16 నుంచి పెట్రోల్‌, డీజిల్‌ బంద్‌!

16 నుంచి పెట్రోల్‌, డీజిల్‌ బంద్‌! - Sakshi


పెట్రోల్‌ బంకుల యజమానుల హెచ్చరిక



న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్‌ ధరలను రోజువారీగా సవరించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెట్రోల్‌ బంకుల యజమానులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. జూన్‌ 16 నుంచి ప్రభుత్వ చమురు సంస్థల నుంచి పెట్రోల్‌, డీజిల్‌ కొనకూడదని నిర్ణయించారు. ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని పెట్రోల్‌ బంకుల యజమాన్య సంఘాలు తెలిపాయి. అదే జరిగితే పెట్రోల్‌ బంకులు ఖాళీ అయిపోయి వినియోగదారులకు తిప్పలు తప్పవు.



అయితే ఇది సమ్మె కాదని.. 16 నుంచి పెట్రోల్‌, డీజిల్‌ మాత్రం కొనబోమని అఖిల భారత పెట్రోలియం డీలర్ల సంఘం అధ్యక్షుడు అజయ్‌ బన్సాల్‌ తెలిపారు. జూన్‌ 16 నుంచి దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్‌ ధరలను రోజువారీగా సవరిస్తామని పెట్రోలియం సంస్థలు స్పష్టం చేసిన నేపథ్యంలో పెట్రోల్‌ బంకుల యజమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ప్రస్తుతం అమలుచేస్తున్న ఐదు నగరాల్లో యజమానులు చేతులు కాల్చుకున్నారని.. దేశవ్యాప్తంగా అమలుపై పునరాలోచించాలని కోరారు. 



దేశవ్యాప్తంగా సుమారు 57 వేల పెట్రోల్‌ బంకులు ఉన్నాయి. వీటిలో ఐఓసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ సంయుక్త ఆధ్వర్యంలో 53 వేల బంకులు నడుస్తున్నాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలకు అనుగుణంగా ప్రతి 15 రోజులకు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను సవరిస్తున్నాయి. రోజువారీ ధరల సవరణను ప్రయోగాత్మకంగా మే 1 నుంచి పుదుచ్చేరి, చండీగఢ్‌, జంషెడ్‌పూర్‌, ఉదయ్‌పూర్‌, విశాఖపట్నంలో అమలు చేస్తున్నారు. ఎస్సార్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వంటి ప్రైవేటు సంస్థలు కూడా ఈ విధానాన్ని అనుసరించాయి. స్టాక్‌ విలువ పడిపోతుందున్న భయంతో రోజువారీ ధరల సవరణకు డీలర్లు జంకుతున్నారు. తమకు కమిషన్‌ పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. రోజువారీ ధరల సవరణతో పారదర్శకత పెరుగుతుందని, చిల్లర అమ్మకాల్లో ఒడిదుడుకులు చాలా వరకు తగ్గుతాయని చమురు కంపెనీలు అంటున్నాయి.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top