భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడి


* మీడియాపై కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించిన ఎడిటర్స్ గిల్డ్, ఎన్‌బీఏ

 

న్యూఢిల్లీ: తెలంగాణను గౌరవించని మీడియాను భూమిలో పాతేస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను జాతీయస్థాయి పాత్రికేయ సంఘాలు ఖండించాయి. రెండు చానళ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వ  నిర్ణయం భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడేనని విమర్శించాయి. ఈ మేరకు ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ (ఎన్‌బీఏ) గురువారం వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశాయి.మీడియాకు వ్యతిరేకంగా ఇటీవల తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చేపట్టిన పలు చర్యలను తాము పరిశీలించామని... అవన్నీ ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఎడిటర్స్ గిల్డ్ అధ్యక్షుడు ఎన్.రవి తమ ప్రకటనలో పేర్కొన్నారు. మీడియాపై తీవ్ర చర్యలకు పాల్పడవద్దని టీ సర్కారుకు, సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని జర్నలిస్టులు స్వేచ్ఛగా పనిచేయాలని పిలుపిచ్చారు. మీడియాపై కేసీఆర్ వ్యాఖ్యలు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించాయని ఎన్‌బీఏ  పేర్కొంది. తెలంగాణ లో కొన్ని చానళ్లను కేబుల్ ఆపరేటర్లు నిలిపేయ డం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య అని, వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరింది.తీవ్ర అభ్యంతరకరం: కట్జూ

మీడియాపై కేసీఆర్ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్ జస్టిస్ మార్కండేయ కట్జూ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో అలాంటివి సరికాదంటూ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. టీవీ చానెళ్లు తప్పుడు వ్యాఖ్యలు చేయడం సరికాదని, స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top