బాహుబలి-2 లాగే మరో ఆసక్తికర పార్ట్‌-2! | there is part-2 in drugs racket case investigation | Sakshi
Sakshi News home page

బాహుబలి-2 లాగే మరో ఆసక్తికర పార్ట్‌-2!

Aug 1 2017 2:14 PM | Updated on Sep 5 2018 8:43 PM

బాహుబలి-2 లాగే మరో ఆసక్తికర పార్ట్‌-2! - Sakshi

బాహుబలి-2 లాగే మరో ఆసక్తికర పార్ట్‌-2!

బాహుబలి వన్‌ సినిమా ముగింపు.. ఓ పెద్ద ప్రశ్నను సగటు ప్రేక్షకుడి ముందు ఉంచింది. అదే.. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?

డ్రగ్స్‌ కేసులో ఆగస్టు మొదటివారం తర్వాత మరో అంకం

బాహుబలి వన్‌ సినిమా ముగింపు.. ఓ పెద్ద ప్రశ్నను సగటు ప్రేక్షకుడి ముందు ఉంచింది. అదే.. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? ఇది రెండోపార్ట్‌ సినిమాపై అంతులేని ఆసక్తిని, ఉత్కంఠను రేకెత్తించింది. ఇప్పుడు అలాంటి ఆసక్తిని డ్రగ్స్‌ కేసు రేకెత్తించబోతుందా? ఈ కేసులో పార్ట్‌-1, పార్ట్‌-2 ఉండబోతున్నాయా?

బాహుబలి వన్‌ - టూ మాదిరిగానే... డ్రగ్స్‌ కేసులో సిట్‌ విచారణ..  వన్‌ -టూ పార్టులు సాగనున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే.. డ్రగ్స్‌ కేసులో ఇప్పటికే 12 మందికి నోటీసులిచ్చి విచారిస్తున్న ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ.. చార్జిషీట్‌ దాఖలుతో మొదటి అంకాన్ని త్వరలో ముగించనుంది. అదే సమయంలో ఈ నెల మొదటివారంలో రెండో అంకం మొదలుకానుందని తెలుస్తోంది. ఈ రెండో అంకం ఏమిటి? కొత్తగా ఎవరెవరిని విచారిస్తారన్నది ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. రెండో భాగంలో మరింతమంది సినీ ప్రముఖులు, ఇతర రంగాల పెద్దలు ఉన్నారని ప్రచారం సాగుతోంది. అయితే, సెకండ్‌ పార్ట్‌లో విచారణ ఎదుర్కొబోతున్న వాళ్ల పేర్లు బయటపెట్టొద్దంటూ ఉన్నతాధికారులపై ఒత్తిడి వస్తోందని సమాచారం. ఆగస్టులో రెండోపార్ట్‌ మరింత సీరియస్‌గా ఉంటుందనే సంకేతాలు మాత్రం బయటకు వస్తున్నాయి. ఇదే విషయం అందరిలో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. డ్రగ్స్‌ పార్ట్‌-2లో ఏముంటుందన్న తీవ్ర ఉత్కంఠ, ఎవరి పేర్లుంటాయనే ఆందోళన సినీ పరిశ్రమ వర్గాలను, ఇప్పటికే గుట్టుగా నోటీసులు ఎదుర్కొంటున్నవారిని వెంటాడుతోంది.

కాగా, తొలి విచారణ చార్జిషీట్‌లో సిట్‌ ఎలాంటి విషయాలను పొందుపరుస్తుందనేది కూడా ఇప్పుడు ఉత్కంఠను రేకెత్తిస్తోంది. సినిమారంగానికి చెందినవారిలో మరికొందరిని విచారణకు పిలుస్తారని ప్రచారం సాగుతోంది. ఎక్సైజ్‌ అధికారులు.. ఇదే విషయాన్ని చూచాయగా చెబుతున్నారు. ఆగస్టు మొదటివారం తర్వాతే వీరి విచారణ ఉంటుందని సమాచారం. ఇదే సమయంలో కమింగా విచారణను కీలకంగా భావిస్తున్నారు ఎక్సైజ్‌ అధికారులు. కొందరు టెక్నీషియన్స్‌, కొందరు సినీ ప్రముఖులు.. కమింగా ద్వారా డ్రగ్స్‌ పొందినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండో పార్ట్‌లో కమింగా కీలకం కాబోతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణలో బయటకు వెలుగుచూడని వారు.. డ్రగ్స్‌ వాడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఓవైపు కమింగాను విచారిస్తూనే మరోవైపు అనుమానితులను కూడా విచారిస్తున్నట్లు తెలిసింది. విచారణ ముగియగానే సరిపోదని, దాని తర్వాత వెలువరించే చార్జిషీట్‌ అందరి జాతకాలు బయటపెడుతుందని ఎక్సైజ్‌ అధికారుల వాదన.

ఇప్పటివరకు పూరి జగన్నాధ్‌ను 11 గంటలు, శ్యామ్‌ కె. నాయుడును 6 గంటలు, సుబ్బరాజును 13గంటలు, తరుణ్‌ను 13 గంటలు, నవదీప్‌ను 11 గంటలు, ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నాను 4గంటలు, చార్మిని 6 గంటలు, ముమైత్‌ఖాన్‌ను 6 గంటలు, రవితేజను 9 గంటలు, రవితేజ మాజీ డ్రైవర్‌ శ్రీనివాస్‌ను 4 గంటలు సిట్‌ అధికారులు విచారించారు. మరోవైపు  కెల్విన్‌, జీషన్‌ల అరెస్ట్‌ తర్వాత పలువురు సినీ ప్రముఖులతోపాటు మరో ప్రైవేటువ్యక్తిని విచారణకు పిలిచారు. అందరి విచారణ ముగిసిన తర్వాత ఈ కేసులో తొలి చార్జిషీట్‌ తీసుకురానున్నారు. ఇప్పటి దాకా విచారణకు హాజరైన వారిందరి పేర్లు చార్జిషీట్‌లో ఉంటాయా ? లేదా అన్నది త్వరలో స్పష్టం కానుంది. ఇప్పటి వరకు సిట్‌ జరిపిన విచారణలో డ్రగ్స్‌ సరఫరా, వినియోగానికి సంబంధించి సిట్‌ కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. దీని ఆధారంగా త్వరలోనే వాడకందారులతో పాటు అమ్మకందారుల గుట్టును కనిపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement