breaking news
amy sharp
-
నా మంచి ఫొటోలు వాడొచ్చుగా!
ఆర్థిక అవకతవకల కేసులో ఆమె నిందితురాలు. ఏకంగా పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు పోలీసు స్టేషన్ నుంచి ఆమె పరారైంది. అప్పటినుంచి పోలీసులు ఆమెకోసం గాలిస్తూనే ఉన్నారు. అయినా దొరకకుండా ముప్పుతిప్పలు పెడుతున్న ఆ 18 ఏళ్ల లేడీ తాజాగా టీవీ చానెళ్లపై కయ్యిమంది. 'నా గురించి కథనాలు ప్రసారం చేస్తున్నప్పుడు కాస్తా నా అందమైన ఫొటోలు చూపించొచ్చుగా.. ' ఆమె ఓ టీవీ చానెల్‌కు షాకిచ్చింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. 18 ఏళ్ల ఆమీ షార్ప్ గతవారం సిడ్నీలో ఓ పోలీసు స్టేషన్ నుంచి తప్పించుకొని పరారైంది. దీంతో ఆమెను పట్టుకునేందుకు పోలీసులు మీడియాకు రెండు ఫొటోలు విడుదల చేశారు. ఈ ఫొటోలతో మీడియా కథనాలు ప్రసారం చేసింది. సిడ్నీకి చెందిన 7న్యూస్ చానెల్ ఈ కథనంతోపాటు, పోలీసులు విడుదల చేసిన ఆమీ ఫొటోలను తన ఫేస్బుక్ పేజీలో పోస్టు చేసింది. అయితే, ఈ పోస్టుపై అందరికన్నా ముందు నిందితురాలు ఆమీనే కామెంట్ చేసింది. కామెంట్ సెక్షన్లో తన అందమైన ఫొటోలను కొన్నింటినీ పోస్టుచేసి.. 'దయచేసి ఈ ఫొటోలను వాడండి. కృతజ్ఞతలు, మీ ఆమీ' అంటూ కామెంట్ చేసింది. పోలీసులు విడుదల చేసిన తన రెండు ఫొటోలు అంత బాగాలేకపోవడంతో నొచ్చుకున్న ఆమీ.. అందుకే తాను ఆనందంగా చలాకీగా కనిపిస్తున్న ఫొటోలను మీడియాకు అందించి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పరారీలో ఉన్నా ధైర్యంగా తన ఫొటోలను టీవీ చానెల్‌కు అందించిన ఆమీని నెటిజన్లు లైకులు, కామెంట్లు, ప్రశంసలతో ముంచెత్తుతుండటంతో స్థానికంగా ఆమె పేరు సోషల్ మీడియాలో మార్మోగుతోంది. అయితే, ఆమె ప్రజాజీవితానికి ఆటంకం కలిగించే కరడుగట్టిన నేరస్తురాలు కాదని, కేవలం ఒక చిన్న ఆస్తి కేసులో నిందితురాలిగా ఉందని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఆమెను పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు. -
ఫొటో పిచ్చితో.. పోలీసులకు దొరికేసింది
ఆస్తులకు సంబంధించిన అనేక కేసులున్న అమీ షార్ప్ అనే ఆస్ట్రేలియన్ యువతి.. ఫొటో పిచ్చితో పోలీసులకు దొరికేసింది. ఆమె జైలు నుంచి పారిపోవడంతో ఆ విషయాన్ని రిపోర్టు చేస్తూ, ఒక మీడియా సంస్థకు చేసిన ఫేస్బుక్ పోస్టులో పెట్టిన తన ఫొటో బాగోలేదని ఆమె భావించింది. దాంతో ఆ పోస్టుకు కామెంటు పెడుతూ.. ఆ ఫొటోకు బదులు ఈ కొత్త ఫొటోను వాడాలని కోరింది. దాంతో సోషల్ మీడియాలో ఆమె వ్యాఖ్యలు, ఫొటో కూడా విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఎప్పటినుంచో దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న షార్ప్ ఫొటోను ఇటీవలే పోలీసులు స్థానిక టీవీ చానళ్ల వారికి అందజేశారు. ఈ మనిషి ఎక్కడ కనపడినా వెంటనే ఆచూకీ చెప్పాలని సిడ్నీ పోలీసులు తెలిపారు. 'ఛానల్ 7 న్యూస్' అనే వార్తా చానల్ తమ ఫేస్బుక్ పేజీలో ఈ విషయాన్ని పోస్ట్ చేసింది. దానికి మొట్టమొదట స్పందించిన వ్యక్తి.. అమీ షార్ప్. మీరు ప్రచురించిన ఫొటోలో తాను ఏమాత్రం బాగోలేనని, పైగా భుజాల చుట్టూ ఎర్రటి శాలువా కప్పుకొని ఉన్నానని చెప్పింది. కొత్త ఫొటోను కూడా ఆమె అక్కడ పోస్ట్ చేసి, ఈ ఫొటో వాడండి అని సలహా ఇచ్చింది. ఆమె కామెంటును ఏకంగా 50 వేల మంది లైక్ చేశారు. చివరకు ఈ ఫొటో, ఆమె ఐపీ అడ్రస్ ఆధారంగా పోలీసులు అమ్మడిని పట్టుకుని జైల్లో వేశారు.