ముఖ్యమంత్రి చంద్రబాబు మాఫియా డాన్‌లా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం విమర్శించారు.
శ్రీకాకుళం అర్బన్: ముఖ్యమంత్రి చంద్రబాబు మాఫియా డాన్‌లా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం విమర్శించారు. శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ట్యాపింగ్ టెక్నాలజీ కొనుగోలుకు బాబు పాల్పడుతున్నారని వికిలీక్స్ పత్రిక వెల్లడించిందని, దీన్ని ఆయన కాదనగలరా అని ప్రశ్నించారు.
రూ. 7.5 కోట్లతో ట్యాపింగ్ పరికరాలు కొనుగోలుకు యత్నిస్తూనే మరోవైపు తమ ఫోన్లు ట్యాపింగ్ జరిగిందని మాట్లాడడం ఎంత వరకూ సమంజసమన్నారు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా ఉందని, గవర్నర్, శాసనసభ వ్యవస్థలను పాలకులు భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. ఇపుడు కార్యనిర్వాహక వ్యవస్థను సైతం భ్రష్టుపట్టించడానికి యత్నిస్తున్నారని విమర్శించారు.