అణుయుద్ధానికే అమెరికా తెగిస్తోంది! | Sakshi
Sakshi News home page

అణుయుద్ధానికే అమెరికా తెగిస్తోంది!

Published Sat, Jun 3 2017 3:08 PM

అణుయుద్ధానికే అమెరికా తెగిస్తోంది! - Sakshi

ప్యాంగ్యాంగ్‌: అమెరికా తాజాగా ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణులను (ఐసీబీఎం) మధ్యలోనే కూల్చివేసే వ్యవస్థను అమెరికా విజయవంతంగా పరీక్షించడంపై ఉత్తర కొరియా మండిపడింది. ఇది సైనికంగా తీవ్రంగా రెచ్చగొట్టడమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది.

'ఇది సైనికంగా తీవ్రంగా రెచ్చగొట్టే చర్య. అణుయుద్ధాన్ని తెరతీయాలన్న అమెరికా వికృత కోరికకు ఇది అద్దం పడుతోంది. ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా అణుయుద్ధాన్ని మొదలుపెట్టే సన్నాహాలు తుదిదశకు చేరాయన్న సంకేతాన్ని ఈ రిస్కీ చర్య ఇస్తోంది' అని కొరియా ప్రజా ఆర్మీ వ్యూహాత్మక దళ అధికార ప్రతినిధి పేర్కొన్నట్టు ఆ దేశ న్యూస్‌ ఏజెన్సీ (కేసీఎన్‌ఏ) పేర్కొంది.

కొరియా తన ఆత్మరక్షణకు అణ్వాయుధ బలాన్ని పెంపొందించుకోవడం సబబేనని అమెరికా తలపెడుతున్న ఇలాంటి చర్యలు రుజువుచేస్తున్నాయని పేర్కొంది. తమ అణ్వాయుధాలను ఇలాంటి ఇంటర్‌సెప్షన్‌ వ్యవస్థలు అడ్డుకుంటాయనుకుంటే అది పొరపాటేనని హెచ్చరించింది. ఒకవైపు వరుస అణ్వాయుధ పరీక్షలతో, ప్రయోగాలతో ఉత్తర కొరియా చెలరేగిపోతుండగా.. ప్రత్యర్థులు ప్రయోగించే అణ్వాయుధాలను మధ్యలోనే కూల్చివేసే వ్యవస్థను అమెరికా మంగళవారం విజయవంతంగా పరీక్షించిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement