కుండబద్దలు కొట్టిన టాటా! | Sakshi
Sakshi News home page

కుండబద్దలు కొట్టిన టాటా!

Published Wed, Oct 26 2016 1:01 PM

కుండబద్దలు కొట్టిన టాటా!

  • మిస్త్రీ తొలగింపుపై తొలిసారి అధికారికంగా మీడియాకు వివరణ

  • న్యూఢిల్లీ: దేశీయ పారిశ్రామిక రంగాన్ని తీవ్రంగా కుదిపేసిన ఘటన.. టాటా సన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ పదవి నుంచి సైరస్‌ మిస్త్రీని ఉన్నపళంగా తొలగించడం.. చడీచప్పుడు లేకుండా, ఎలాంటి సంకేతాలు ఇవ్వకుండా హఠాత్తుగా ఇంత తీవ్రమైన నిర్ణయాన్ని టాటా గ్రూప్‌ తీసుకోవడానికి కారణం ఏమిటి? అన్నదానిపై అనేక కథనాలు వస్తూనే ఉన్నాయి. టాటా గ్రూప్‌ నష్టాల్లో ఉండటం, యూకే స్టీల్‌ పరిశ్రమను అమ్మేయడం వంటి కారణాల వల్లే మిస్త్రీని తొలగించినట్టు అనధికారిక వర్గాలను ఉటంకిస్తూ కథనాలు వచ్చాయి.

    ఈ నేపథ్యంలో తొలిసారిగా టాటా గ్రూప్‌ యాజమాన్యం అధికారికంగా ఈ విషయంలో స్పందించింది. టాటా గ్రూప్‌కు చెందిన సర్‌ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌ సభ్యుడైన వీఆర్‌ మెహతా తాజాగా ఈ విషయమై మీడియాతో ముచ్చటించారు. టాటా గ్రూప్‌లో 60శాతం వాటా కలిగిన ఈ ట్రస్ట్‌ అత్యంత శక్తిమంతమైనది. టాటా గ్రూప్‌ వ్యవహారాలన్నింటిలోనూ చాలావరకు ఈ ట్రస్ట్‌ మాటే చెల్లుబాటు అవుతుంది. దీని ట్రస్టీ అయిన వీర్‌ మెహతా ఓ టీవీచానెల్‌తో ప్రత్యేకంగా మాట్లాడుతూ అనేక విషయాలు వెల్లడించారు. టాటా గ్రూప్‌ వరుసగా ఎదుర్కొంటున్న నష్టాలే మిస్త్రీ తొలగింపునకు బలమైన కారణమని ఆయన కుండబద్దలు కొట్టారు. గ్రూప్‌కు చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌, జేఎల్‌ఆర్‌ (జాగ్వర్‌ ల్యాండ్‌ రోవర్‌) రెండు కంపెనీలపైనే మిస్త్రీ దృష్టి పెట్టారని చెప్పారు. ఈ రెండు కంపెనీలు తప్ప మిగతావన్నీ నష్టాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇలా కంపెనీలు నష్టాల్లో ఉండటంతో ట్రస్ట్‌ సేవా కార్యక్రమాలకు కోత పెట్టాల్సిన అగత్యం ఏర్పడిందని, దీనిని టాటాలు ఎంతమాత్రం ఒప్పుకోలేదని ఆయన వెల్లడించారు.

    మిస్త్రీ చైర్మన్‌గా టాటా గ్రూప్‌ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నడుచుకున్నారని, టాటా సైద్ధాంతిక ధర్మాలను ఆయన ఉల్లంఘించారని మెహతా స్పష్టం చేశారు. ముఖ్యంగా తన టెలికం భాగస్వామి అయిన డొకోమోకు వ్యతిరేకంగా న్యాయపోరు చేయాల్సి రావడం, ఈ పోరాటంలో ఓడిపోవడం వల్ల ఏకంగా 1.2 బిలియన్‌ డాలర్ల జరిమానా కట్టాల్సిన పరిస్థితి గ్రూప్‌కు ఏర్పడటాన్ని ఆయన ప్రస్తావించారు. 'ఇది '(డొకోమో కేసు) టాటాల సిద్ధాంతాలు, ధర్మాలకు అనుగుణమైనది కాదు. దీనిని మరింత సమర్థంగా ఎదుర్కొని ఉండాల్సింది' అని ఆయన అభిప్రాయపడ్డారు. అదేసమయంలో మిస్త్రీ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత టాటా గ్రూప్‌, ట్రస్ట్‌ మధ్య అగాథం పెరిగిపోయిందని, ఇది కూడా మిస్త్రీ తొలగింపునకు దారితీసిన అంశాల్లో ఒకటని ఆయన పేర్కొన్నారు.

    'మిస్త్రీకి టాటా సన్స్‌ చైర్మన్‌ బాధ్యతలు అప్పగించిన తర్వాత ట్రస్ట్‌ చైర్మన్‌గా రతన్‌ టాటానే కొనసాగారు. ఈ సమయంలో ట్రస్ట్‌కు, గ్రూప్‌కు మధ్య ఎలాంటి సంబంధాలు లేవు. రతన్‌, మిస్త్రీ భేటీ అయినప్పుడు ట్రస్ట్‌ అంశాల గురించి చర్చించేవారు. కానీ ట్రస్ట్‌ వ్యక్తం చేసిన ఆందోళనలు చాలావరకు పరిష్కరించబడలేదు' అని ఆయన పేర్కొన్నారు. అయితే, మిస్త్రీని అకస్మాత్తుగా తొలగించిన వ్యవహారం తమకు బాధ కలిగిస్తున్నదని పేర్కొన్నారు.       
     

Advertisement
Advertisement