
అధికారంలోకి వస్తూనే ఆర్టీసీని విలీనం చేస్తాం
‘మూడేళ్లు ఓపిక పట్టండి. మనం అధికారంలోకి రావడం ఖాయం. వచ్చిన వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం..
సాక్షి, చిత్తూరు: ‘మూడేళ్లు ఓపిక పట్టండి. మనం అధికారంలోకి రావడం ఖాయం. వచ్చిన వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం.. ఆ తర్వాత కార్మికులు ప్రభుత్వ ఉద్యోగుల్లా బతుకుతారు’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. తిరుపతి రూరల్ మండలం తనపల్లి పీఎల్‌ఆర్ గార్డెన్స్‌లో మంగళవారం జరిగిన వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రెండో మహాసభలో వైఎస్ జగన్ ప్రసంగించారు. ఆర్టీసీని విలీనం చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని..
బాబు చేస్తే సరి.. లేకపోతే అధికారంలోకి వచ్చాక మనమే విలీనం చేసుకుందామని చెప్పారు. త్వరలో వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్‌కు గుర్తింపు వస్తుందన్నారు. ఆ తర్వాత రెండు సంవత్సరాల్లో జరిగే ఆర్టీసీ ఎన్నికల్లో యూనియన్ అన్ని స్థానాల్లో గెలిచి క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్పారు. వైఎస్ వారసుడిగా ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఆర్టీసీ కార్మికులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే 43 శాతం ఫిట్‌మెంట్‌కు బాబు ఒప్పుకున్నారన్నారు.
ఆర్టీసీ చార్జీలు పెంచినా... కార్మికులకు జీతాలు పెంచలేదన్నారు. ఆర్టీసీ బస్సు చార్జీలు, విద్యుత్ చార్జీలు పెంచకుండా ఐదేళ్లపాటు వైఎస్ పాలన చేశారని గుర్తుచేశారు. ఆర్టీసీని నిలబెట్టాలని, ఆర్థికంగా బలోపేతం చేయాలని, కార్మికులకు మంచి జరగాలని వైఎస్ కాంక్షించారన్నారు. వైఎస్, చంద్రబాబు పాలన గురించి నాకంటే మీకే బాగా తెలుసన్నారు. ఇవాళ ఎన్నికలు పెడితే బాబుకు డిపాజిట్ కూడా దక్కదన్నారు. వైఎస్ స్ఫూర్తితో... మాట చెబితే మాటమీద నిలవడం.. అందుకు ఎందాకైనా వెళ్లడం తాను నేర్చుకున్న రాజకీయమన్నారు.
కార్యక్రమంలో ఆర్టీసీ యూనియన్ రాష్ట గౌరవాధ్యక్షుడు, కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, ఎంపీలు మిథున్‌రెడ్డి, వరప్రసాద్, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నారాయణస్వామి, ఆర్‌కే రోజా, దేశాయ్ తిప్పారెడ్డి, సునీల్‌కుమార్, వైఎస్సార్ టీయూసీ రాష్ట అధ్యక్షుడు గౌతంరెడ్డి, ఆర్టీసీ యూనియన్ రాష్ట అధ్యక్షుడు రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మాకు న్యాయం చేయండి
తిరుచానూరు: 1998 డీఎస్సీ అర్హత పరీక్షలో విజయం సాధించి, ఇంటర్వ్యూల్లో అన్యాయానికి గురైన తమకు న్యాయం జరిగేలా చూడాలని 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ టీచర్ల యూనియన్ చిత్తూరు జిల్లా నాయకులు ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. వారు మంగళవారం చిత్తూరు జిల్లా తిరుపతిలో జగన్‌ను కలిసి తమ సమస్యను వివరించారు. జగన్ స్పందిస్తూ.. ఈ అంశంపై శాసనసభలో చర్చించి, న్యాయం జరిగేలా చూస్తానన్నారు.