
గన్‌పార్కు వద్ద ఖాళీ యూరియా సంచులతో ఆందోళన చేస్తున్న బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు, మధుసూదనాచారి, జగదీశ్‌రెడ్డి,గంగుల, పద్మారావు, మల్లారెడ్డి, సుధీర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి తదితరులు
అసెంబ్లీ సమావేశాల తొలిరోజు బీఆర్‌ఎస్ నిరసన
గన్‌పార్కు వద్ద యూరియా సంచులు, ప్లకార్డుల ప్రదర్శన
వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ధర్నా
సచివాలయం ఎదుట బైఠాయింపునకు యత్నం
అదుపులోకి తీసుకుని తెలంగాణ భవన్‌కు తరలించిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలిరోజున రాష్ట్రంలో యూరియా కొరతపై బీఆర్‌ఎస్ తీవ్ర స్థాయిలో నిరసన గళం వినిపించింది. శనివారం దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు సంతాపం తెలిపిన తర్వాత సభ వాయిదా పడింది. అనంతరం యూరియా కొరతపై అసెంబ్లీ బయట గులాబీ పార్టీ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది. ఉదయం అసెంబ్లీకి ఎదురుగా ఉన్న గన్‌పార్కులోని తెలంగాణ అమర వీరుల స్తూపానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులర్పించారు. ఖాళీ యూరియా సంచులు, ప్లకార్డులను ప్రదర్శిస్తూ రైతులను ఆదుకోవాలని నినాదాలు చేశారు. ‘గణపతి బప్పా మోరియా.. కావాలయ్యా యూరియా’, ‘రేవంత్ ద్రోహం.. రైతన్నకు మోసం’ అంటూ నినాదాలు చేశారు.
కమిషనర్ కార్యాలయంలో ధర్నా
అసెంబ్లీ వాయిదా అనంతరం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలు చేస్తూ కాలినడకన ఎల్‌బీ స్టేడియంకు ఎదురుగా ఉన్న వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి వెళ్లారు. యూరియా, ఇతర ఎరువుల లభ్యతపై సమీక్ష జరిపి వెంటనే సరఫరా చేయాలని కోరుతూ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. సమస్యకు పరిష్కారం చూపేంత వరకు కదిలేది లేదని ధర్నాకు దిగారు. అయితే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు బీఆర్‌ఎస్ నేతలను అదుపులోకి తీసుకుని వాహనాల్లో తరలించారు.
సచివాలయంలోకి చొచ్చుకుపోయేందుకు యత్నం
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తెలంగాణ భవన్‌కు తరలించే క్రమంలో సచివాలయం ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వాహనం ఆగడంతో అందులో నుంచి దిగిన మాజీమంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్‌కుమార్‌రెడ్డి, దేశపతి శ్రీనివాస్ తదితరులు ధర్నాకు దిగారు. బారికేడ్లు దూకి సచివాలయంలోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించడంతో పోలీసులు గేట్లు మూసివేశారు. అయితే పోలీసులు వారిని తిరిగి అదుపులోకి తీసుకుని తెలంగాణ భవన్‌కు తరలించారు. ఈ సందర్భంగా కేటీఆర్, హరీశ్‌రావు మాట్లాడారు.
సభను అనుకూలంగా నడుపుకునే ప్రయత్నం: కేటీఆర్
‘రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీని తమకు అనుకూలంగా నడుపుకునే ప్రయత్నం చేస్తూ రైతుల సమస్యలు, ఎరువుల కొరత తదితరాలపై మాట్లాడటం లేదు. ప్రభుత్వం కనీసం 15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు పెడితే వ్యవసాయ రంగం, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం సహా అన్ని అంశాలపైనా చర్చించేందుకు సిద్ధం. కాళేశ్వరంపై కాంగ్రెస్ వేసిన ‘పీసీసీ ఘోష్ కమిషన్’ పైనా చర్చించేందుకు సిద్ధం. వ్యవసాయ రంగం కోసం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎరువుల కోసం రైతులు పండుగ రోజు, వర్షాల్లోనూ తమ చెప్పులు, ఆధార్ కార్డులను పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. వర్షాల మూలంగా జరిగిన నష్టం, రైతుల ఆత్మహత్యలు, రైతాంగానికి కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత హామీలపై చర్చ జరగాలి. కానీ ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉండే ఒకటి రెండు అంశాలపైనే మాట్లాడే ప్రయత్నం చేస్తోంది..’ అని కేటీఆర్ విమర్శించారు.
రైతుల చెంప చెళ్లుమనిపిస్తారా..? : హరీశ్‌రావు
‘యూరియా అడిగినందుకు రైతుల చెంప చెళ్లుమనిపించడమేనా కాంగ్రెస్ సోకాల్డ్ పాలన. మూటలు మోయడం, మాటలు మార్చడమే ముఖ్యమంత్రి రేవంత్‌కు తెలిసిన విద్య. రాష్ట్రంలో యూరియా కొరత లేదంటూ ‘ఏఐ ఫోటోల’తో ప్రచారం చేశారు. లైన్లలో నిల్చున్నది రైతులే కాదని బీఆర్‌ఎస్ కార్యకర్తలని తొండి కూతలు కూశారు. చివరకు యూరియా కొరత నిజమేనని ఒప్పుకుని కేంద్ర ప్రభుత్వం కారణమన్నారు. కాంగ్రెస్ వల్లే యూరియా సంక్షోభం తలెత్తిందని రైతులకు అర్థమైంది. రేవంత్ ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పాలి..’ అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.