ఇద్దరు అమ్మాయిలపై ఆరు నెలలు అత్యాచారం
వ్యాన్‌లో ప్రతి రోజూ పిల్లలను స్కూలుకు తీసుకెళ్లి వచ్చే వ్యాన్ డ్రైవర్.. గత ఆరు నెలలుగా ఇద్దరు బాలికలపై అత్యాచారం చేసినందుకు అతడిని పోలీసులు అరెస్టు చేశారు.
వ్యాన్‌లో ప్రతి రోజూ పిల్లలను స్కూలుకు తీసుకెళ్లి వచ్చే వ్యాన్ డ్రైవర్.. గత ఆరు నెలలుగా ఇద్దరు బాలికలపై అత్యాచారం చేసినందుకు అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ దారుణం థానెలోని భివాండిలో వెలుగుచూసింది. తులసీరాం మనేరే (35) అనే ఈ నిందితుడిని అరెస్టు చేసినట్లు నిజామ్‌పురా ఇన్‌స్పెక్టర్ ఎస్‌వీ జాదవ్ తెలిపారు. 8, 9 ఏళ్ల వయసున్న ఇద్దరు అమ్మాయిలపై తన కారులోనే గత ఆరు నెలలుగా పలు సందర్భాల్లో అతడు అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతానికి ఇద్దరు బాలికలు మాత్రమే అతడి అఘాయిత్యం గురించి చెప్పారని, అయితే ఇతడి బాధితులు మరింతమంది ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇద్దరు అమ్మాయిలు స్కూలుకు రాకపోవడంతో.. వారి గురించి వాళ్ల తల్లిదండ్రులను టీచర్లు అడగడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అమ్మాయిలిద్దరూ తమ తల్లిదండ్రులకు విషయం చెప్పారని, వాళ్లు ఆ తర్వాత విచారణ జరిపి, పోలీసులకు ఫిర్యాదు చేశారని ఇన్‌స్పెక్టర్ జాదవ్ తెలిపారు. నిందితుడిపై 376 (అత్యాచారం), 323 (స్వచ్ఛందంగా గాయపరచడం), 506 (నేరపూరిత బెదిరింపు) సెక్షన్లతో పాటు పోస్కో చట్టం కింద కూడా కేసులు నమోదు చేశామన్నారు.