ఉత్తర భారతానికి భారీ భూకంపం ముప్పు! | Sakshi
Sakshi News home page

ఉత్తర భారతానికి భారీ భూకంపం ముప్పు!

Published Thu, Jul 21 2016 4:23 PM

ఉత్తర భారతానికి భారీ భూకంపం ముప్పు!

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్, మయన్మార్‌తోపాటు ఉత్తర భారతానికి పెను భూకంపం ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 8.2 నుంచి 9 పాయింట్లు ఉండవచ్చని వారంటున్నారు. ఇంతటి తీవ్ర భూకంపం రేపే రావచ్చు లేదా 500 ఏళ్లలో ఎప్పుడైనా రావచ్చని, ఎప్పుడో ఒకప్పుడు రావడం మాత్రం ఖాయమని భూపొరల్లోని ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్‌ల వద్ద గత 13 ఏళ్లుగా చోటు చేసుకుంటున్న మార్పులను అధ్యయనం చేయడం ద్వారా వారు తేల్చి చెప్పారు.

బంగ్లాదేశ్, మయన్మార్, ఉత్తరభారత్ గుండా వెళ్లే ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్‌ను ‘ఇండో బర్మీస్ ఆర్క్’గా పిలుస్తామని, ఈ ప్లేట్ పరిధిలో 62, 159 చదరపు కిలోమీటర్ల భూభాగం ఉందని, దీనికి ఆనుకొని మైన్మార్‌లోని సుండా ప్లేట్ ఉందని, ఈ రెండు ప్లేట్ల మధ్య ఏడాదికి 46 మిల్లీ మీటర్ల వ్యత్యాసం వస్తున్న విషయం జీపీఎస్ వ్యవస్థ ద్వారా 13 ఏళ్ల ఉపగ్రహ ఛాయా చిత్రాలను అధ్యయనం చేయడం తేలిందని అంటున్నారు. ఇంత పెద్ద స్థాయిలో ఓ అధ్యయనం జరగడం ఇదే మొదటిసారని, ప్లేట్ మధ్య వస్తున్న వ్యత్యాసం కారణంగా భూకంపం కచ్చితంగా వచ్చే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. వారు తమ అధ్యయన వివరాలను ‘నేచర్ జియోసైన్స్’ జర్నల్ తాజా సంచికలో ప్రచురించారు.

బంగ్లాదేశ్, మయన్మార్, ఉత్తరభారతం కింద భూపొరలు విడిపోవడం వల్ల భారీ భూకంపం వస్తుందని, అది భూకంపం కేంద్రం నుంచి 99 కిలోమీటర్ల వరకు తన తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని, దాని ప్రభావం దాదాపు 14 కోట్ల మంది ప్రజలపై ఉంటుందని వారు అంచనావేశారు. ఇండియన్ టెక్టోప్లేట్ ఈశాన్య పర్వతాల కింది నుంచి వెళుతోందని, భూ పొరల కదిలికల్లో కలిగే రాపిడి వల్ల భూకంపం పుడుతుందని, భారత్‌లోని 107 నగరాలు, పట్టణాలకు ప్రళయ ప్రమాదం ఉందని, గంగ, బ్రహ్మపుత్ర నదులు కూడా బురదమయమయ్యే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.

Advertisement
Advertisement