డీఎండీకేతో పొత్తుపై తాను చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన నేపథ్యంలో ఎం.కె. అళగిరి తన తండ్రి ఎం. కరుణానిధిని కలిశారు.
చెన్నై: డీఎండీకేతో పొత్తుపై తాను చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన నేపథ్యంలో ఎం.కె. అళగిరి తన తండ్రి ఎం. కరుణానిధిని కలిశారు. దాదాపు అరగంట పాటు తండ్రితో మంతనాలు జరిపారు. అయితే భేటీ వివరాలు బయటకు వెల్లడికాలేదు. బయటకు వచ్చిన తర్వాత అళగిరి మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. పార్టీ క్రమశిక్షణ తప్పితే.. బహిష్కరించాల్సి ఉంటుందని తన తండ్రి హెచ్చరించిన నేపథ్యంలో కరుణానిధిని ఆళగిరి కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
వచ్చే లోక్సభ ఎన్నికల్లో విజయ్కాంత్ నేతృత్వంలోని డీఎండీకేతో డీఎంకే పొత్తు పెట్టుకునే అవకాశాలున్నాయన్న అంశానికి వ్యతిరేకంగా ఆళగిరి వ్యాఖ్యలే చేయడంతో ఆయనపై కరుణానిధి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే ఎంతటివారైనా క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వం రద్దు చేయడానికీ వెనుకాడబోమని తేల్చేశారు.