పాక్‌ ఆర్మీ చీఫ్‌గా బజ్వా ఎంపిక వెనుక.. | Sakshi
Sakshi News home page

పాక్‌ ఆర్మీ చీఫ్‌గా బజ్వా ఎంపిక వెనుక..

Published Mon, Nov 28 2016 8:46 AM

పాక్‌ ఆర్మీ చీఫ్‌గా బజ్వా ఎంపిక వెనుక..

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో సైనికాధికారులు రాజకీయాల్లో జోక్యం చేసుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయనేది జగమెరిగిన సత్యం. పాక్‌ ప్రభుత్వం.. ఆర్మీ, ఉగ్రవాదుల చేతుల్లో కీలుబొమ్మ అనే విమర్శ కూడా ఉంది. పాక్‌ లో ఆర్మీ చీఫ్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంది. భారత్‌ కూడా పాక్‌ సైన్యం కదలికలపై నిరంతరం దృష్టి సారిస్తుంది. సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన తరుణంలో పాక్‌ ఆర్మీ కొత్త చీఫ్‌గా ఖమర్‌ బజ్వా నియమితులయ్యారు. ఈ పదవికి నలుగురు జనరల్‌లు రేసులో ఉన్నా బజ్వా వైపే ఆ దేశ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ మొగ్గు చూపారు. ఆయన్ను ఆర్మీ చీఫ్‌గా షరీఫ్‌ ఎంపిక చేయడానికి పలు కారణాలున్నాయని ఆ దేశ మీడియా వెల్లడించింది.

ప్రజాస్వామ్య ప్రభుత్వానికి బజ్వా విధేయుడని, ప్రచార ఆర్భాటాలకు దూరంగా నిబద్ధతతో పనిచేసుకుపోయే వ‍్యక్తని.. అందువల్లే షరీఫ్‌ ఆయన పట్ల మొగ్గు చూపారని పాక్‌ మీడియా పేర్కొంది. సైనిక ఆపరేషన్లలో నిపుణుడైన, ప్రజాస్వామ్య ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే అధికారిని ఆర్మీ చీఫ్‌గా నియమించాలని ప్రధాని షరీఫ్‌ భావించారని వెల్లడించింది. పాక్‌ సైన్యంలో బజ్వా కీలక బాధ్యతలు నిర్వహించారని, భారత్‌ సరిహద్దుల్లో మిలటరీ కార్యకలాపాలపై ఆయనకు పూర్తిగా పట్టుందని, ఈ అంశాలు కూడా కలసి వచ్చాయని పేర్కొంది. పాక్‌లో ప్రభుత్వాలను మిలటరీ కూలదోసి అధికార పగ్గాలు చేజిక్కించుకున్న సంఘటనలు గతంలో ఉన్నాయి. ఆ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దాదాపు 70 ఏళ్లలో సగానిపైగా మిలటరీ పాలన సాగింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని బజ్వా వల్ల తన ప్రభుత్వానికి ముప్పు ఉండదని షరీఫ్‌ భావించారని పాక్‌ మీడియా పేర్కొంది. పాక్‌ ఆర్మీ ప్రస్తుత చీఫ్‌ జనరల్‌ రహీల్‌ నుంచి మంగళవారం బజ్వా బాధ్యతలు చేపట్టనున్నారు.

Advertisement
Advertisement