చే సరికి తట్టుకోలేక పోయాడు. ఏం జరిగిందో తెలిపే వాస్తవాలన్నీ కాలక్రమేణా తప్పకుండా బయటకు వస్తాయి.శవ రాజకీయం
బ్రతికి ఉన్నప్పుడు, చనిపోయాకా ఎన్‌టీ రామారావుకు ఏం జరిగిందో నాగి రెడ్డికి కూడా అదే జరుగుతున్నది. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న నాయకు రాలు శోభా నాగిరెడ్డి ప్రమాదంలో మరణిస్తే అభ్యర్ధుల జాబితా నుండి ఆమె పేరు తొలగించాలని ఎన్నికల సంఘానికి పిటిషన్లు పెట్టిన తెలుగుదేశం వారు, విభజనానంతర ఏపీ తొలి శాసనసభలో ఆమెకు కనీసం సంతాపం తెలపడానికైనా ఇష్టపడని తెలుగుదేశం వారు, నాగిరెడ్డిని అడ్డగోలు కేసుల్లో ఇరికించి ఆస్పత్రుల పాలు చేసి, చివరకు జైలుకు కూడా పంపిన తెలుగుదేశం వారు... ఆయన చనిపోయాక ఆ కుటుంబం మొత్తం తమదేనని ప్రకటించు కునే ప్రయత్నం చెయ్యడాన్ని మించిన శవ రాజకీయం ఇంకొకటి ఉండబోదు. వయసులో, అనుభవంలో చిన్న కాబట్టి అఖిలప్రియకు ఇంకా ఈ విషయం అర్థం కాకపోవచ్చు, మోహన్‌రెడ్డికయినా తెలియకుండా ఉంటుందా ?

ఏది ఏమైనా నాగిరెడ్డి మరణం ఆయన కుటుంబానికి, ముఖ్యంగా పిల్ల లకు తీరని లోటు. ఎవరూ తీర్చలేని వ్యక్తిగత దుఃఖం. తల్లిని కోల్పోయిన మూడేళ్లలోపే తండ్రిని కూడా పోగొట్టుకున్న ఆ పిల్లల దుఃఖాన్ని ఎవరూ తీర్చ జాలరు. నాగిరెడ్డి శాసనసభకు వచ్చింది కూడా అటువంటి విషాద సంద ర్భమే. తన అన్న, శాసనసభ్యుడు భూమా వీరశేఖర్‌ రెడ్డి ఆకస్మిక మరణం వల్ల ఖాళీ అయిన ఆళ్లగడ్డ స్థానం నుండి 1992 ఉప ఎన్నికల్లో నాగి రెడ్డి పోటీ చేశారు. అదే సమయంలో ప్రధాని పీవీ నరసింహారావు నంద్యాల నుండి లోక్‌సభకు పోటీ చేశారు. ఆ వార్తల కోసం వెళ్లిన నాకు నాగి రెడ్డి నామినేషన్‌ సందర్భంగా జరిగిన ఘర్షణను ప్రత్యక్షంగా చూసే అవకాశం లభించింది.

కాకలు తీరిన నేత భవితనే ప్రశ్నార్థకంగా మారిస్తే?
పీవీ కోసం లోక్‌సభ సభ్యత్వాన్ని త్యజించిన గంగుల ప్రతాప్‌రెడ్డిని కలసి నాగిరెడ్డి ఇంటికి చేరుకునే సరికి ఆయన నామినేషన్‌ వెయ్యడానికి ఊరేగిం పుగా బయలుదేరారు. ఆ వాహన శ్రేణి చివర మా వాహనం ఉంది. కొద్దిగా ముందుకు పోగానే ర్యాలీ మీద బాంబుల వర్షం. జీపుపైన నాగిరెడ్డితోబాటు అప్పటి తెలుగుదేశం నాయకుడు అవుకుకు చెందిన చల్లా రామకృష్ణారెడ్డి కూడా ఉన్నారు. నాగిరెడ్డిని నామినేషన్‌ వెయ్యకుండా ఆపే ప్రయత్నంలో జరి గిన ఆ దాడిని ఎదుర్కొంటూ, సమయం మించి పోతుండటంతో ఆయన ఒక లారీలో దాక్కుని నామినేషన్‌ వేయాల్సిన కార్యాలయానికి చేరుకొని మీడి యాతో మాట్లాడారు. ఈ ఘటన అంతటికీ నాతో బాటు ‘ఇండియా టుడే’ ఆంగ్ల పత్రిక ప్రతినిధి అమర్‌నాథ్‌ మీనన్‌ కూడా ప్రత్యక్ష సాక్షి. ప్రత్యర్థి ముఠా బాంబు దాడిని ఎదుర్కొని, తొలి నామినేషన్‌ వేసి గెలిచి శాసనసభకు వెళ్లిన నాగిరెడ్డి పలు మార్లు శాసనసభ సభ్యునిగా, పార్లమెంటు సభ్యుని గెలిచారు. చివరికి అటువంటి మరో ప్రత్యర్థిని గెలిపించకపోతే రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందో అన్న మానసిక వ్యధతో కుంగిపోవాల్సి రావడం, ఆ  కార ణంగా గుండె ఆగి చనిపోవడం విచారకరం.

నాగిరెడ్డి మరణాన్ని రాజకీయ ప్రయోజనంగా మలచుకోచూస్తున్న తెలుగుదేశం అధినేత పోకడ మరీ దుర్మార్గం. మనిషి చనిపోయినంత మాత్రాన వాస్తవాలు మారిపోవు. తప్పులు ఒప్పులు అయిపోవు. తల్లి తండ్రి లేని అమ్మాయి కాబట్టి అఖిలప్రియ పార్టీ ఫిరాయింపు చట్టబద్ధం కాబోదు. మిగిలిన 19 మందితో బాటు మరణించిన నాగిరెడ్డి ఫిరాయింపు కూడా చట్ట వ్యతిరేకమే, ప్రజాస్వామ్య విలువలకు, సంప్రదాయాలకూ విఘాతమే, అత్యంత అనైతికమే. మరణించిన వారి గురించి మంచే మాట్లాడాలి. కాబట్టి  ఈ విషయాలు ప్రస్తావించలేకే మంగళవారం నాడు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శాసనసభకు బయటే ఉండిపోయింది. ఇంతకూ లోపల ఉన్న తెలుగుదేశం అధినేత, నాగిరెడ్డిని ఏ పార్టీ మనిషిగా భావించి నివాళి అర్పించినట్టు?


- దేవులపల్లి అమర్‌

datelinehyderabad@gmail.com
Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top