ధనిక నగరం... ముంబై | Mumbai Richest Indian City With Total Wealth Of $820 Billion: Report | Sakshi
Sakshi News home page

ధనిక నగరం... ముంబై

Feb 27 2017 2:04 AM | Updated on Sep 5 2017 4:41 AM

ధనిక నగరం... ముంబై

ధనిక నగరం... ముంబై

దేశ ఆర్థిక రాజధానిగా ఉన్న ముంబై ధనిక నగరంగానూ తన హవా కొనసాగిస్తోంది. 46,000 మంది మిలియనీర్లు, 28 మంది బిలియనీర్లకు ముంబై నివాస స్థలం...

820 బిలియన్‌ డాలర్ల సంపద
తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, బెంగళూరు
నాలుగోస్థానంలో హైదరాబాద్‌


న్యూఢిల్లీ: దేశ ఆర్థిక రాజధానిగా ఉన్న ముంబై ధనిక నగరంగానూ తన హవా కొనసాగిస్తోంది. 46,000 మంది మిలియనీర్లు, 28 మంది బిలియనీర్లకు ముంబై నివాస స్థలం కాగా, మొత్తం సంపద 820 బిలియన్‌ డాలర్లుగా ఉందని ‘న్యూ వరల్డ్‌ వెల్త్‌’ నివేదిక తెలిపింది. ముంబై తర్వాత ఢిల్లీ, బెంగళూరు నగరాలు సంపద పరంగా ముందున్నాయి. ఢిల్లీలో 23,000 మంది మిలియనీర్లు, 18 మంది బిలియనీర్లు ఉండగా మొత్తం సంపద 450 బిలియన్‌ డాలర్లు. బెంగళూరు 7,700 మంది మిలియనీర్లు, 8 మంది బిలియనీర్లకు నివాస స్థలంగా భాసిల్లుతోంది. వీరి మొత్తం సంపద 320 బిలియన్‌ డాలర్లు. దేశంలో మొత్తం సంపద 6.2 లక్షల కోట్ల డాలర్లు కాగా, 2,64,000 మంది మిలియనీర్లు, 95 మంది బిలియనీర్లు ఉన్నారు.

సంపన్న నగరంగా అవతరిస్తున్న విశాఖ....
సంపద పరంగా నాలుగో స్థానంలో ఉన్న హైదరాబాద్‌ నగరంలో 9,000 మంది మిలియనీర్లు, ఆరుగురు బిలియనీర్లు ఉన్నారు. వీరి సంపద 310 బిలియన్ల డాలర్లని న్యూ వరల్డ్‌ వెల్త్‌ నివేదిక వెల్లడించింది. కోల్‌కతా నగరంలో 9,600 మంది మిలియనీర్లు ఉండగా, నలుగురు బిలియనీర్లు ఉన్నారు. వీరి సంపద 290 బిలియన్‌ డాలర్లు. పుణే నగరంలో 4,500 మంది మిలియనీర్లు, ఐదుగురు బిలియనీర్లు నివాసం ఉంటున్నారు. వీరి సంపద 180 బిలియన్‌ డాలర్లు. చెన్నై నగరంలో 6,600 మంది మిలియనీర్లు, నలుగురు బిలియనీర్లు ఉండగా, వీరి సంపద 150 బిలియన్‌ డాలర్లు.

విశాఖపట్నం, సూరత్, అహ్మదాబాద్, గోవా, చండీగఢ్, జైపూర్, వదోదరా సైతం సంపన్న నగరాలుగా అవతరిస్తున్నట్టు ఈ నివేదిక పేర్కొంది. ‘‘వచ్చే పదేళ్లలో ఆర్థిక సేవలు, ఐటీ, రియల్‌ ఎస్టేట్, ఆరోగ్యం, మీడియా రంగాల్లో బలమైన వృద్ధి కారణంగా దేశానికి ప్రయోజనం కలుగుతుంది. హైదరాబాద్, బెంగళూరు, పుణే నగరాలు సంపద వృద్ధి పరంగా ముందుంటాయి’’ అని నివేదిక స్పష్టం చేసింది. మిలియన్‌ డాలర్లు (రూ.6.7 కోట్లు సుమారు) ఉన్నవారిని మిలియనీర్‌గా, బిలియన్‌ డాలర్లు (రూ.6,700 కోట్లు సుమారు) ఉన్న వారిని బిలియనీర్‌గా నివేదిక పరిగణనలోకి తీసుకుంది.

సంపన్న ప్రాంతాలు...: ముంబైలో బాంద్రా, జుహు, గొరెగావ్, పారెల్, వోర్లి, పామ్‌బీచ్‌ రోడ్‌ ఖరీదైన ప్రాంతాలని ఈ నివేదిక తెలిపింది. ఢిల్లీలో వెస్టెండ్‌ గ్రీన్స్, దేరా మండి, గ్రేటర్‌ కైలాష్, లూటెన్స్‌ ప్రాంతాలు, చెన్నైలో బోట్‌ క్లబ్‌ రోడ్, పోయెస్‌ గార్డెన్‌ సంపన్నుల కేంద్రాలుగా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement