కుల్‌భూషణ్ జాధవ్‌కు సంబంధించిన కీలక పత్రాలను ఐక్యరాజ్యసమితికి సమర్పించేందుకు పాకిస్తాన్ సిద్ధమైనట్టు తెలుస్తోంది.
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో గూఢచర్యం ఆరోపణలపై మరణశిక్షకు గురైన భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్‌కు సంబంధించిన కీలక పత్రాలను ఐక్యరాజ్యసమితికి సమర్పించేందుకు పాకిస్తాన్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు అతనికి సంబంధించిన పత్రాలను పాక్ సిద్ధం చేసినట్టు ఆ దేశ మీడియా వెల్లడించింది. ఈ పత్రాలను ఐక్యరాజ్యసమితితో పాటు ఇస్లామాబాద్‌లోని విదేశీ రాయబారులకు అందజేయనున్నట్టు పేర్కొంది.
జాధవ్ తొలుత ఇచ్చిన వాంగ్మూలంతో పాటు.. కరాచీ, బలూచిస్తాన్‌లో గూఢచర్యం, విద్యోహ కార్యకలాపాలకు సంబంధించి ఫీల్డ్ జనరల్ కోర్టు మార్షల్ ఎదుట అతను ఇచ్చిన వాంగ్మూలానికి చెందిన పత్రాల ఆధారంగా ఈ తాజా పత్రాలను పాక్ సిద్ధం చేసిందని, వీటితో పాటు కోర్టు మార్షల్ జనరల్ నివేదికను, అలాగే కోర్టు విచారణ కాలక్రమానికి చెందిన పత్రాలను కూడా జత చేసినట్టు ద నేషన్ పత్రిక వెల్లడించింది.
జాధవ్‌కు చెందిన స్థలాల్లో జరిగిన సోదాలు.. అరెస్టులకు సంబంధించిన పత్రాలు కూడా ఇందులో ఉన్నాయని తెలిపింది. గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న 46 ఏళ్ల జాధవ్‌కు పాకిస్తాన్ సైనిక చట్టం ప్రకారం ఫీల్డ్ జనరల్ కోర్టు మార్షల్ మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖుమర్ జాదవ్ బజ్వా గత వారం నిర్థారించారు.