దేశీయ విపణిలో కీలకమైన చిన్న మరియు మధ్య తరహా సంస్థలు (ఎస్‌ఎంఈ) రంగంలో దళితులకూ తగిన స్థానం కల్పించాలని ఐఏఎస్...
తెలంగాణ ప్రభుత్వ స్పెషల్ రిప్రజెంటేటివ్ రామచంద్రు నాయక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ విపణిలో కీలకమైన చిన్న మరియు మధ్య తరహా సంస్థలు (ఎస్‌ఎంఈ) రంగంలో దళితులకూ తగిన స్థానం కల్పించాలని ఐఏఎస్ (రిటైర్డ్), తెలంగాణ ప్రభుత్వ స్పెషల్ రిప్రజెంటేటివ్ రామచంద్రు నాయక్ కోరారు. దళిత్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (డిక్కీ) పారిశ్రామిక, వాణిజ్య ప్రదర్శనలో భాగంగా శనివారమిక్కడ ‘ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఆఫ్ ఎస్సీ/ఎస్టీ ఇన్ ఎస్‌ఎంఈ’ అనే అంశంపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రామచంద్రు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని దళిత జనాభాలో 50 శాతం మందికి బ్యాంక్ ఖాతాలు కూడా లేవని.. ఇలాంటి పరిస్థితుల్లో దళితులు ఆదాయ వనరులను సృష్టించే వారిగా ఎలా ఎదుగుతారని ప్రశ్నించారు.
అందుకే కేంద్రం, రాష్ట్రం రెండు ప్రభుత్వాలు దళిత ఎస్‌ఎంఈలను ప్రోత్సహించేలా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఆర్థిక సంస్థలు, బ్యాంకులు దళిత పారిశ్రామికవేత్తల కోసం పథకాలు రచించడమే కాదు.. వాటి గురించిన పూర్తి అవగాహన కల్పించడంలోనూ కృషిచేయాలన్నారు. అప్పుడే మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా నిపుణుల కొరత ఉందని, దీన్ని ఎస్‌ఎంఈ రంగం అందిపుచ్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రబ్యాంక్ జీఎం (ఎంఎస్‌ఎంఈ) రాధాకృష్ణమూర్తి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ జే రాజు, బ్యాంక్ ఆఫ్ బరోడా జీఎం (ఫైనాన్షియల్ ఇంక్లూజన్) కిశోర్ కరప్ పాల్గొన్నారు.