నా మంచి ఫొటోలు వాడొచ్చుగా! | Wanted Woman Asks Media To Use A Better Photo Of Her | Sakshi
Sakshi News home page

నా మంచి ఫొటోలు వాడొచ్చుగా!

Aug 29 2016 4:49 PM | Updated on Aug 16 2018 4:36 PM

నా మంచి ఫొటోలు వాడొచ్చుగా! - Sakshi

నా మంచి ఫొటోలు వాడొచ్చుగా!

ఆర్థిక అవకతవకల కేసులో ఆమె నిందితురాలు.

ఆర్థిక అవకతవకల కేసులో ఆమె నిందితురాలు. ఏకంగా పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు పోలీసు స్టేషన్‌ నుంచి ఆమె పరారైంది. అప్పటినుంచి పోలీసులు ఆమెకోసం గాలిస్తూనే ఉన్నారు. అయినా దొరకకుండా ముప్పుతిప్పలు పెడుతున్న ఆ 18 ఏళ్ల లేడీ తాజాగా టీవీ చానెళ్లపై కయ్యిమంది. 'నా గురించి కథనాలు ప్రసారం చేస్తున్నప్పుడు కాస్తా నా అందమైన ఫొటోలు చూపించొచ్చుగా.. ' ఆమె ఓ టీవీ చానెల్‌కు షాకిచ్చింది.

ఈ ఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. 18 ఏళ్ల ఆమీ షార్ప్ గతవారం సిడ్నీలో ఓ పోలీసు స్టేషన్‌ నుంచి తప్పించుకొని పరారైంది. దీంతో ఆమెను పట్టుకునేందుకు పోలీసులు మీడియాకు రెండు ఫొటోలు విడుదల చేశారు. ఈ ఫొటోలతో మీడియా కథనాలు ప్రసారం చేసింది. సిడ్నీకి చెందిన 7న్యూస్ చానెల్‌ ఈ కథనంతోపాటు, పోలీసులు విడుదల చేసిన ఆమీ ఫొటోలను తన ఫేస్‌బుక్‌ పేజీలో పోస్టు చేసింది. అయితే, ఈ పోస్టుపై అందరికన్నా ముందు నిందితురాలు ఆమీనే కామెంట్‌ చేసింది. కామెంట్‌ సెక్షన్‌లో తన అందమైన ఫొటోలను కొన్నింటినీ పోస్టుచేసి.. 'దయచేసి ఈ ఫొటోలను వాడండి. కృతజ్ఞతలు, మీ ఆమీ' అంటూ కామెంట్‌ చేసింది.

పోలీసులు విడుదల చేసిన తన రెండు ఫొటోలు అంత బాగాలేకపోవడంతో నొచ్చుకున్న ఆమీ..  అందుకే తాను ఆనందంగా చలాకీగా కనిపిస్తున్న ఫొటోలను మీడియాకు అందించి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పరారీలో ఉన్నా ధైర్యంగా తన ఫొటోలను టీవీ  చానెల్‌కు అందించిన ఆమీని నెటిజన్లు లైకులు, కామెంట్లు, ప్రశంసలతో ముంచెత్తుతుండటంతో స్థానికంగా ఆమె పేరు సోషల్‌ మీడియాలో మార్మోగుతోంది. అయితే, ఆమె ప్రజాజీవితానికి ఆటంకం కలిగించే కరడుగట్టిన నేరస్తురాలు కాదని, కేవలం ఒక చిన్న ఆస్తి కేసులో నిందితురాలిగా ఉందని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఆమెను పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement