ఆధార్ కు ఉపయోగించే అన్ని బయోమెట్రిక్ యంత్రాలలో ఆధార్ ఎన్‌క్రిప్షన్ కీని పొందుపరచనున్నారు.
న్యూఢిల్లీ: ఆధార్ ధ్రువీకరణకు ఉపయోగించే అన్ని బయోమెట్రిక్ యంత్రాలలో ఆధార్ ఎన్‌క్రిప్షన్ కీని పొందుపరచాలని విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) నిర్ణయించింది. నాలుగైదు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. ప్రస్తుతం ఆధార్‌ను ధ్రువీకరించేందుకు ఉపయోగిస్తున్న అన్ని యంత్రాలు ఎస్‌టీక్యూసీ (స్టాండర్డైజేషన్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ సర్టిఫికేషన్) కలిగినవేనని యూఐడీఏఐ సీఈవో అజయ్ భూషణ్ పాండే చెప్పారు.
అయినా మరింత భద్రత కోసం ఎన్‌క్రిప్షన్ కీని పొందుపరచడం ద్వారా యూఐడీఏఐ వద్ద కచ్చితంగా ఆ యంత్రాలు నమోదయ్యేలా చూస్తున్నామని తెలిపారు. తర్వాత ఆధార్‌ను ధ్రువీకరించేందుకు ఉపయోగించే స్మార్ట్‌ఫోన్లు సహా ఏ బయోమెట్రిక్ యంత్రాన్నైనా యూఐడీఏఐ వద్ద నమోదు చేసుకోవాల్సిందేనని పేర్కొన్నారు.