ఆఖరి బంతి వేసే వరకు మ్యాచ్ ఉంటుంది. ఏమైనా జరగొచ్చు’ అని రాష్ట్ర విభజనను ఉద్దేశించి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ప్రాంత నేతలు అదే స్థాయిలో ఎదురుదాడికి దిగారు.
వరంగల్/నిజామాబాద్/ భువనగిరి, న్యూస్‌లైన్: ‘ఆఖరి బంతి వేసే వరకు మ్యాచ్ ఉంటుంది. ఏమైనా జరగొచ్చు’ అని రాష్ట్ర విభజనను ఉద్దేశించి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ప్రాంత నేతలు అదే స్థాయిలో ఎదురుదాడికి దిగారు. మ్యాచ్ ఎప్పుడో ముగిసింది. ఒకసారి ఆట ముగిసిన తర్వాత మళ్లీ ఆడుడుండదు.. అవసరమైతే రీప్లే చేసుకుంటారు అని వారు పేర్కొన్నారు. పౌరసరఫరాల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్‌రావు, టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ గురువారం వేర్వేరు ప్రాంతాల్లో విలేకరులతో మాట్లాడారు. విభజనపై సీఎం కిరణ్ చేసిన వ్యాఖ్యలపై వారు మండిపడ్డారు.
విభజన ఆట ముగిసిందని, అందులో తెలంగాణ టీం గెలిచిందని శ్రీధర్‌బాబు వరంగల్ జిల్లా హన్మకొండలో వ్యాఖ్యానించారు. తెలంగాణపై అన్నిరకాల ఆలోచన చేసిన తరువాతే నిర్ణయం తీసుకున్నారని, ఇక మ్యాచ్ ముగిసినట్టేనని చెప్పారు. ఒకసారి ఆట ముగిశాక మళ్లీ ఆడుడుండదని వ్యాఖ్యానించారు. సీడబ్ల్యూసీలో తీసుకున్న నిర్ణయానికి సీఎం సహా పార్టీ నాయకులందరూ బద్ధులై ఉండాలన్నారు. పార్టీ నిర్ణయాలను ధిక్కరించిన వారందరిపై అధిష్టానం దృష్టి సారించిందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పెవిలియన్ దారిపట్టే సమయం ఆసన్నమైందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్‌రావు నిజామాబాద్‌లో చెప్పారు.
సీమాంధ్ర నేతలు ఎన్ని మ్యాచ్ ఫిక్సింగులకు పాల్పడినా తెలంగాణ ఏర్పాటు ఆగదన్నారు. రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు ఎన్ని గూగ్లీలు, బౌన్సర్లు వేసినా ఫోర్లు, సిక్సర్లతో తెలంగాణవాదులు సమాధానం చెబుతారన్నారు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన అని చెప్పుకుంటున్న కిరణ్‌కు లక్షణాలన్నీ సీమాంధ్రవేనని విమర్శించారు. హైదరాబాద్ ఫ్రీజోన్ కాదని, ఆరో జోన్‌లో భాగమని ఆనాడే ప్రకటించిన సీఎం ఇప్పుడు హైదరాబాద్‌పై చర్చ జరగాలనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో సీఎం కిరణ్ చెప్పిన ఆఖరిబంతి విషయం ఆయనకు కలగానే మిగిలిపోతుందని, ఆ ఒక్క బంతికి 10 పరుగులు చేయడం అసాధ్యమని టీఎన్‌జీవోస్ అధ్యక్షుడు దేవీప్రసాద్ నల్లగొండ జిల్లా భువనగిరిలో వ్యాఖ్యానించారు. విభజన ఆటలో తెలంగాణ విజయం ఖాయమైపోయిందని చెప్పారు. తెలంగాణలో సకల జనుల సమ్మె జరిగినప్పుడు హాజరు పట్టికలో సంతకం పెట్టకుండా అడ్డుకున్న ప్రభుత్వం ఇప్పుడు సీమాంధ్ర ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు.