
‘హిట్ అండ్ రన్’ కేసులో సల్మాన్‌కు చుక్కెదురు
ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు ‘హిట్ అండ్ రన్’ కేసులో చుక్కెదురైంది.
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు ‘హిట్ అండ్ రన్’ కేసులో చుక్కెదురైంది. మంగళవారం ముంబైలోని సెషన్స్ కోర్టులో ఈ కేసు పునర్విచారణ సందర్భంగా నాటి ఘటనలో గాయపడిన ముగ్గురు ప్రత్యక్ష సాక్షులు (మనూఖాన్, మొహమ్మద్ కలీం ఇక్బాల్ పఠాన్, ముస్లిం షేక్ లు) సల్మాన్ ఖాన్‌ను నిందితుడిగా గుర్తించారు. స్థానికులు చుట్టుముట్టి కార్లోంచి దిగాల్సిందిగా అరవడంతో మద్యం మత్తులో ఉన్న సల్మాన్ కారులోంచి దిగినట్లు చెప్పారు. అప్పుడు స్థానికులు సల్మాన్‌ను పట్టుకోగా కార్లోంచి దిగిన అతని భద్రతాధికారి (రవీంద్ర పాటిల్) తాను పోలీసునని చెప్పడంతో వారు సల్మాన్‌ను విడిచిపెట్టారని సాక్షులు కోర్టుకు వివరించారు.
2002 సెప్టెంబర్ 28న రాత్రి సబర్బన్ బాంద్రాలో ఓ బేకరీ సమీపంలోని ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఐదుగురిపై సల్మాన్ నడిపిన కారు (టొయోటా లాండ్ క్రూజర్) దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా మరో నలుగురు గాయపడ్డారు.