
వాషింగ్టన్: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ మరోసారి అమెరికా పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా మునీర్ అమెరికా రాజకీయ, సైనిక నాయకులతో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో ఆసిమ్ తొలిసారి పర్యటించగా.. ఇప్పుడు మరోసారి అమెరికాలో అడుగు పెట్టారు.
మునీర్ తన పర్యటనలో భాగంగా అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ జనరల్ డాన్ కైన్‌తో సమావేశమయ్యారు. ఇరువురు పలు కీలక అంశాలపై చర్చించారు. టాంపాలో అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) మాజీ చీఫ్ జనరల్ మైకేల్ కురిల్లా రిటైర్మెంట్ వేడుకలో పాల్గొన్నారు. అనంతరం అడ్మిరల్ బ్రాడ్ కూపర్ బాధ్యతలు స్వీకరించిన వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలని మునీర్ కోరారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
జూన్ పర్యటనలో, మునీర్.. ట్రంప్‌తో ప్రైవేట్ లంచ్‌లో పాల్గొన్నారు. ఇది సాధారణంగా దేశాధినేతలకు మాత్రమే లభించే గౌరవం.ఈ వరుస పర్యటనలు అమెరికా–పాకిస్తాన్ సంబంధాలు మరింత బలపడుతున్నాయని’ విశ్లేషకులు భావిస్తున్నారు. మునీర్ పాకిస్తాన్ తరఫున సహకారాన్ని, భద్రతా అంశాలను చర్చించేందుకు ఈ పర్యటన చేస్తున్నట్లు సమాచారం.