పట్టాలు తప్పిన దురంతో | Secunderabad-Mumbai train accident victim | Sakshi
Sakshi News home page

పట్టాలు తప్పిన దురంతో

Sep 13 2015 12:37 AM | Updated on Sep 3 2017 9:16 AM

పట్టాలు తప్పిన దురంతో

పట్టాలు తప్పిన దురంతో

సికింద్రాబాద్ నుంచి ముంబైకి బయలుదేరిన దురంతో రైలు పట్టాలు తప్పిన ఘటనలో ఇద్దరు మహిళా ప్రయాణికులు

ఇద్దరు హైదరాబాదీ మహిళల మృతి, ఏడుగురికి గాయాలు
 కర్ణాటకలో ప్రమాదానికి గురైన సికింద్రాబాద్-ముంబై రైలు
విచారణకు ఆదేశించిన రైల్వే మంత్రి
మృతుల కుటుంబాలకు 2 లక్షల పరిహారం


కలబుర్గి(కర్ణాటక): సికింద్రాబాద్ నుంచి ముంబైకి బయలుదేరిన దురంతో రైలు పట్టాలు తప్పిన ఘటనలో ఇద్దరు మహిళా ప్రయాణికులు మరణించారు. ఏడుగురు గాయపడ్డారు. కర్ణాటకలోని కలబుర్గి సమీపంలోని మార్టూర్ స్టేషన్ సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2.15 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని అసిస్టెంట్ డివిజనల్ రైల్వే మేనేజర్ (సోలాపూర్) కె.మధుసూదన్ చెప్పారు. మృతులను హైదరాబాద్ నుంచి ముంబైకి బయలుదేరిన పుష్పలత(40), జ్యోతి(28)గా గుర్తించినట్లు తెలిపారు. గాయపడిన వారిని గుల్బర్గాలోని ఆస్పత్రికి తరలించామని, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఈ దుర్ఘటనపై విచారణ జరపాలని రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు రైల్వే భద్రత కమిషనర్‌ను ఆదేశించారని, నివేదిక వస్తే ప్రమాదానికి అసలు కారణమేంటో తెలుస్తుందని రైల్వే బోర్డు చైర్మన్ ఏకే మిట్టల్ చె ప్పారు. ‘దురంతో ప్రమాదం కలచివేసింది.

బాధితుల కు తక్షణమే వైద్య, ఇతరత్రా సహాయక సేవలు అందించాలని రైల్ బోర్డు చైర్మన్‌ను ఆదేశించాం’ అని రైల్వే మంత్రి ప్రభు ట్విటర్‌లో పేర్కొన్నారు. మృతుల కుటుం బాలకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.25 వేలు ఇస్తామని మిట్టల్ చెప్పారు. 700 మంది పోలీసులు, సీఆర్‌పీఎఫ్, రైల్వే సిబ్బంది సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారు. ప్రయాణికులందరినీ వారి గమ్యస్థానాలకు ఉచితంగా పంపాలని ఈశాన్య కర్ణాటక ఆర్టీసీని కోరామని, ఏ ఒక్క ప్రయాణికుడు కూడా నిలిచిపోలేదని మధుసూదన్ చెప్పారు. ప్రమాద స్థలంలో ఒక లైనును పునరుద్ధరించామని, శనివారం అర్ధరాత్రికల్లా మిగతా పనులు పూర్తవుతాయని రైల్వే అధికార ప్రతినిధి అనిల్ సక్సేనా చెప్పారు. దీనిపై రైల్వే హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement