రైతుమిత్ర పెనుమాక పంచగవ్య! | Sakshi
Sakshi News home page

రైతుమిత్ర పెనుమాక పంచగవ్య!

Published Tue, Jan 17 2017 3:29 AM

రైతుమిత్ర పెనుమాక పంచగవ్య! - Sakshi

 • పంచగవ్యతో సేంద్రియ దిగుబడులకు భరోసా
 • అన్ని రకాల పంటలతోపాటు ఆక్వా చెరువుల్లోనూ మెరుగైన దిగుబడులు
 • పదకొండేళ్లుగా నాణ్యమైన పంచగవ్యను రైతులకందిస్తున్న యువకుడు
 • పంచగవ్యను వ్యక్తిగత శ్రద్ధతో త్రికరణశుద్ధిగా తయారు చేస్తేనే సత్ఫలితాలు
 • ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పంటలు పండించే రైతులకు మంచి దిగుబడులు సాధించడానికి ద్రవరూప సేంద్రియ ఎరువులు చక్కని సాధనాలుగా నిలుస్తాయి. ఈ కోవలోనిదే ‘పంచగవ్య’. జీవామృతాన్ని అనుకున్న తర్వాత 48 గంటల్లో వాడకానికి సిద్ధం చేసుకోవచ్చు. కానీ, పంచగవ్య  సిద్ధం కావాలంటే 21 రోజులు పడుతుంది. పంచగవ్య గురించి పెద్దగా తెలియని 11 ఏళ్ల క్రితం నుంచే నిబద్ధతతో తయారు చేసి అందుబాటులో ఉంచుతూ.. దీని తయారీపై, వాడకంపై రైతులకు శిక్షణ ఇస్తున్నారు యువ రైతు భీమవరపు సురేందర్‌రెడ్డి. పంచగవ్య నాణ్యతలో రాజీ లేకుండా కృషి చేస్తుండటం విశేషం. ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ వ్యాప్తికి దోహదపడుతూనే.. విలువలతో కూడిన స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకున్న సురేందర్‌రెడ్డి గ్రామీణ యువతకు ఆదర్శప్రాయుడు.

  రసాయన అవశేషాల్లేని అమృతాహారాన్ని సమాజానికి అందించడమే లక్ష్యంగా భీమవరపు సురేందర్‌రెడ్డి అనే యువకుడు నాణ్యమైన పంచగవ్యను నియమబద్ధమైన రీతిలో తయారు చేసి, స్వల్ప లాభంతోనే రైతులకు అందుబాటులో తెస్తున్నారు. వందలాది మంది సేంద్రియ రైతులకు తోడ్పాటునందిస్తున్నారు. ఏడాది పొడవునా బహుళ పంటల సాగుకు పేరెన్నికగన్న గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని పెనుమాక ఆయన స్వగ్రామం. 39 ఏళ్ల సురేందర్‌రెడ్డి పంచగవ్య తయారీలో పదకొండేళ్ల అనుభవం గడించడం విశేషం. నిరుపేద రైతు కుటుంబంలో జన్మించిన ఆయన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. బంధువుల తోడ్పాటుతో పదో తరగతి పూర్తి చేసిన తర్వాత చదువుకు స్వస్తి చెప్పి.. రసాయనిక పురుగుమందుల కంపెనీలో నాలుగేళ్లు చిరుద్యోగం చేశాడు. సేంద్రియ వ్యవసాయ వ్యాప్తి లక్ష్యంగా ఏర్పాటైన నీలగిరి ఫౌండేషన్‌ గ్రామీణ యువతకు వర్మీకంపోస్టు, పంచగవ్య తదితరాల తయారీ, వాడకంపై శిక్షణ ఇస్తుండేది. ఆ సంస్థలో పనిలో కుదిరిన సురేందర్‌రెడ్డి రెండేళ్లలో నాణ్యమైన వర్మీకంపోస్టు, పంచగవ్య తయారీ పద్ధతులపై పట్టు సాధించారు. 2006 నుంచి పంచగవ్య తయారీపైనే దృష్టి సారించారు.

  నాణ్యతే ప్రాణం..
  సేంద్రియ పంటల సాగులో నాణ్యమైన అధిక పంట దిగుబడులు సాధించడానికి పంచగవ్య చాలా ఉపయోగకరమన్న వాస్తవాన్ని ఏళ్ల తరబడి రైతుల సాంగత్యంలో గ్రహించానని ఆయన అంటాడు. పంచగవ్య నాణ్యంగా తయారైందా లేదా అన్నది రైతు పొలంలో వాడిన తర్వాతే రుజువు అవుతుంది. పంచగవ్య నాసిరకంగా ఉంటే రైతు నష్టపోక తప్పదు. అందుకే నాణ్యత విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ లోటుపాట్లు లేకుండా చూసుకోవడమే తన అభిమతమని అంటారు. ఈ విషయం గ్రహించారు కాబట్టే అనేక జిల్లాలు దాటి తన వద్దకు వచ్చి వివిధ రకాల పంటలు, పండ్ల తోటలు పండించే రైతులు పంచగవ్యను తీసుకెళుతూ ఉంటారని సురేందర్‌రెడ్డి గర్వంగా చెబుతారు.

  పంచగవ్య కొనుగోలు చేయడానికి వచ్చిన రైతుకు సురేందర్‌రెడ్డి.. తొలుత దాని తయారు చేసుకునే పద్ధతిని, వాడుకునే పద్ధతిని తన పని తాను చేసుకుంటూనే ఓపికగా వివరిస్తారు. పంచగవ్య తయారీలో వాడే ఉత్పాదకాల నాణ్యతలో రాజీపడకుండా ఉండటం, తయారీ ప్రక్రియలో 21 రోజుల పాటు కూలీలపై ఆధారపడకుండా ప్రత్యేక వ్యక్తిగత శ్రద్ధతో పనిచేయడం ఎంతో ముఖ్యమైన విషయం. ఈ విషయాన్ని ఆయన ఆచరిస్తూ రైతులకు తెలియజెబుతారు. పంచగవ్య తయారీలో సందేహాల గురించి, పంటలపై వాడకం గురించి పగటి పూట తనకు ఫోను చేసే రైతులకు ఆయన సూచనలు అందిస్తూ ఉంటారు. 12 డ్రమ్ముల్లో బ్యాచ్‌కు 1,300 లీటర్ల చొప్పున పంచగవ్యను తయారు చేస్తున్నారు. ఇంత భారీ మొత్తంలో తయారు చేయడం వల్ల తనకు లీటరుకు రూ. 78 ఖర్చు అవుతున్నదని, రూ. 90కే రైతుకు అందిస్తున్నామన్నారు. 2015–16లో సుమారు 30 వేల లీటర్ల పంచగవ్యను రైతులకు అందించానన్నారు.

  పంచగవ్య తయారీ ఇలా..
  డ్రమ్ములో పంచగవ్య తయారీకి కావలసినవి :
  1.     నాటు ఆవు పేడ 5 కిలోలు    
  2.     నాటు ఆవు నెయ్యి అర కేజీ    
  3.     బూడిద గుమ్మడి కాయ తురుము కిలో    
  4.    మిగలపండిన డజను అరటి పండ్ల గుజ్జు.. ఈ నాలుగింటిని ప్లాస్టిక్‌ బక్కెట్‌లో వేసి బాగా కలపాలి. బక్కెట్‌కు పల్చటి తడి వస్త్రం లేదా తడి గన్నీ బ్యాగ్‌ను కప్పాలి. రోజూ ఉదయం, సాయంత్రం నిమిషం పాటు కలియదిప్పాలి. కుక్కలు దరి చేరకుండా జాగ్రత్తపడాలి. బక్కెట్‌ చుట్టూ చీమల మందు చల్లాలి. 5వ రోజున బక్కెట్‌లో నుంచి ఈ మిశ్రమాన్ని పెద్ద డ్రమ్ములో వేసి మరికొన్నిటిని కలపాలి..
  5.     నాటు ఆవు పాలు 2 లీటర్లు    
  6.     నాటు ఆవు పెరుగు 2 కిలోలు    
  7.     నాటు ఆవు మూత్రం 3 లీటర్లు    
  8.     కల్లు 3 లీటర్లు (ఈస్ట్‌తో తయారు చేసిన కల్లు పనికిరాదు. నాణ్యమైన తాటి/ఈత కల్లు వాడాలి)    
  9.     లేత కొబ్బరి నీళ్లు 3 లీటర్లు (ఆలయాల్లో కొట్టిన ముదిరిన కొబ్బరి కాయల నీళ్లు పనికిరావు)    
  10.    నల్లబెల్లం కిలో (3 లీటర్ల నీటిలో ఈ బెల్లాన్ని కలిపి పానకం సిద్ధం చేసుకోవాలి)        
  11.    దర్భ 2 పరకలు    
  12.    పాత పంచగవ్య 1–2 లీటర్లు (మదర్‌ కల్చర్‌గా ఉపయోగపడుతుంది)    
  13.    సూడోమోనాస్‌ అర లీటరు (పౌర్ణమి రోజు సూడోమోనాస్‌ను కలిపితే పంచగవ్య డ్రమ్ములో నుంచి పొంగి పోతుంది)..
  వీటన్నిటినీ డ్రమ్ములో వేసి కర్రతో కలగలపాలి. మామిడి / నేరేడు / రావి / జువ్వి / జమ్మి కర్రను తీసుకొని దాని తొక్క తీసి.. పంచగవ్యను తిప్పటానికి వాడాలి. రోజూ ఉదయం, సాయంత్రం ఎంత ఎక్కువ సేపు వీలైతే అంత ఎక్కువ సేపు సవ్య దిశగా తిప్పాలి. తిప్పటం వల్ల పంచగవ్య ప్రభావశీలత పెరుగుతుంది. ఇలా 21 రోజులు తిప్పుతూ ఉండాలి. కూలీలపై ఆధారపడకుండా స్వయంగా సొంతదారే శ్రద్ధగా, క్రమం తప్పకుండా తిప్పినప్పుడే నాణ్యమైన పంచగవ్య తయారవుతుంది. పౌర్ణమి నాడు పంచగవ్య తయారు చేĶæనారంభిస్తే డ్రమ్ములో నుంచి పొంగిపోతుంది.

  పాలిచ్చే నాటు ఆవు మూత్రం, పేడ శ్రేష్టం..
  ఆవు మూత్రం, పేడ, నెయ్యి, పాలు, పెరుగు తదితరాల నాణ్యతపైనే పంచగవ్య నాణ్యత ఆధారపడి ఉంటుందని సురేందర్‌రెడ్డి నమ్ముతున్నారు. పంచగవ్య తయారీలో మోపురం ఉన్న నాటు ఆవు పేడ, మూత్రం ప్రభావశీలంగా పనిచేస్తాయని, పాలిచ్చే ఆవు నుంచి సేకరించినవైతే మరింత శ్రేష్టమని తన అనుభవంలో గ్రహించానని చెప్పారు. షెడ్‌లో గచ్చుపైన పోసిన ఆవు మూత్రాన్ని సేకరించిన మూత్రం కన్నా, ఆవు పోస్తుండగానే బక్కెట్‌లోకి సేకరించిన మూత్రం శ్రేష్టంగా ఉంటుందని ఆయన అంటారు. ఆవు నుంచి నేరుగా సేకరించిన మూత్రాన్ని రూ. 12కు కొనుగోలు చేసి పంచగవ్య తయారీలో వాడుతున్నానని ఆయన తెలిపారు. పోషకాల గని అయిన బూడిద గుమ్మడి కాయ గుజ్జు, జీవన ఎరువు సూడోమోనాస్‌లను కూడా పంచగవ్య తయారీలో వినియోగించడం మంచిదని తన అనుభవంలో గ్రహించానని సురేందర్‌రెడ్డి చెబుతున్నారు.

  పౌర్ణమి రోజుల్లోనే పిచికారీ చేయాలి..
  పంచగవ్య తయారైన తర్వాత నెలల పాటు నిల్వ ఉంటుంది. పంచగవ్యను పొలంలో సాగునీటితో కలిపి ఎకరానికి 20 లీటర్ల చొప్పున అందించవచ్చు. ప్రతి 15 రోజులకోసారి పంటలపైన వంద లీటర్ల నీటికి 3 లీటర్ల చొప్పున పంచగవ్య కలిపి పిచికారీ చేయాలని సురేందర్‌రెడ్డి సూచిస్తున్నారు. పిచికారీకి పౌర్ణమి రోజులు అనుకూలమని, పంట పొలానికి నీటితో కలిపి పారించడానికి అమావాస్య రోజులు అనుకూలమని అన్నారు.
  – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌ ఫొటోలు: కె. క్రాంతికుమార్‌రెడ్డి, నేచర్స్‌ వాయిస్‌

  రైతుల అవసరాలకు అనుగుణంగా
  పంచగవ్యను పరిపుష్టం చేశా..
  మా ప్రాంతంలో ఎకరానికి 25 –30 బస్తాల రసాయనిక ఎరువులు వాడుతున్నారు. మిరప వంటి పంటలపై దాదాపు రోజూ రసాయనిక పురుగుమందులు వాడుతున్నారు. అయితే, ప్రకృతి / సేంద్రియ వ్యవసాయంలో పంచగవ్య అన్ని రకాల పంటల పెరుగుదలకు తోడ్పడడమే కాకుండా చీడపీడలకు టీకా మాదిరిగా పనిచేస్తున్నదని రైతుల అనుభవాల ద్వారా గ్రహించాను. పంచగవ్య తయారీలో ఐదు రకాల ఉత్పాదకాలనే వాడాల్సి ఉన్నప్పటికీ.. రైతుల అనుభవాలను, అవసరాలను బట్టి 13 రకాలను కలుపుతూ ప్రభావశీలమైన పంచగవ్యను తయారు చేస్తున్నాను. నా దగ్గరకు వచ్చే రైతులకు ముందు తయారు చేసుకోవడం ఎలాగో నేర్పిస్తాను.

  తీరిక ఉంటే సొంతంగా చేసుకోమని చెబుతున్నాను. భారీ మొత్తంలో తయారు చేస్తాను కాబట్టి రైతు తయారు చేసుకున్నప్పటికన్నా నాకు తక్కువ ఖర్చు అవుతుంది. స్వల్ప లాభం కలుపుకుని రైతుకు ఇస్తున్నాను. నాణ్యతలో రాజీ పడకుండా ఉండటం వల్లనే వందలాది మంది రైతులు రెండు రాష్ట్రాల నుంచి పంచగవ్య తీసుకెళ్తున్నారు. కూరగాయల్లో 18%, పసుపులో 22% దిగుబడి పెరిగిందని రైతులు చెప్పారు. ధాన్యాలు, పండ్లు దిగుబడి పెరగడమే కాకుండా నిల్వ ఉండే సామర్థ్యం, రుచి పెరిగింది. మల్లెపూలు, కొత్తిమీర, కరివేపాకు పరిమళం పెరిగింది. మిరపలో ముడత (బొబ్బర) అదుపులోకి వచ్చింది.  రొయ్యలు, చేపల చెరువుల్లో నీటిలో ఆక్సిజన్‌ పరిమాణం పెరిగి, మరణాల రేటు తగ్గింది. రొయ్యలు, చేపల బరువు కూడా పెరిగిందని రైతులు చెబుతున్నారు.
  – భీమవరపు సురేందర్‌రెడ్డి (94417 53975, 83414 55658), పెనుమాక, గుంటూరు జిల్లా

Advertisement
 
Advertisement
 
Advertisement