breaking news
hero motor cars
-
టూవీలర్లకు పండుగ కళ
న్యూఢిల్లీ: పండుగ సీజన్ నేపథ్యంలో అక్టోబర్‌లో ద్విచక్ర వాహనాల విక్రయాలు జోరుగా సాగగా.. కార్ల అమ్మకాలు మాత్రం మిశ్రమంగా నమోదయ్యాయి. వాహన తయారీ సంస్థలు శుక్రవారం ప్రకటించిన అమ్మకాల గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మెరుగైన రుతుపవనాల కారణంగా గ్రామీణ మార్కెట్లలో అమ్మకాలు పెరగడంతో ద్విచక్ర వాహన తయారీ సంస్థలు హీరో మోటో కార్ప్, హోండా మోటార్‌సైకిల్ (హెచ్ఎంఎస్ఐ) గణనీయంగా ప్రయోజనం పొందాయి. తాము ఒక నెలలో 6 లక్షల పైగా అమ్మడం ఇదే ప్రథమం అని హీరో పేర్కొంది. మరోవైపు, కార్ల విషయానికొస్తే.. మారుతీ సుజుకీ ఇండియాతో పాటు హ్యుందాయ్ విక్ర యాలు ఒక మోస్తరు పనితీరు కనపర్చాయి. కష్టకాలం కొనసాగవచ్చు: కొత్త కార్లకు డిమాండ్‌తో పాటు పండుగ సీజన్ కారణంగా తమ అమ్మకాలు కాస్త మెరుగ్గా ఉన్నాయని జనరల్ మోటార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ పి. బాలేంద్రన్ చెప్పారు. ప్రస్తుతం డిస్కౌంట్లు తారస్థాయికి చేరుకున్నాయని, ఇంధనాల ధరల మధ్య వ్యత్యాసాలు తగ్గిపోతుండటంతో డీజిల్ వాహన విక్రయాలు తగ్గుతున్నాయని ఆయన తెలిపారు. కాగా 2013-14లో దేశీయంగా ద్విచక్ర వాహనాల అమ్మకాలు ఒక మోస్తరుగానే ఉండొచ్చని రేటింగ్ ఏజెన్సీ ఐసీఆర్ఏ అంచనా వేసింది. -
మార్చికల్లా హీరో 15 కొత్త మోడల్స్
మకావూ: టూవీలర్ దిగ్గజం హీరో మోటోకార్ప్ 15కు పైగా కొత్త ఉత్పత్తులను ( కొత్త టూవీలర్లు, ప్రస్తుతమున్న మోడళ్లలో కొత్త వేరియంట్లు కూడా కలిపి) మార్కెట్లోకి తేనున్నది. పండుగల సీజన్ సందర్భంగా అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్లో ఈ కొత్త ఉత్పత్తుల్లో అధిక భాగం ఉత్పత్తులను మార్కెట్లోకి తెస్తామని కంపెనీ ఎండీ, సీఈవో పవన్ ముంజాల్ పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన హీరో గ్లోబల్ సేల్స్ అండ్ మార్కెటింగ్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. అమ్మకాలు బావుంటాయ్.. : వర్షాలు బాగా కురిసాయని, సెంటిమెంట్ మెరుగుపడిందని, ఇటీవలి ఆర్బీఐ నిర్ణయాలు కూడా అనుకూలంగా ఉన్నాయని, ఈ పండుగల సీజన్లో అమ్మకాలు జోరుగా ఉంటాయని పవన్ అభిప్రాయపడ్డారు. అమ్మకాలకు సంబంధించి అధ్వాన పరిస్థితులు అంతమయ్యాయని, ఇప్పుడు టూవీలర్ నిత్యావసరంగా మారిందని వివరించారు. వినూత్నమైన ఫీచర్లతో కొత్త టూవీలర్లను రూపొందిస్తున్నామని, వీటికి పేటెంట్ కోసం దరఖాస్తు చేశామని వివరించారు. హై ఎండ్ బైక్, కరిజ్మాను అప్‌గ్రేడ్ చేసి కొత్త వేరియంట్‌ను హీరో మోటొకార్ప్ తెస్తోంది. అమెరికాకు చెందిన ఇరిక్ బ్యుయెల్ రేసింగ్(ఈబీఆర్) కంపెనీతో జట్టు కట్టిన తర్వాత ఇరువురి భాగస్వామ్యంలో తొలిగా వస్తోన్న బైక్ ఇది. ఇక హోండా భాగస్వామ్యంతో కాకుండా తాము సొంతంగా డెవలప్ చేసుకున్న టెక్నాలజీతో తయారు చేసిన తొలి బైక్‌ను వచ్చే ఏడాది మార్కెట్లోకి తెస్తామని పవన్ చెప్పారు. కాగా జపాన్‌తో చెందిన హోండాతో భాగస్వామ్య ఒప్పందాన్ని రద్దు చేసుకున్న తర్వాత హీరో కంపెనీ దూకుడుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది