ఉగ్రవాదం ఆపేస్తే చాలు..

ఉగ్రవాదం ఆపేస్తే చాలు.. - Sakshi


తరువాతే చర్చలకు రండి

 పాకిస్తాన్‌కు సుష్మ సూచన

 ఇరు దేశాల మధ్య చర్చలు, ఉగ్రవాదం కలిసి సాగలేవు

 నవాజ్ చెప్పిన నాలుగు సూత్రాలు అవసరం లేదు

 ఐరాస సర్వసభ్య సభలో విదేశీ వ్యవహారాల మంత్రి ప్రసంగం




 ఐక్యరాజ్యసమితి:చర్చలు, ఉగ్రవాదం కలిసి సాగలేవని భారతదేశం పాకిస్తాన్‌కు తేల్చిచెప్పింది. ఇరు దేశాల మధ్య శాంతి చర్యల కోసం ఆ దేశ ప్రధాని చెప్పిన నాలుగు సూ త్రాలు అవసరం లేదని.. ఉగ్రవాదాన్ని నిలిపివేసి చర్చలకు రావటమన్న ఒకే ఒక్క సూత్రం చాలునని పేర్కొంది. ఉగ్రవాదంపై పాకిస్తాన్ గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని.. ముంబై దాడుల సూత్రధారులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని వివరించింది. ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తున్న, సాయపడుతున్న దేశాలపై అంతర్జాతీయ సమాజం చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చింది. గురువారం ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ప్రసంగించారు. పాక్‌తో ఉగ్రవాదం అంశంతో పాటు.. భద్రతా మండలి సంస్కరణలు, మిలీనియం అభివృద్ధి లక్ష్యాలు తదితర అంశాలనూ ప్రస్తావించారు. ఆమె ప్రసంగంలో ఉగ్రవాదానికి సంబంధించి ప్రస్తావించిన ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే..

 

 ఆ దేశాలపై చర్యలు చేపట్టాలి: ఐక్యరాజ్యసమితికి భారత్ చాలా అందించింది. శాంతి పరిరక్షణ మిషన్లకు భారత్ చాలా ప్రాధాన్యత ఇస్తుంది. 8,000 మంది సైనికులు, పోలీసు సిబ్బంది పది దేశాల్లో పని చేస్తున్నారు. కానీ.. శాంతిపరిరక్షకులని అందించే దేశాలు నిర్ణయాలు తీసుకునే దేశాలు కాకపోవటం విచారకరం. శాంతిపరిరక్షణ ఆపరేషన్లకు భారత్ 25 ఏళ్లుగా దళాలు అందిస్తోంది. భారత్ 25 ఏళ్లుగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోంది. న్యూయార్క్ కూడా ఉగ్రవాదాన్ని ఎదుర్కొంది. నేడు మనం ఎదుర్కొంటున్న అతి పెద్ద ముప్పు.. ఉగ్రవాదానికి మనం ఎలా స్పందిస్తాం అనే దానిపై అంతర్జాతీయ సమాజం భవిష్యత్తు ఇప్పుడు ఆధారపడి ఉంది.

 

  ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చే, వారికి శిక్షణనిచ్చే లేదా వారి దాడులు నిర్వహించేందుకు సాయం చేసే దేశాలకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి నిలబడాలి. భారీ మూల్యం చెల్లించేలా అంతర్జాతీయ సమాజం చర్యలు చేపట్టాలి. అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర సదస్సు కింద ఒక అంతర్జాతీయ విధానాన్ని ఇక ఎంత మాత్రమూ జాప్యం చేయకూడదు. జమ్మూకశ్మీర్ కోసమే ఈ దాడులన్నది అందరికీ తెలుసు: సీమాంతర ఉగ్రవాదాన్ని అంతమొందించటంలో గతంలో ఇచ్చిన హామీలను పాకిస్తాన్ నిలబెట్టుకోలేదు. 2008 నాటి ముంబై దాడుల్లో పౌరులు మాత్రమే కాదు.. పర్యాటకులూ చనిపోయారు. ఈ ఘోరమైన చర్య సూత్రధారులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. మేం ఇద్దరు ఉగ్రవాదులను సజీవంగా పట్టుకున్నాం. భారత్‌ను అస్థిరపరచటానికి, భారత రాష్ట్రమైన జమ్మూకశ్మీర్‌లో పాక్ అక్రమంగా ఆక్రమించుకున్న భూభాగాలు, మిగతా భాగాలపై హక్కు కోరటానికి ఈ దాడులు జరుగుతున్నాయని మనకందరికీ తెలుసు.

 

 ఉగ్రవాదం నిలిపివేసి.. చర్చించుకుందాం రండి: చర్చలకు భారత్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంది. కానీ చర్చలు-ఉగ్రవాదం ఒకేసారి సాగలేవు. కొత్తగా శాంతి చర్యల కోసం నవాజ్‌షరీఫ్ నిన్న నాలుగు సూత్రాలు చెప్పారు. నాలుగు సూత్రాలు అవసరం లేదు.. కేవలం ఒక్కటి చాలు. ఉగ్రవాదాన్ని నిలిపివేయండి.. కూర్చు ని చర్చించుకుందాం రండి. మా ప్రధానమంత్రికి, మీకు మధ్య ఉఫాలో చర్చలు జరిగాయి. ఎన్‌ఎస్‌ఏలు కూడా చర్చించాల్సి ఉండింది. ఉగ్రవాదానికి సంబంధించిన అంశాలపై ఆ చర్చలు జరగాలని మేం కోరుకుంటున్నాం. అలాగే డీజీఎంఓల భేటీ కూడా త్వరగా జరగాలని కోరుతున్నాం. ఆ చర్చల్లో విశ్వసనీయత కనబరిస్తే.. మిగతా వివాదాలన్నిటినీ చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి మేం సిద్ధం.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top