ఆవు కళ్ల చిన్నారి దేవత.. | Sakshi
Sakshi News home page

ఆవు కళ్ల చిన్నారి దేవత..

Published Sat, Sep 10 2016 9:06 PM

ఆవు కళ్ల చిన్నారి దేవత..

వర్షాకాలం మొదలైనప్పటి నుంచి రైతులు ఆమె ఇంటి ముందు క్యూ కడతాడు. ఏ ఇంట్లో పిల్లలు పుట్టినా మొదటి ఆశీర్వాదం తీసుకునేది ఆమె దగ్గరే. దర్జాను ఒలకబోస్తూ సింహాసనంపై కూర్చుని భక్తులను ఆశీర్వదించే ఈ 'కుమారి' దేవత.. ఏడేళ్ల చిన్నారి యునిక.

బౌద్ధలామాల తరహాలో దాదాపు ఏడో శతాబ్ధం నుంచి నేపాల్ లో కుమారి దేవతల పరంపర కొనసాగుతోంది. హిందూ కుటుంబాల్లో కొన్ని ప్రత్యేక లక్షణాలతో పుట్టిన చిన్నపిల్లల్ని 'కుమారి'లుగా ఎంపికచేస్తారు మతపెద్దలు. ఆవు లాంటి కళ్లు, బాతు లాంటి స్వరం, జింక లాంటి కాళ్లున్న చిన్నపిల్లల్ని గాలించి, వారికి రకరకాల పరీక్షలు నిర్వహిస్తారు. ఎంపికైనవారిలో ధైర్యసాహసాలు మెండుగా ఉన్నవారిని కుమారిగా ప్రకటిస్తారు. అలా ఆ పిల్లలు దేవతలైపోయినట్లు లెక్క. యవ్వనంలోకి ప్రవేశించిన వెంటనే ఆ కుమారిలు తమ దివ్యత్వాన్ని కోల్పోతారు. తర్వాత సాధారణ అమ్మాయిల్లా చదువు కొనసాగించి పెళ్లిళ్లు చేసుకుంటారు.

ఇప్పటివరకు చాలా మంది ఇలా కుమారిలుగా ఎంపికై కొన్నేళ్లు దేవతహోదాను అనుభవించారు. ఇప్పుడా వంతు యునికాకు దక్కింది. కుమారిగా ఎంపికైన పిల్లల్ని ఇంటి నుంచి బయటికి పంపరు. వారి పాదాలు నేలకు తాకకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. పండుగలప్పుడు మాత్రమే బయటికి వచ్చే చిన్నారి దేవతలు.. తివాచీలపై తప్ప భూమిమీద పాదంమోపరు.


అనాదిగా వస్తోన్న ఈ కుమారి ప్రక్రియతో పిల్లల్ని హింసిస్తున్నారని, ఇకనైనా దీనికి స్వస్తిపలకాలని కొందరు సామాజికవేత్తలు గతంలోనే నేపాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు ఆ పిటిషన్లను కొట్టేసింది. 2015నాటి భూకంపం తర్వాత అక్కడి ప్రజలు కుమారిలను మరింత భక్తిశ్రద్ధలతో కొలుస్తుండటం గమనార్హం. ప్రస్తుత కుమారి దేవత యనిక తల్లిదండ్రులతోనే పటాన్ అనే ఊళ్లో నివసిస్తోంది. అమెరికాకు చెందిన ఏబీసీ నైట్ లైన్ సంస్థ యనికాకు సంబంధించిన డాక్యుమెంటరీని రూపొందించడంతో ఇప్పుడామె పశ్చిమదేశాల్లోనూ పాపులర్ అయింది. దీంతోపాటు మాజీ కుమారీల ఇంటర్వ్యూలను సైతం పొందుపర్చారా డాక్యుమెంటరీలో.

Advertisement
 
Advertisement