రాజ్యసభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన షిండే
సీమాంధ్ర, తెలంగాణ సభ్యుల ఆందోళన మధ్య కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)ను రాజ్యసభలో ప్రవేశపెట్టారు.
	న్యూఢిల్లీ: సీమాంధ్ర, తెలంగాణ సభ్యుల ఆందోళన మధ్య  కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)ను రాజ్యసభలో ప్రవేశపెట్టారు. పలువురు సభ్యులు పోడియం వద్ద నిరసన తెలుపుతున్నప్పటికీ డిప్యూటీ చైర్మన్ పిజె కురియన్ అనుమతితో  షిండే బిల్లును సభలో చదవడం మొదలుపెట్టారు. షిండేకు రక్షణగా విహెచ్ హనుమంతరావు, ఇతర ఎంపిలు, మార్షల్స్  నిలబడ్డారు.
	
	బిల్లు రాజ్యాంగ విరుద్దం, బిల్లుకు రాజ్యాంగ బద్దతలేదని, బిల్లును తిరస్కరించాలని పలువురు సభ్యులు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులను డిప్యూటీ స్పీకర్ కురియన్ చదివి వినింపారు. నోటీస్ ఇచ్చిన  నరేష్ గుజ్రాల్, డెరిక్ ఒబెరాయ్ ఉన్నారు.
	
	బిల్లుకు రాజ్యాంగ బద్దతలేదని సభ్యులు బిగ్గరగా అరుస్తుండటంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దాంతో రాజ్యసభను అయిదవసారి వాయిదా వేశారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
