ఐఎస్‌ఐ చేతికి ఆర్మీ మిస్సైల్స్ డేటా

ఐఎస్‌ఐ చేతికి ఆర్మీ మిస్సైల్స్ డేటా - Sakshi


* పటన్ అరెస్టుతో వెలుగుచూస్తున్న వాస్తవాలు

* మిలటరీకి చెందిన ఫొటోలు, డాక్యుమెంట్లు అందజేత

* మహిళా ఉగ్రవాది నుంచి పటన్ అకౌంట్‌కు రూ. 74 వేలు

* ఉన్నతాధికారి కంప్యూటర్ నుంచి రహస్యాల చేరవేత

 

సాక్షి, హైదరాబాద్: ఆర్మీ రహస్యాలు పాక్ ఉగ్రవాదులకు చేరవేసిన సైనిక అధికారి పటన్‌కుమార్ అరెస్టుతో దిమ్మతిరిగే విషయాలు గురువారం వెలుగు చూశాయి. పటన్‌ను పోలీసు కస్టడీకి ఇవ్వాలని సీసీఎస్ పోలీసులు వేసిన పిటిషన్‌పై నాంపల్లి చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు విచారణను నేటికి వాయిదా వేసింది. ముద్దాయి తరఫున న్యాయవాది లేకపోవడంతో వాయిదా వేసినట్లు మేజిస్ట్రేట్ వెల్లడించారు. ముద్దాయి వాదన వినకుండా కస్టడీకి ఇవ్వలేమని, అతనికి పోలీసులు ముందుగా సమాచారం ఇవ్వాలని చెప్పారు. దీంతో పోలీసులు చంచల్‌గూడ జైలులో ఉన్న పటన్‌కు కస్టడీ పిటిషన్ విషయంపై వివరించారు.



ఇలావుండగా పటన్ నుంచి 4 కంప్యూటర్లు, ల్యాప్‌టాప్, బ్లూటూత్, 3 సెల్‌ఫోన్లు, నాలుగు పెన్‌డ్రైవ్‌లు, 10 సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు. హార్డ్‌డిస్క్‌ను డీకోడ్ చేసేందుకు ఎఫ్‌ఎస్‌ఎల్ అధికారులు శ్రమిస్తున్నారు. డీకోడ్ అయితే పటన్ ఐఎస్‌ఐ మహిళా ఏజెంట్‌కు వెల్లడించిన మరిన్ని రహస్యాలు బయటపడే అవకాశం ఉంది. పటన్‌కుమార్‌ను సస్పెండ్ చేస్తూ పోలీసు శాఖకు ఆర్మీ అధికారులు సమాచారాన్ని అందజేసినట్లు తెలిసింది. పటన్‌కుమార్ వ్యవహార శైలిపై బీహార్, పశ్చిమ బెంగాల్  పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలో అతను పని చేసిన విభాగాల్లో అతని ప్రవర్తన, తీరుతెన్నులను తెలుసుకుంటున్నారు. అనుష్క అగర్వాల్ పేరిట చాటింగ్ చేసిన ఆ యువతి అసలుపేరు ఏమిటనేది తేలాల్సి ఉంది.



పంపిన రహస్యాలు ఇవే

ఆర్మీ మిస్సైల్స్ నిల్వ కర్మాగారాల వివరాలతో పాటు కీలక విభాగాల్లో ఉన్న 40 మంది ఆర్మీ అధికారుల వివరాలను పటన్ పంపినట్లు తెలుస్తోంది. ఆర్మీ డాక్యుమెంట్లు, ఫోటోలు కూడా పంపించాడు. దేశంలో ఉన్న 12 ఆర్మీ యూనిట్ల బ్రిగేడ్ల పేర్లు, ఆ ప్రదేశాల వివరాలు, పశ్చిమ సరిహద్దులోని ఆర్మీ సమాచారాన్ని ఫోన్‌లో అనుష్కకు చెప్పాడు. సైన్యం కదలికలు, ఎత్తుగడలు, కీలక స్థావరాలను ఆమెకు వెల్లడించాడు.



జీ మెయిల్ ఐడీ ‘ప్రియాన్షూ1995’తో ఈ మెయిల్ సృష్టించిన పటన్ దాని ఐడీని అనుష్కకు చేరవేశాడు. పలు వివరాలను ఈ మెయిల్‌కు పంపగానే ఆమె వాటిని డౌన్‌లోడ్ చేసుకుంది. కాగా పాక్ మహిళా ఉగ్రవాదికి పలు రహస్యాల చేరవేతపై ఆర్మీ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఓ అధికారికి చెందిన కంప్యూటర్‌ను పటన్ ఉపయోగించాడని అధికారుల పరిశీలనలో తేలింది. ఆ అధికారి కంప్యూటర్ కోడ్ పటన్‌కు తెలియడంతో ఆ వివరాలను అనుష్కకు పంపినట్లు తెలిసింది.



రహస్యాలకు పారితోషికం

ఇక్కడి సమాచారాలు అనుష్కకు అందించినందుకు గాను మొదటిసారిగా 2013 మేలో బీహార్‌లోని ఎస్‌బీఐలో ఉన్న పటన్ బ్యాంక్ అకౌంట్‌లోకి పశ్చిమ బెంగాల్ మాల్దా జిల్లాలోని ఎస్‌బీఐ (మంగల్‌వాడి బ్రాంచి) నుంచి రూ.9,000ను అనుష్క పంపించింది. ఇలా ఏడాది కాలంలో రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.20 వేలు, రూ.20 వేల చొప్పున రూ.74 వేలు వేసింది. తాను అడిగిన రహస్యాలు పంపితే హైదరాబాద్‌కు వచ్చి స్వయంగా కలుస్తానని, లండన్‌కు కూడా పంపిస్తానని చెప్పింది. తన తండ్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేసాడని పటన్‌ను నమ్మించింది.



పటన్ చిక్కాడిలా

పటన్ సెల్‌కు ఐఎస్‌ఐ మహిళా ఉగ్రవాది చేసిన సెల్ నంబర్ టవర్ లొకేషన్‌ను పోలీసులు గుర్తించారు. ఆమె వాడిన సెల్‌ఫోన్ ప్రదేశం పాక్ సరిహద్దుల్లోదని తేలింది. దీంతో ఆమె పాకిస్థాన్ నుంచే ఆర్మీ రహస్యాలను రాబట్టిందని విచారణలో తేలింది. పాక్ సరిహద్దుల్లో సెల్‌ఫోన్‌లను ఐబీ అధికారులు ట్రాప్ చేసే క్రమంలో హైదరాబాద్ నుంచి తరచూ ఫోన్‌లు వస్తున్నాయని గ్రహించారు. ఐబీ అధికారులు హైదరాబాద్ పోలీసులను అప్రమత్తం చేయడంతో పటన్ గుట్టు రట్టయ్యింది. 15 రోజులు టాస్క్‌ఫోర్స్ పోలీసులు శ్రమించి పటన్‌ను పట్టుకోగలిగారు.



పటన్ నేపథ్యమిదీ

బీహార్ రాష్ట్రానికి చెందిన పటన్‌కుమార్ ఇంటర్ వరకు చదువుకున్నాడు. ఆ తరువాత ఇతని కుటుంబం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో స్థిరపడింది. 1996లో క్లర్క్‌గా ఆర్మీలో ఉద్యోగం సంపాదించాడు. మొదటి పోస్టింగ్ ఉత్తరప్రదేశ్ ఝాన్సీలో నిర్వహించాడు. 2010లో పెళ్లి చేసుకున్నాడు. 2006 నుంచి 2012 వరకు జమ్మూలోని పూంచ్ ప్రాంతంలోని ఆర్మీ సెంటర్‌లో పనిచేశాడు. 2012లో సికింద్రాబాద్‌కు బదిలీ అయ్యాడు. అతని భార్య, పిల్లలు మాత్రం బీహార్‌లోనే ఉంటున్నారు.



అనుష్క ఎఫ్‌బీలో సైనికాధికారుల ఫొటోలు

 కాగా అనుష్క ఫేస్‌బుక్‌లో 20 మంది సైనికాదుకారుల పేర్లు, ఫోటోలు కూడా దర్శనమిచ్చాయి. వారి పాత్ర ఏ మేరకు ఉందనే విషయంపై కూడా దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు.



ఆర్మీ పీఆర్‌ఓ వివరణ

పటన్ ఈఎంఈలో పనిచేయడం లేదని అతను ఆర్మీ ఆర్టిల్లరీ విభాగానికి చెందిన వాడని ఆర్మీ పౌర సంబంధాల శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. సికింద్రాబాద్‌లోని 151 ఎంసీ/ఎంఎఫ్ డిటాచ్‌మెంట్ వి భాగంలో పనిచేస్తున్నట్లు అందులో పేర్కొంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top