లైంగిక వేధింపులకు ఒడిశా ఉపాధ్యాయిని బలి | Sakshi
Sakshi News home page

లైంగిక వేధింపులకు ఒడిశా ఉపాధ్యాయిని బలి

Published Sat, Nov 2 2013 1:38 AM

Odisha teacher who was set on fire dies

రాయగడ(ఒడిశా), న్యూస్‌లైన్: లైంగిక వేధింపులకు ఒడిశాలో ఒక ఉపాధ్యాయిని బలైపోయింది. ఉన్నతాధికారి వేధింపులపై పోలీసు ఫిర్యాదు వెనక్కి తీసుకోనందుకు దాడికి గురై, ఐదు రోజులుగా 90 శాతం కాలిన గాయాలతో నరకాన్ని అనుభవిస్తూ చివరికిశుక్రవారం విశాఖపట్నంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచింది. ఎన్ని చట్టాలు వచ్చినా.. మహిళలకు భద్రత ఏదంటూ సిగ్గులేని సమాజాన్ని నిలదీస్తూ వెళ్లిపోయింది. రాయగడ జిల్లా కలెక్టర్ ఎస్.బి.పాధి తెలిపిన వివరాలు.. పూరీ జిల్లా డెలంగా ప్రాంతానికి చెందిన ఇతిశ్రీ ప్రధాన్ (36) రాయగడ జిల్లాలోని టికిరి ప్రాథమికోన్నత ఆశ్రమ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్నారు.
 
 స్కూల్స్ సబ్ ఇన్‌స్పెక్టర్ నేత్రానంద దండసేన లైంగిక వేధింపులకు పాల్పడుతుండడంతో ఆమె ఉన్నతాధికారులకు నివేదించడంతోపాటు, టికిరి పోలీస్ స్టేషన్లో జూలై 18న ఫిర్యాదు చేసింది. కేసును ఉపసంహరించుకోవాలని దండసేన ఒత్తిడి తీసుకురాగా, ఆమె తిరస్కరించింది. దీంతో అక్టోబర్ 27 రాత్రి ఆమె ఉంటున్న హాస్టల్‌లోకి కొంతమంది దుండగులు చొరబడి, ఇతిశ్రీపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. 90 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం మృతి చెందింది. నిందితులకు కోరాపుట్ ఎంపీ జైరామ్ పంగి రక్షణగా నిలుస్తున్నారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు.

Advertisement
Advertisement