జంకు‘బంకు’ లేకుండా విక్రయాలు
పెట్రోల్ బంకు మాదిరి సెటప్ చేసి వాహనాలకు డీజిల్
విస్తుపోయిన విజిలెన్స్, సివిల్ సప్లయ్స్, పోలీసు అధికారులు
సర్వేపల్లి నియోజకవర్గ ముఖ్యనేతతో అక్రమార్కుల ఒప్పందం
లీటర్‌కు రూ.7 వంతున కప్పం చెల్లించేలా అంగీకారం!
పట్టుకున్న వాహనం వదిలివేసి ఫిర్యాదు రాలేదని బుకాయిస్తున్న పోలీసులు
పెట్రోల్ బంకు మాదిరిగా సెటప్ చేసి పెద్ద ట్యాంకర్ పెట్టి వాహనాలకు కల్తీ డీజిల్ నింపుతున్న దృశ్యం ఇది. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం పిడతాపోలూరులో ఇటీవల బట్టబయలైన ఈ బాగోతాన్ని చూసి విజిలెన్స్, పోలీసు, సివిల్ సప్లయ్ శాఖ అధికారులూ అవాక్కయ్యారు. మార్కెట్‌లో డీజిల్ రేటు కంటే తక్కువ ధరకే కల్తీ డీజిల్ అమ్ముతూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు.
సాక్షి టాస్క్ ఫోర్స్: నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో డీజిల్ మాఫియా జంకుబొంకూ లేకుండా రెచ్చిపోతోంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక రాయలసీమ ప్రాంతంలోని బంకుల్లో కల్తీ చేసిన డీజిల్‌ను కృష్ణపట్నం పోర్టు పారిశ్రామికవాడకు తరలించి తక్కువ ధరకే అమ్ముతున్నారు. బంకు మాదిరి సెటప్ చేసి పెద్ద ట్యాంకర్ ద్వారా నేరుగా వాహనాల్లో నింపుతున్నారు.
తక్కువ ధరకు డీజిల్ వస్తుండడంతో వాహన డ్రైవర్లు యజమానులకు తెలియకుండా కల్తీ డీజిల్‌ను నింపుకుని తిప్పుతున్నారు. యజమానులకు దొంగబిల్లులు చూపుతున్నారు. ఇటీవలి కాలంలో వాహనాల ఇంజిన్లు దెబ్బతింటుండడంతో పసిగట్టిన వాహనా యజమానులు ఫిర్యాదులు చేయడంతో కల్తీ బాగోతం వెలుగులోకి వచ్చింది.
కల్తీ చేసేది ఇలా..
వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు ఏరియాకు చెందిన కొన్ని పెట్రోల్ బంకుల్లో డీజిల్‌ను ఈ మాఫియా కల్తీ చేస్తోంది. ఆ డీజిల్‌ను పెద్ద ట్యాంకర్ల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా సర్వేపల్లి నియోజకవర్గంలోని కృష్ణపట్నం పోర్టు పరిధిలోని పారిశ్రామికవాడకు తరలిస్తున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం పిడతాపోలూరులో పెట్రోల్ బంకులా సెటప్‌చేసి ఆయిల్ ట్యాంకర్లు, జెన్‌కో వద్ద బూడిద తీసుకెళ్లే వాహనాలకు నేరుగా కల్తీ డీజిల్ సరఫరా చేస్తున్నారు.
ఏడాదిన్నరగా జరుగుతున్న ఈ కల్తీ దందా పది రోజుల క్రితమే వెలుగులోకి వచి్చంది. మార్కెట్‌లో లీటర్ డీజిల్ ధర రూ.వంద ఉంటే ఇక్కడ కేవలం రూ.77 మాత్రమే తీసుకుంటున్నారు. తక్కువకు డీజిల్ వస్తుండడంతో వాహన డ్రైవర్లు యజమానులకు తెలియకుండా ఇక్కడే డీజిల్ పోయించుకుంటున్నారు.
డ్రైవర్లకు కల్తీ మాఫియా లీటర్‌కు రూ.ఐదు చొప్పున కమీషన్ ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. నిత్యం వేల లీటర్ల కల్తీ డీజిల్‌ను సçరఫరా చేస్తూ అక్రమార్కులు రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు. ఒక్కో లీటర్‌కు మాఫియాకు రూ.25 వరకు మిగులుతుందని, ఏడాదిన్నరగా రూ.కోట్ల దందా జరుగుతోందని తెలుస్తోంది.
ముఖ్యనేతతో ఒప్పందం
ముత్తుకూరు మండలం పిడతాపోలూరులో కల్తీ డీజిల్ వ్యవహారాన్ని గుర్తించి స్థానికులు విజిలెన్స్, స్థానిక పోలీసులు, సివిల్ సప్లయ్స్ అధికారులకు ఈ నెల 7న సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు వచ్చి తనిఖీలు చేపట్టి కల్తీ డీజిల్‌గా నిర్ధారించారు. డీజిల్ ట్యాంకర్‌ను పోలీసులు పట్టుకున్నారు. అయితే పది రోజులు దాటుతున్నా.. డీజిల్ మాఫియాపై చర్యలు తీసుకోలేదు.
ఈ వ్యవహారం వెనుక సర్వేపల్లి నియోజకవర్గ ముఖ్యనేతతో మాఫియాకు డీల్ కుదిరినట్టు తెలుస్తోంది. ప్రతి లీటర్‌కు రూ.7 చొప్పున ఇచ్చేలా ఒప్పందం కుదిరిందని విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే డీజిల్ మాఫియాను అధికారులు వదిలేశారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికీ కల్తీ డీజిల్ విక్రయాలు జోరుగా జరుగుతుండడం దీనికి నిదర్శనంగా నిలుస్తోంది.
అయితే కల్తీ డీజిల్‌పై తనిఖీ అధికారులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదుచేయకపోవడంతో పట్టుకున్న ట్యాంకర్‌ను వదిలేశామని ఎస్‌ఐ ప్రసాద్‌రెడ్డి తెలిపారు. కేసు నమోదు తమ పరిధిలో ఉండదంటూనే జేసీ, సివిల్ సప్లయ్స్ అధికారులకు తెలియజేస్తామని, ఇకపై కల్తీ డీజిల్ విక్రయాలు జరిగితే కేసులు నమోదు చేస్తామని ఆయన వెల్లడించడం గమనార్హం.


