
ఫొటో పిచ్చితో.. పోలీసులకు దొరికేసింది
ఆస్తులకు సంబంధించిన అనేక కేసులున్న అమీ షార్ప్ అనే ఆస్ట్రేలియన్ యువతి.. ఫొటో పిచ్చితో పోలీసులకు దొరికేసింది.
ఆస్తులకు సంబంధించిన అనేక కేసులున్న అమీ షార్ప్ అనే ఆస్ట్రేలియన్ యువతి.. ఫొటో పిచ్చితో పోలీసులకు దొరికేసింది. ఆమె జైలు నుంచి పారిపోవడంతో ఆ విషయాన్ని రిపోర్టు చేస్తూ, ఒక మీడియా సంస్థకు చేసిన ఫేస్‌బుక్ పోస్టులో పెట్టిన తన ఫొటో బాగోలేదని ఆమె భావించింది. దాంతో ఆ పోస్టుకు కామెంటు పెడుతూ.. ఆ ఫొటోకు బదులు ఈ కొత్త ఫొటోను వాడాలని కోరింది. దాంతో సోషల్ మీడియాలో ఆమె వ్యాఖ్యలు, ఫొటో కూడా విస్తృతంగా వైరల్ అయ్యాయి.
ఎప్పటినుంచో దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న షార్ప్ ఫొటోను ఇటీవలే పోలీసులు స్థానిక టీవీ చానళ్ల వారికి అందజేశారు. ఈ మనిషి ఎక్కడ కనపడినా వెంటనే ఆచూకీ చెప్పాలని సిడ్నీ పోలీసులు తెలిపారు. 'ఛానల్ 7 న్యూస్' అనే వార్తా చానల్ తమ ఫేస్‌బుక్ పేజీలో ఈ విషయాన్ని పోస్ట్ చేసింది. దానికి మొట్టమొదట స్పందించిన వ్యక్తి.. అమీ షార్ప్. మీరు ప్రచురించిన ఫొటోలో తాను ఏమాత్రం బాగోలేనని, పైగా భుజాల చుట్టూ ఎర్రటి శాలువా కప్పుకొని ఉన్నానని చెప్పింది. కొత్త ఫొటోను కూడా ఆమె అక్కడ పోస్ట్ చేసి, ఈ ఫొటో వాడండి అని సలహా ఇచ్చింది. ఆమె కామెంటును ఏకంగా 50 వేల మంది లైక్ చేశారు. చివరకు ఈ ఫొటో, ఆమె ఐపీ అడ్రస్ ఆధారంగా పోలీసులు అమ్మడిని పట్టుకుని జైల్లో వేశారు.