బ్యాంకుల చుట్టూ ఎన్నిరోజులు తిరిగాలి? | on third day people suffering continues at banks and ATMs | Sakshi
Sakshi News home page

బ్యాంకుల చుట్టూ ఎన్నిరోజులు తిరిగాలి?

Nov 12 2016 5:36 PM | Updated on Sep 27 2018 9:08 PM

బ్యాంకుల చుట్టూ ఎన్నిరోజులు తిరిగాలి? - Sakshi

బ్యాంకుల చుట్టూ ఎన్నిరోజులు తిరిగాలి?

బ్యాంకు ఖాతాలేని వారు పాత నోట్లు మార్చుకోవడానికి వస్తే మొత్తం 2,000 నోట్లను ఇచ్చి పంపేస్తున్నారు..

సాక్షి, అమరావతి: బ్యాంకుల వద్ద రద్దీ మూడో రోజూ కొనసాగుతోంది. రెండో శనివారం చాలా ఆఫీసులు, పాఠశాలలకు సెలవులు కావడంతో బ్యాంకులు, ఏటీఎంలు ముందు నగదు కోసం జనం బారులు తీరారు. కొన్ని బ్యాంకుల ముందు టెంట్లు వేసినప్పటికీ, క్యూ లైన్లు రోడ్లపైకి ఉండటంతో ఎండవేడిమి తట్టుకోలేక మహిళలు, వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బ్యాంకుల వద్ద 100 నోట్లు లేకపోవడంతో వీటిని చాలా జాగ్రత్తగా వాడుతున్నారు. బ్యాంకు ఖాతాలేని వారు పాత నోట్లు మార్చుకోవడానికి వస్తే 2,000 నోట్లను ఇస్తున్నారు. ఖాతాదారులు బ్యాంకుల నుంచి రూ10,000 వరకు తీసుకోవడానికి అనుమతి ఉండటంతో రెండువేల వరకు 100 నోట్లు ఇచ్చి మిగిలిన మొత్తానికి 2,000 నోట్లు ఇస్తున్నట్లు బ్యాంకు ఉద్యోగి ఒకరు తెలిపారు.

ఇక ఏటీఎంల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. రాష్ట్రంలో ఎక్కడా ఏటీఎంలలో మూడు వంతులు పనిచేయనే లేదు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఏటీఎంలో క్యాష్ అయిపోయిందని, ఇప్పటివరకు (మధ్యాహ్నం రెండయ్యింది) క్యాష్ రాలేదని, సాయంత్రానికి రావచ్చంటున్నారని ఏటీఎం సిబ్బంది పేర్కొన్నారు. ఈ ఒక్క చోటే కాదు చాలాచోట్ల గురువారం రాత్రి నుంచి ఏటీఎంల వద్ద నో-క్యాష్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. బ్యాంకు శాఖల వద్ద ఉన్న ఏటీఎంలు పనిచేస్తున్నాయి కానీ.. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఏటీఎంలు చాలామటుకు పనిచేయడం లేదు.

తమ దగ్గర ఉన్న 100 నోట్లతో ఈ రాత్రి వరకు ఏటీఎంలు నడపగలమని ఆంధ్రాబ్యాంక్ ఉన్నతాధికారి ఒకరు సాక్షికి తెలిపారు. చిన్న నోట్లకు డిమాండ్ ఎక్కువగా ఉందని, తగినంత సరఫరా లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని ఎస్‌బీఐ అధికారి ఒకరు చెప్పారు. పరిస్థితి తీవ్రతను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియచేస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తోందని చెప్పారు. ఒకటి రెండు రోజుల్లో తగినంత నగదు అందుబాటులోకి వస్తుందన్న నమ్మకాన్ని బ్యాంకు అధికారులు వ్యక్తం చేస్తున్నారు. పనులు మానుకొని ఇలా ఎన్ని రోజులు ఏటీఎంలు, బ్యాంకులు చుట్టూ తిరగాలంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్లధనం కలిగిన బడాబాబులు ఏసీ గదుల్లో చల్లగా కూర్చొని ఉంటే కష్టపడి సంపాదించుకున్న తాము మాత్రం తప్పు చేసిన వాళ్ల మాదిరిగా మండే ఎండలో గంటలు తరబడి నిలబడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement