జపాన్లోని ఫుకుషిమా ప్రాంతంలో మళ్లీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.3గా నమోదైంది.
జపాన్లోని ఫుకుషిమా ప్రాంతంలో మళ్లీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.3గా నమోదైంది. అయితే, సునామీ హెచ్చరికలు మాత్రం జారీకాలేదు. భూకంప కేంద్రం భూమికి 22 కిలోమీటర్ల లోతున ఉంది. పసిఫిక్ సముద్రానికి దగ్గరగా ఉండే ఇవాకీ నగరానికి 20 కిలోమీటర్ల పశ్చిమదిశలో ఇది వచ్చింది. ఫుకుషిమాలో గతంలో ధ్వంసమైన దైచి అణు విద్యుత్ ప్లాంటుకు ఇది కేవలం 50 కిలోమీటర్ల దూరంలోనే ఉంది!!
2011 మార్చిలో వచ్చిన భారీ భూకంపం, సునామీతో దైచి అణు కేంద్రం ధ్వంసమైన విషయం తెలిసిందే. తాజా భూకంప తీవ్రత 5.8 అని జపాన్ వాతావరణశాఖ తెలిపింది. దీనివల్ల రాజధాని టోక్యోలో ఉన్న భవనాలు కూడా కంపించాయి. జపాన్ ప్రధాని షింజో అబె ఫుకుషిమాలో పర్యటించి వెళ్లిన కొద్ది సేపటికే భూకంపం రావడం గమనార్హం.