దారుణం: ముస్లిం గర్భిణీ సజీవ దహనం! | Sakshi
Sakshi News home page

దారుణం: ముస్లిం గర్భిణీ సజీవ దహనం!

Published Tue, Jun 6 2017 11:42 AM

దారుణం: ముస్లిం గర్భిణీ సజీవ దహనం!

బెంగళూరు: కర్ణాటకలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. దళిత యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుందన్న కారణంతో గర్భిణీ అయిన ఓ ముస్లిం మహిళను ఆమె కుటుంబసభ్యులే సజీవంగా దహనం చేశారు. ఈ అమానుష ఘటన బీజాపూర్‌ జిల్లాలోని గుండనకల గ్రామంలో జరిగింది. గుండనకలకు చెందిన బానూ బేగం (21) తన ఊరికి చెందిన దళిత యువకుడైన సాయబన్న శరణప్ప కొన్నూర్‌ (24)ను ప్రేమించింది. కొంతకాలంగా వీరి ప్రేమ గురించి గత జనవరిలో ఇద్దరి కుటుంబాలకు తెలిసింది. ఇరు కుటుంబాలు వీరి ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించారు.
 
వీరి ప్రేమ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన బాను కుటుంబం ఆమెను పోలీసు స్టేషన్‌కు ఈడ్చుకొచ్చి సాయబన్నకు వ్యతిరేకంగా పోస్కో కేసు పెట్టాలని ఫిర్యాదు చేసింది. అయితే, సాయబన్నపై ఎలాంటి క్రిమినల్‌ అభియోగాలు, చరిత్ర లేకపోవడంతో పోలీసులు అతన్ని విడిచిపెట్టారు. అనంతరం సాయబన్న  బానును తీసుకొని ఇంటినుంచి పారిపోయాడు. ఇద్దరూ కలిసి గోవా వెళ్లారు. ఆ తర్వాత రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకొని కర్ణాటకలోనే కొంతకాలం నివసించారు. ఈ క్రమంలో బాను గర్భవతి కావడంతో ఇరు కుటుంబాలు మారి ఉండవచ్చునన్న ఆశతో గత శనివారం (జూన్‌3న) ఊరికి తిరిగొచ్చారు.

అయితే, తమ వైఖరిని ఏమాత్రం మార్చుకొని ఇరుకుటుంబాలు సాయబన్న-బాను దంపతులను చూడటంతోనే గొడవకు దిగారు. బాను కుటుంబం బరితెగించి సాయబన్నపై దాడికి దిగింది. అతన్ని రాళ్లతో కొట్టి తరిమింది. దీంతో అక్కడి నుంచి తప్పించుకొని ప్రాణాలు కాపాడుతున్న సాయబన్న స్థానికంగా ఉన్న తాలికోట్‌ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించాడు. మరో పది నిమిషాల్లో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోగా.. అప్పటికే బానును ఆమె కుటుంబసభ్యులే కత్తితో పలుమార్లు పొడిచి.. ఆ తర్వాత సజీవ దహనం చేశారు. పట్టపగలే ఈ కిరాతకం జరుగుతున్నా, తన భార్యను కాపాడాలని సాయబన్న వేడుకున్నా గ్రామస్తులు ఎవరూ ముందుకురాలేదని, తమ ఇళ్లకు తలుపులు పెట్టుకొని లోపలే ఉండిపోయారని తెలుస్తోంది. ఈ ఘటనలో బాను తల్లిని, సోదరిని, సోదరుడిని, బాను అరెస్టు చేశారు. బాను మరో ఇద్దరు అక్కల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Advertisement
 
Advertisement