
16న అసెంబ్లీ!
తమిళనాడు ప్రభుత్వం చిట్టచివరి అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమైంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్‌ను దాఖలు చేసేందుకు ఈనెల 16వ తేదీన సమావేశం అవుతోంది.
* మధ్యంతర బడ్జెట్ దాఖలు కోసమే
* నాలుగు రోజలకే అవకాశం
చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళనాడు ప్రభుత్వం చిట్టచివరి అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమైంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్‌ను దాఖలు చేసేందుకు ఈనెల 16వ తేదీన సమావేశం అవుతోంది. ఈ ఏడాది ఆరంభంలో అంటే గత నెల 20వ తేదీన అసెంబ్లీ సమావేశాలు సాగాయి. గవర్నర్ ప్రసంగం, ఆ తరువాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో పలువురు సభ్యులు ప్రసంగించారు. సభ్యుల ప్రసంగంలో లేవనెత్తిన ప్రశ్నలకు, విమర్శలకు ముఖ్యమంత్రి జయలలిత సభలో బదులిచ్చారు.
కేవలం నాలుగురోజులు మాత్రమే సాగిన అసెంబ్లీ సమావేశాలు ఆ తరువాత వాయిదా పడ్డాయి. ప్రస్తుత ప్రభుత్వ కాలపరిమితి ఈ ఏడాది మేలో తీరిపోనుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు యథావిధిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సి ఉంది. ఈ కారణాల చేత ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సి ఉంది. ఇందుకోసం ఈనెల 16వ తేదీన బడ్జెట్ సమావేశం ఆరంభం కానుంది. బడ్జెట్‌పై చర్చ ముగిసిన తరువాత ఆర్థిక మంత్రి ఓ పన్నీర్‌సెల్వం బదులిస్తారు. ఈ బడ్జెట్ సమావేశాలు కేవలం నాలుగురోజులు మాత్రమే జరుగుతాయని తెలుస్తోంది.
ఈ సందర్భంగా అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్ మాట్లాడుతూ, ఈనెల 16వ తేదీ ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయని తెలిపారు. ఈ సందర్బంగా 2016-17 సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడతారని చెప్పారు.
డీఎండీకే సభ్యులకు నో ఎంట్రీ:
అసెంబ్లీ సమావేశాల నుంచి బహిష్కరణకు గురైన 6 మంది డీఎండీకే ఎమ్మెల్యేలు ఈ సమావేశాలకు సైతం హాజరయ్యే అవకాశం లేదు. ఈ ఏడాది అసెంబ్లీ సమావేశాల్లో వరుసగా పదిరోజులు ముగిసిన తరువాత వారు హాజరుకావచ్చు. అయితే జనవరిలో జరిగిన సమావేశాలు నాలుగురోజులతో ముగిశాయి. అలాగే ప్రస్తుత బడ్జెట్ సమావేశాలు నాలుగురోజులేనని తెలుస్తోంది. ఈపరిణామం వల్ల బహిష్కృత డీఎండీకే ఎమ్మెల్యేలు చివరి అసెంబ్లీ సమావేశాలను సైతం కోల్పోనున్నారు.