ఎత్తుకు పైఎత్తు

ఎత్తుకు పైఎత్తు - Sakshi


ఎమ్మెల్యేలు@శశివిలాస్‌.. పన్నీర్‌ మసాలా పబ్లిక్‌ హిట్‌

తమిళనాడులో క్షణక్షణానికీ మారుతున్న రాజకీయ సమీకరణలు

- మధుసూదనన్‌పై చిన్నమ్మ వేటు

- ప్రిసీడియం చైర్మన్‌గా సెంగోట్టియన్‌ నియామకం

- ఎమ్మెల్యేలను బయటకు తెచ్చేందుకు పన్నీర్‌ తీవ్ర ప్రయత్నాలు

- కోర్టు ఆదేశంతో శిబిరాలను విచ్ఛిన్నం చేసే యత్నం

- శశికళ ఎన్నిక చెల్లదంటూ ఈసీకి మధుసూదనన్‌ ఫిర్యాదు

- గవర్నర్‌ రాజ్యాంగాన్ని అమలు చేయక తప్పదని చిన్నమ్మ ధీమా

- అసెంబ్లీని సమావేశ పరచాలని గవర్నర్‌కు స్టాలిన్‌ వినతి

- ఎటు వైపు మొగ్గాలో తేల్చేందుకు కాంగ్రెస్‌ నేతలకు రాహుల్‌ పిలుపు

- శాంతిభద్రతల అంశంపై సీఎస్, డీజీపీతో గవర్నర్‌ సమీక్ష

- తమిళనాడులో తొలగని ఉత్కంఠ




చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి

చర్యలు, ప్రతి చర్యలు... సవాళ్లు, ప్రతి సవాళ్లు... ఎత్తులు, పైఎత్తులు... వ్యూహాలు, ప్రతివ్యూహాలతో తమిళనాడులో రాజకీయ సమీకరణాలు క్షణక్షణం మారిపోతున్నాయి. ముఖ్యమంత్రి కుర్చీకోసం తలపడుతున్న ఆపద్ధర్మ సీఎం పన్నీర్‌ సెల్వం, అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ శుక్రవారం రాజకీయాన్ని మరింత రసవత్తర స్థాయికి చేర్చారు. శశికళ ప్రమాణ స్వీకారం కోసం మద్రాసు యూనివర్సిటీ ఆవరణంలో ఏర్పాటు చేసిన బందోబస్తును పన్నీర్‌ తొలగింపచేశారు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పుట్టిన అన్నాడీఎంకేను ఎట్టి పరిస్థితుల్లోనూ శశికళ కుటుంబం చేతుల్లో పడనీయబోమని ప్రకటించారు.



అమ్మ జయలలిత చీరలాగిన డీఎంకేతో అంటకాగుతున్న పన్నీర్‌ సెల్వం పచ్చి ద్రోహి అని శశికళ దీటుగా ధ్వజమెత్తారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా తాను కచ్చితంగా బాధ్యతలు స్వీకరిస్తానని ధీమా వ్యక్తం చేశారు. పన్నీర్‌ శిబిరంలో చేరిన ప్రిసీడియం చైర్మన్‌ మధుసూదనన్‌ను పార్టీ నుంచి బహిష్కరించి... ఆయన స్థానంలో మాజీమంత్రి సెంగోట్టియన్‌ను నియమించారు. ఇందుకు ప్రతి చర్యగా మధుసూదనన్‌ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నికే చెల్లదంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. శశికళను పార్టీ నుంచి బహిష్కరించడంతోపాటు ప్రాథమిక సభ్యత్వాన్ని సైతం రద్దుచేశామని ప్రకటించారు. పోయెస్‌ గార్డెన్‌లోని వేద నిలయం (జయలలిత ఇల్లు)ను అమ్మ స్మారకమందిరంగా మార్చుతామని వెల్లడించారు.



మరోవైపు ఎమ్మెల్యేలు ఎక్కడున్నారనే అంశంపై తమకు నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించగా... శశికళ వర్గం ఎమ్మెల్యేల శిబిరాన్ని మార్చేసింది. తమను ఎవరూ నిర్బంధించలేదని కొందరు అనుకూల ఎమ్మెల్యేలతో మాట్లాడించింది. ప్రస్తుత సంక్షోభానికి ఒకటి, రెండు రోజుల్లో ముగింపు పడి తామే అధికారం చేపడతామని శశికళ ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. శాంతి భద్రతల పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్, డీజీపీ రాజేంద్రన్‌తో సమీక్షించిన గవర్నర్‌ విద్యాసాగర్‌రావు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో సీఎం కుర్చీ ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ మరింత తీవ్రమైంది. అయితే మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తనను ఆహ్వానించాలంటూ శశికళ చేసిన విజ్ఞప్తిని గవర్నర్‌ తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరంలేదని మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రస్తుత సంక్లిష్ట రాజకీయ పరిస్థితుల్లో కేంద్రం సలహా మేరకే గవర్నర్‌ వ్యవహరించే అవకాశమే ఎక్కువగా ఉంటుందని ఆయన అభిప్రాయపడటం భవిష్యత్‌ పరిణామాలకు సూచకంగా కనిపిస్తోంది.



రప్పిస్తారా? కాపాడుకుంటారా?

రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, పార్టీ కార్యకర్తలు, సినీ తారలు తనకు అండగా నిలిచినా... ఇతర రాజకీయ పార్టీలు తననే బలపరుస్తున్నా ఎమ్మెల్యేలు శశికళ శిబిరంలో ఉన్నతంకాలం తానేం చేయలేనని పన్నీర్‌కు తెలుసు. అందుకే శశికళ శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలను బయటకు తేవడానికి ముప్పేట దాడి మొదలుపెట్టారు. ఎమ్మెల్యేలను శశికళ నిర్బంధించారంటూ హైకోర్టులో తన మద్దతుదారులతో పిటిషన్‌ వేయించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కనిపించడం లేదని ఆయా నియోజక వర్గాలకు చెందిన ప్రజల ద్వారా పోలీసులకు ఫిర్యాదు ఇప్పించారు. పన్నీర్‌ దూకుడును గమనించిన శశికళ వర్గం ఎమ్మెల్యేలెవ్వరూ చేజారకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేసుకున్నారు. పిటిషన్‌పై స్పందించిన చెన్నై హైకోర్టు ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారు? ఎలా ఉన్నారు? అనే అంశంపై సోమవారంలోగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి, డీజీపీ, చెన్నై పోలీసుకమిషనర్, కాంచీపురం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. దీన్ని అవకాశంగా తీసుకుని పోలీసు బలంతో ఎమ్మెల్యేలను బయటకు రప్పించేందుకు పన్నీర్‌ అధికార అస్త్రం ప్రయోగించారు.



అయితే ఈ విషయం తెలియడంతో చిన్నమ్మ మద్దతుదారులు వాయువేగంతో తమ ఎమ్మెల్యేలను మరో శిబిరానికి తరలించారు. ఈస్ట్‌ కోస్టు రోడ్డులోని గోల్డన్‌ బే రిసార్ట్స్‌లో ఉన్న ఎమ్మెల్యేల వద్దకు వెళ్లబోయిన మీడియాను చిన్నమ్మ నియమించిన బౌన్సర్లు అడ్డుకున్నారు. శశికళకు అత్యంత నమ్మకస్తులైన 11 మంది శాసనసభ్యులను మాత్రం రిసార్ట్స్‌ నుంచి రెండు కిలోమీటర్ల దూరానికి తీసుకుని వచ్చి తాము ఎలాంటి నిర్బంధంలో లేమనీ, స్వేచ్ఛగా ఉన్నామని మాట్లాడించి తీసుకుని వెళ్లారు. తన ప్రయత్నం సఫలం కాకపోవడంతో పోలీసు బలగాలను ప్రయోగించి ఒకటి రెండు రోజుల్లో వారిని బయటకు తీసుకు రావడానికి పన్నీర్‌ వ్యూహాలు రచిస్తున్నారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎమ్మెల్యేలను చేజారనివ్వకుండా శశికళ కూడా చాలా గట్టి ఏర్పాట్లు చేశారు. పన్నీర్‌ వెనుక డీఎంకే ఉందని శశికళ మద్దతుదారులు పెద్ద ఎత్తున రాజకీయ దాడికి దిగారు. రహస్య శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలతో శశికళ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు.



మంత్రులు, ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు

మంత్రులు, ఎమ్మెల్యేలు కనిపించడం లేదని ఆయా నియోజక వర్గాలకు చెందిన ప్రజల ద్వారా పోలీసులకు ఫిర్యాదు ఇప్పించి పరోక్షంగా వారి మీద ఒత్తిడి పెంచడానికి పన్నీర్‌ వర్గం స్కెచ్‌ గీసింది. ఇందులో భాగంగానే శుక్రవారం వేలూరు జిల్లా ఆరణి శాసనసభ్యుడు, దేవాదాయ శాఖ మంత్రి సేపూరు రామచంద్రన్‌ ఈ నెల 7వ తేదీ నుంచి కనిపించడం లేదని ఆ నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు ఆరణి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇదే జిల్లాలోని అంటూరు ఎమ్మెల్యే బాలసుబ్రమణి కిడ్నాప్‌కు గురయ్యారని అక్కడి పన్నీర్‌ మద్దతుదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ రకమైన ఒత్తిడి వస్తుందని ముందే ఊహించిన చిన్నమ్మ మద్దతుదారులు ఎమ్మెల్యేలను శిబిరానికి తరలించే సమయంలోనే వారి మొబైల్‌ ఫోన్లు తీసుకుని స్విచ్చాఫ్‌ చేసేశారు.



తెర మీదకు స్టాలిన్, రాహుల్‌

అన్నా డీఎంకేలో సంక్షోభం వారి అంతర్గత వ్యవహారమని చెబుతూ వచ్చిన డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత స్టాలిన్‌ శుక్రవారం రాత్రి తెర మీదకు వచ్చారు. గవర్నర్‌ను కలసి అసెంబ్లీని సమావేశపరచి, సుస్థిర ప్రభుత్వం ఏర్పాటయ్యేలా చూడాలని డిమాండ్‌ చేయడం ద్వారా పరోక్షంగా పన్నీర్‌కు మేలు చేసే ఎత్తుగడ వేశారు. పన్నీరే కాకుండా ప్రధాన ప్రతిపక్షం కూడా శాసనసభను సమావేశ పరచాలని కోరిందని గవర్నర్‌ చెప్పుకునే అవకాశం కల్పించారు. అయితే ఈ అంశం గురించి శశికళ వర్గం తన మీద రాజకీయ దాడి చేయకుండా ఉండేందుకు పన్నీర్‌ సెల్వం పూర్తి స్థాయి సీఎంగా పనిచేయలేక పోయారని చిన్న విమర్శ చేశారు.



మరోవైపు డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌ కూడా పెరంబలూరులో పార్టీ వర్గాలతో అత్యవసరంగా సమావేశమయ్యారు. పన్నీర్‌కు మద్దతుగా స్పందించాలని పలువురు కార్యదర్శులు సూచించగా... ఆలోచించి నిర్ణయం తీసుకుందామని ఆయన చెప్పినట్లు తెలిసింది. శశికళకు మద్దతిస్తామంటూ టీఎన్‌సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరుసు వ్యాఖ్యానించడాన్ని ఆ పార్టీ సీనియర్‌ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయాన్ని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ దృష్టికి తీసుకెళ్లగా ఆయన పిలిపించి తటస్థంగా ఉండాలని సూచించారు. శాసనసభలో ఎనిమిదిమంది సభ్యుల బలం ఉన్న కాంగ్రెస్‌ చిన్నమ్మ వైపు మళ్లకుండా పన్నీర్‌ ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్‌ చేయగలిగారని తెలుస్తోంది. అయితే చిన్నమ్మ వర్గం సైతం కాంగ్రెస్‌ మద్దతుకోసం ప్రయత్నాలు చేస్తోంది.



తేల్చని గవర్నర్‌.. తీవ్రమైన ఉత్కంఠ

ముఖ్యమంత్రి సీటు దక్కించుకునేందుకు పడుతున్న పన్నీర్, శశికళతో మాట్లాడి వారి వాదనలు, అభిప్రాయాలు విన్న ఇన్‌చార్జ్‌ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు 24 గంటలు గడిచినా తన నిర్ణయం ఏమిటో ప్రకటించలేదు. శశికళ మీద ఉన్న అక్రమాస్తుల కేసు, న్యాయ సలహాలు తీసుకోవడం, క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అవగాహన చేసుకునే పేరుతో ఆయన శుక్రవారంకూడా ఈ సంక్షోభానికి ముగింపు పలకలేదు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శనం కోసం ఆయన ఎదురు చూస్తున్నారు.



ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్ర బీజేపీ పన్నీర్‌కు గట్టిగా మద్దతు ఇస్తున్నందువల్ల కేంద్రం నుంచి పన్నీర్‌ బలపరీక్షకు అవకాశం ఇవ్వాలని సందేశం వస్తే గవర్నర్‌ దాన్ని అమలు చేస్తారా? లేక రాజ్యాంగాన్ని కాపాడడానికి స్వతంత్ర నిర్ణయం తీసుకుంటారా? అన్నాడీఎంకే సంక్షోభానికి ఏ విధమైన ముగింపు పలుకుతారనే విషయం అటు రాజకీయ పార్టీలు, ఇటు ప్రజల్లోను తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు శశికళను ఇప్పట్లో సీఎం చేయడం సరైందని కాదని గవర్నర్‌ కేంద్రానికి పంపిన నివేదికలో పొందుపరచినట్లు కొన్ని తమిళ, తెలుగు టీవీ చానళ్లలో కథనాలు ప్రసారం కావడం కలకలం సృష్టించింది. అయితే ఈ కథనాలు, ప్రచారాలను రాజ్‌ భవన్‌ వర్గాలు ఖండించాయి.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top