బాబు వచ్చాడు... జాబు ఊడింది | ys jagan fires on chandrababu | Sakshi
Sakshi News home page

బాబు వచ్చాడు... జాబు ఊడింది

Mar 11 2016 2:28 AM | Updated on Jul 28 2018 3:23 PM

బాబు వచ్చాడు... జాబు ఊడింది - Sakshi

బాబు వచ్చాడు... జాబు ఊడింది

మీరేమీ చదువుకోకపోయినా నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.2వేలు చెల్లిస్తా... 2014 ఎన్నికల్లో చంద్రబాబునాయుడు సంతకంతో....

* 1.75 కోట్ల ఇళ్లలో ఉద్యోగం, భృతి కోసం ఎదురుచూస్తున్నారు
* మీరేమో నిరుద్యోగ భృతి అనే పథకమే లేదంటున్నారు
* ఎన్నికల వేళ ఇల్లిల్లూ తిరిగి ఉద్యోగాలిస్తామని అబద్ధాలాడి ఇప్పుడు మోసం చేస్తారా?
* ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
* ప్రభుత్వ బాధ్యతా రాహిత్యానికి నిరసనగా సభనుంచి వాకౌట్

సాక్షి, హైదరాబాద్: ‘‘జాబు కావాలంటే బాబు రావాలి. తమ్ముళ్లూ మీ కలలు సాకారం చేయబోతున్నా.

ఇంటికొక ఉద్యోగం ఇస్తా. ఉద్యోగం లేక పోతే ఉపాధి కల్పిస్తా. మీరేమీ చదువుకోకపోయినా నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.2వేలు చెల్లిస్తా... 2014 ఎన్నికల్లో చంద్రబాబునాయుడు సంతకంతో కూడిన పత్రాలు పంచి గద్దెనెక్కిన మీరు... లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్లపై బికారుల్లా తిరుగుతూంటే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తారా?’’ అంటూ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విరుచుకుపడ్డారు. గురువారం సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల సమయంలో నిరుద్యోగ భృతిపై సభలో రగడ మొదలైంది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ నిర్వాకంపై మండిపడ్డారు.

‘‘రాష్ర్టంలో 1.75 కోట్ల కుటుంబాలున్నాయి. ఈ కుటుంబాల నుంచి చదువుకున్న యువతీ యువకులు ఉద్యోగాలొస్తాయని ఎదురు చూశారు. రెండేళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఉపాధి కల్పిస్తామని, అదీ ఇవ్వలేదు. ఎలాంటి చదువు లేకపోయినా నిరుద్యోగ భృతి నెలకు రూ.2వేలు అన్నారు. నిరుద్యోగ భృతి ఒక్కరికీ ఇవ్వలేదు. డీఎస్సీ అభ్యర్థులు పరీక్ష రాసి 18 నెలలు దాటినా మెరిట్ లిస్టు ఇవ్వలేదు. ఉద్యోగాలు లేకపోగా క్లస్టర్‌లు పెట్టి హాస్టళ్లనూ మూసేస్తున్నారు. మరోవైపు ఏడువేల మందిని సర్‌ప్లస్ ఉద్యోగులుగా చూపిస్తున్నారు.

ఇదేనా మీ నిర్వాకం?’’ అంటూ దుయ్యబట్టారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని చెప్పి మోసం చేశారని విమర్శించారు. ‘‘నేడు రెండు లక్షల మంది ఉద్యోగుల మెడపై కత్తి వేలాడుతోంది. ఏ క్షణంలో ఉద్యోగం ఊడగొడతారో అని భయపడుతున్నారు. క్రమబద్ధీకరణ గురించి ఎప్పుడు ప్రశ్నించినా పరిశీలిస్తున్నామంటున్నారు. ఆరోగ్యమిత్రలను తొలగించారు, ఫీల్డ్ అసిస్టెంట్‌లను తొలగించారు. గోపాలమిత్రలను తొలగించారు. ఆశావర్కర్లకు ఎనిమిది నెలలుగా జీతాలు ఇవ్వకపోతే ధర్నాలు చేస్తే అరెస్టులు చేస్తున్నారు.

అంగన్‌వాడీలు ధర్నా చేస్తే నిర్దాక్షిణ్యంగా పోలీసులతో కొట్టించి అరెస్టులు చేశారు. కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకొచ్చాక విస్మరించడం మీ మోసకారితనానికి నిదర్శనం’’ అని నిప్పులు చెరిగారు. అసలు నిరుద్యోగ భృతి అనే పథకమే లేదని చెప్పడం ఈ ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ప్రభుత్వ బాధ్యతా రాహిత్యానికి నిరసనగా వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించి తమ సభ్యులతో సభనుంచి బయటకు వెళ్లిపోయారు.
 
ఒక్క ఉద్యోగమూ లేదు: చింతల
ప్రభుత్వంలోకొచ్చే వరకూ ఎన్ని అబద్ధాలు కావాలో అన్నీ ఆడారు. ఇప్పుడేమో ఒక్క ఉద్యోగమూ ఇవ్వలేకపోయారు. గ్రూప్-1 నోటిఫికేషన్ లేదు, గ్రూప్-2 లేదు, చివరకు గ్రూప్-4 నోటిఫికేషన్లు లేవు. బీఈడీ, డీఎడ్ చదివిన లక్షలాదిమంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. మీరేమో ఉద్యోగమూ ఇవ్వలేదు, నిరుద్యోగ భృతీ లేదంటున్నారు.

నిరుద్యోగ భృతి అనే పథకమే లేదు: మంత్రి అచ్చెన్నాయుడు
రాష్ట్రంలో నిరుద్యోగ భృతి అనే పథకమే లేదని కార్మిక, ఉపాధి శాఖల మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమివ్వడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. మంత్రి సమాధానమిస్తూ ‘అలాంటి పథకం ఏదీ లేదు, ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు’ అంటూ సమాధానమిచ్చారు. దీంతో సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. భృతి అనేది కాకుండా అందరికీ స్కిల్ డెవలప్‌మెంట్‌లో శిక్షణ ఇచ్చి, ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. బాబొస్తే జాబొస్తున్నందన్న నినాదంతో ముందుకెళ్లామని, కానీ దాన్ని వమ్ము చేయమని తెలిపారు.
 
పథకమే లేదని హేయంగా మాట్లాడారు
నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల వేళ హామీలిచ్చి ఇప్పుడు అసలా పథకమే లేదని మంత్రి అచ్చెన్నా యుడు హేయంగా మాట్లాడారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement