టూవీలర్లకు పండుగ కళ
న్యూఢిల్లీ: పండుగ సీజన్ నేపథ్యంలో అక్టోబర్‌లో ద్విచక్ర వాహనాల విక్రయాలు జోరుగా సాగగా.. కార్ల అమ్మకాలు మాత్రం మిశ్రమంగా నమోదయ్యాయి. వాహన తయారీ సంస్థలు శుక్రవారం ప్రకటించిన అమ్మకాల గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మెరుగైన రుతుపవనాల కారణంగా గ్రామీణ మార్కెట్లలో అమ్మకాలు పెరగడంతో ద్విచక్ర వాహన తయారీ సంస్థలు హీరో మోటో కార్ప్, హోండా మోటార్‌సైకిల్ (హెచ్‌ఎంఎస్‌ఐ) గణనీయంగా ప్రయోజనం పొందాయి. తాము ఒక నెలలో 6 లక్షల పైగా అమ్మడం ఇదే ప్రథమం అని హీరో పేర్కొంది. మరోవైపు, కార్ల విషయానికొస్తే.. మారుతీ సుజుకీ ఇండియాతో పాటు హ్యుందాయ్ విక్ర యాలు ఒక మోస్తరు పనితీరు కనపర్చాయి.
కష్టకాలం కొనసాగవచ్చు: కొత్త కార్లకు డిమాండ్‌తో పాటు పండుగ సీజన్ కారణంగా తమ అమ్మకాలు కాస్త మెరుగ్గా ఉన్నాయని జనరల్ మోటార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ పి. బాలేంద్రన్ చెప్పారు. ప్రస్తుతం డిస్కౌంట్లు తారస్థాయికి చేరుకున్నాయని, ఇంధనాల ధరల మధ్య వ్యత్యాసాలు తగ్గిపోతుండటంతో డీజిల్ వాహన విక్రయాలు తగ్గుతున్నాయని ఆయన తెలిపారు. కాగా 2013-14లో దేశీయంగా ద్విచక్ర వాహనాల అమ్మకాలు ఒక మోస్తరుగానే ఉండొచ్చని రేటింగ్ ఏజెన్సీ ఐసీఆర్‌ఏ అంచనా వేసింది.