నామినేటెడ్ పోస్టులపై కసరత్తు | nominated posts On Working | Sakshi
Sakshi News home page

నామినేటెడ్ పోస్టులపై కసరత్తు

Oct 16 2015 3:28 AM | Updated on Sep 3 2017 11:01 AM

ప్రభుత్వ నామినేటెడ్ పదవుల భర్తీపై కసరత్తు మొదలైంది. వివిధ ప్రభుత్వ విభాగాల పరిధిలో ఉన్న కార్పొరేషన్లు, బోర్డులు ఎన్ని ఉన్నాయో లెక్కలు తీసేందుకు మంత్రుల బృందం కార్యచరణ ప్రారంభించింది.

సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ నామినేటెడ్ పదవుల భర్తీపై కసరత్తు మొదలైంది. వివిధ ప్రభుత్వ విభాగాల పరిధిలో ఉన్న కార్పొరేషన్లు, బోర్డులు ఎన్ని ఉన్నాయో లెక్కలు తీసేందుకు మంత్రుల బృందం కార్యచరణ ప్రారంభించింది. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సారథ్యంలో మంత్రులు హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వర్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి వివిధ శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విభాగాల వారీగా ఎన్ని కార్పొరేషన్లు, బోర్డులు, ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయో ఆరా తీశారు.

వీటిలో ఎన్నింటికి పాలక మండళ్లు, బోర్డులు ఉన్నాయి? ఖాళీగా ఉన్న పదవుల సంఖ్య ఎంత? తదితర వివరాలన్నీ శుక్రవారం సాయంత్రం లోపు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
 
వీటి తర్వాతే పార్టీ కమిటీల నియామకాలు
దసరా కల్లా నామినేటెడ్ పదవులు భర్తీ  చేస్తామని సీఎం కేసీఆర్ ఈ నెల 8న జరిగిన టీఆర్‌ఎస్ శాసనసభా పక్ష సమావేశంలో  హామీ ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలక మండళ్లను నియమించేందుకు రిజర్వేషన్లు ప్రకటించారు. మొత్తం 168 మార్కెట్లలో యాభై శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించారు. వీటి భర్తీ కోసం మంత్రి హరీశ్.. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల నుంచి ప్రతిపాదనలు స్వీకరిస్తున్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థలు, దేవాలయ కమిటీలను కూడా భర్తీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చాకే పార్టీ కమిటీలను నియామకాలు ఉంటాయని అధికార పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల చైర్మన్ పోస్టులకు కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన వారి పేర్లను పరిశీలిస్తున్నారు. రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల డెరైక్టర్ పోస్టులకు జిల్లాల నుంచి ప్రతిపాదనలు స్వీకరిస్తున్నారు. కార్పొరేషన్లు, కమిటీలు, పోస్టుల సంఖ్యపై ఓ అంచనాకు వచ్చేందుకే మంత్రుల బృందం అధికారులతో సమావేశమైనట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement