
ఇండియాలో వ్యాపారం కష్టమే
వ్యాపారానికి ఉత్తమమైన దేశాల జాబితాలో భారత్ మొత్తం మీద 98వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ విషయంలో ఐర్లాండ్ అగ్రస్థానంలో ఉంది.
న్యూయార్క్: వ్యాపారానికి ఉత్తమమైన దేశాల జాబితాలో భారత్ మొత్తం మీద 98వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ విషయంలో ఐర్లాండ్ అగ్రస్థానంలో ఉంది. 145 దేశాలతో ఫోర్బ్స్ రూపొందించిన జాబితాలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. స్థిరాస్తులపై హక్కులు, నూతన ఆవిష్కరణలు, పన్నులు, అవినీతి తదితర 11 అంశాల ప్రాతిపదికగా ఫోర్బ్స్ ఈ లిస్టు రూపొందించింది. దీని ప్రకారం పేదరికం, అవినీతి తదితర అంశాలు భారత్‌లో వ్యాపార నిర్వహణకు ప్రతికూలంగా ఉంటున్నాయి. వీటితోపాటు హింస, మహిళలపై వివక్ష, విద్యుదుత్పత్తి..పంపిణీ వ్యవస్థలో సమర్ధత కొరవడటం, మేథోహక్కుల చట్టాల అమల్లో వైఫల్యం, రవాణా.. వ్యవసాయ మౌలిక సదుపాయాలు సరిగ్గా లేకపోవడం, వ్యవసాయేతర రంగాల్లో ఉద్యోగావకాశాలు తక్కువగా ఉండటం వంటివి భారత్‌కి దీర్ఘకాలిక సవాళ్లుగా ఉన్నాయని ఫోర్బ్స్ పేర్కొంది.
అయితే, యువత జనాభా ఎక్కువగా ఉండటం, మెరుగైన పొదుపు.. పెట్టుబడుల రేటు వంటి అంశాలను బట్టి చూస్తే మధ్యకాలికంగా భారత్ వృద్ధి అవకాశాలు సానుకూలంగా ఉన్నాయని ఫోర్బ్స్ పేర్కొంది. ఫోర్బ్స్ జాబితా ప్రకారం ఐర్లాండ్ అగ్రస్థానంలో ఉండగా.. న్యూజిలాండ్, హాంకాంగ్, డెన్మార్క్, స్వీడన్ వరుసగా తర్వాత నాలుగు స్థానాల్లో ఉన్నాయి. బ్రిక్ కూటమిలో భారత్ ఆఖరు స్థానంలో ఉంది. బ్రెజిల్ 80వ స్థానంలో, రష్యా (91), చైనా (94)లో ఉన్నాయి.
వివిధ అంశాల్లో భారత్‌కి ర్యాంకులు..
వాణిజ్యపరమైన స్వేచ్ఛ అంశానికి సంబంధించి భారత్‌కి 128వ స్థానం, ద్రవ్యపరమైన స్వేచ్ఛలో 132వ ర్యాంకు, ప్రాపర్టీ హక్కుల పరిరక్షణలో 55వ స్థానం, నూతన ఆవిష్కరణల్లో 39వ ర్యాంకు, టెక్నాలజీలో 94వ స్థానం, మదుపరుల ప్రయోజనాల పరిరక్షణలో 32వ స్థానం ద క్కాయి. ఇక రెడ్ టేపిజంలో 139వ ర్యాంకులో, అవినీతిలో (86), వ్యక్తిగత స్వేచ్ఛలో (58), పన్నుల భారంలో (122), మార్కెట్ల పనితీరులో 75వ స్థానంలో ఉంది.