టోల్‌గేట్లకు ఆదివారం వాహనాల తాకిడి పెరిగింది. దసరా పండుగ సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లిన వారు నగరబాట పట్టారు.
చౌటుప్పల్/షాద్‌నగర్/అడ్డాకుల: టోల్‌గేట్లకు ఆదివారం వాహనాల తాకిడి పెరిగింది. దసరా పండుగ సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లిన వారు నగరబాట పట్టారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పదిరోజుల సెలవులు ముగియడంతో సొంతూర్లకు వెళ్లిన వారంతా హైదరాబాద్ పయనమయ్యారు. విజయవాడ- హైదరాబాద్, హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారులపై వాహనాల రద్దీ బాగా పెరిగింది. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై సాధారణ రోజుల్లో రోజుకు 20వేల వాహనాలు తిరుగుతుండగా.. ఆదివారం ఒక్కరోజే 30 వేల వాహనాలు రాకపోకలు సాగించాయి.
హైవేలపై ఉన్న టోల్‌ప్లాజాలకు వాహనాల తాకిడి ఒక్కసారిగా పెరగడంతో ట్రాఫిక్ జాం ఏర్పడింది. అలాగే, మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ మండల పరిధిలోని జీ ఎంఆర్ టోల్ ప్లాజా వద్ద జడ్చర్ల నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే రహదారి ఆదివారం రాత్రి 9.30 నుంచి 10గంటల ప్రాంతంలో కిక్కిరిసిపోయింది. సుమారు కిలోమీటరు వరకు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో టోల్‌గేట్‌కు ఉన్న నాలుగు గేట్లతోపాటు వీఐపీ దారిని కూడా తెరిచారు. అలాగే కర్నూలు వైపు నుంచి హైదరాబాద్‌కు వెళ్లే వాహనాలతో అడ్డాకుల మండలం శాఖాపూర్ ఎల్‌అం డ్‌టీ టోల్‌ప్లాజా వద్ద ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనాల రద్దీతో టోల్‌ప్లాజా నిర్వాహకులకు కాసులవర్షం కురిసింది.