కోహ్లికి గట్టిగా బుద్ధి చెప్పాలని..! | Sakshi
Sakshi News home page

కోహ్లికి గట్టిగా బుద్ధి చెప్పాలని..!

Published Wed, Jun 28 2017 9:45 AM

కోహ్లికి గట్టిగా బుద్ధి చెప్పాలని..!

స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే భారత్‌ క్రికెట్‌ జట్టు కోచ్‌ పదవి నుంచి తప్పుకోవడానికి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లియే కారణమని అంతా భావిస్తున్న సంగతి తెలిసిందే. కుంబ్లేను అవమానకరరీతిలో పదవి నుంచి తప్పుకునేలా చేసిన కోహ్లికి గట్టిగా బుద్ధి చెప్పాలని ఓ అభిమాని భావించాడు. అందుకే, వృత్తిపరంగా మెకానికల్‌ ఇంజినీర్‌ అయినప్పటికీ, భారత్‌ క్రికెట్‌ కోచ్‌ పదవికి అతను దరఖాస్తు చేశాడు.

ఓ నిర్మాణ కంపెనీలో మెకానికల్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న 30 ఏళ్ల ఉపేంద్రనాథ్‌ బ్రహ్మచారి తాజాగా భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ పదవికి దరఖాస్తు చేశాడు. 'అహంకారి అయిన కోహ్లిని సరైన దారిలో పెట్టేందుకే' తాను కోచ్‌ పదవికి దరఖాస్తు చేసినట్టు అతను తెలిపాడు. బీసీసీఐ వెబ్‌సైట్‌లోని ఈమెయిల్‌ఐడీ ఆధారంగా అతను ఈ దరఖాస్తు చేశాడు. కోచ్‌ పదవి నుంచి కుంబ్లేను తొలగించడానికి కోహ్లియే కారణమని దేశంలోని కోట్లాదిమంది క్రికెట్‌ ఫ్యాన్స్ అనుకుంటున్నట్టే తాను భావిస్తున్నట్టు అతను తన దరఖాస్తులో తెలిపాడు.

'లెజండరీ క్రికెటర్‌ అనిల్‌కుంబ్లే కోచ్ పదవి నుంచి తప్పుకోవడంతో నేను ఈ పదవికి దరఖాస్తు చేయాలని నిర్ణయించాను. ఎందుకంటే టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి లెజండరీ క్రికెటర్లు కోచ్‌గా అవసరం లేదు. బీసీసీఐ ప్రకటన ప్రకారం మరోసారి మాజీ క్రికెటర్‌ను కోచ్‌గా ఎంపిక చేసినా.. కుంబ్లే తరహాలోనే ఆయనను కూడా కోహ్లి అవమానిస్తాడు. కాబట్టి ఎలాంటి క్రికెట్‌ నైపుణ్యం లేకున్నా నేనే కోచ్‌ పదవికి పర్ఫెక్ట్‌ చాయిస్. అహంకార పూరిత వైఖరితో నేను సర్దుకోగలను. మెల్లగా కోహ్లిని నేను సరైన దారిలోకి తీసుకొస్తాను. అప్పుడు బీసీసీఐ ఓ లెజండ్‌ క్రికెటర్‌ను కోచ్‌గా నియమించుకోవచ్చు‌' అంటూ బ్రహ్మచారి తన దరఖాస్తులో సరదాగా కామెంట్‌ చేశాడు.

Advertisement
Advertisement