‘నర్మదా’ ఎత్తు పెంచుకోండి

‘నర్మదా’ ఎత్తు పెంచుకోండి


17 మీటర్ల మేర డ్యామ్ ఎత్తు పెంపునకు గుజరాత్‌కు ఎన్‌సీఏ అనుమతి  

తీవ్రంగా వ్యతిరేకించిన నర్మదా బచావో ఆందోళన్

 

 అహ్మదాబాద్/న్యూఢిల్లీ: గుజరాత్‌లో వివాదాస్పద నర్మదా డ్యామ్ ఎత్తును 121.92 మీటర్ల నుంచి 138.72 మీటర్లకు(455 అడుగులకు) పెంచుకునేందుకు నర్మదా నియంత్రణ అథారిటీ(ఎన్‌సీఏ) అనుమతి మంజూరు చేసింది. గురువారం ఢిల్లీలో సమావేశమైన ఎన్‌సీఏ.. పలు అంశాలపై చర్చించిన అనంతరం ఈ మేరకు అనుమతిచ్చింది. గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ జునాగఢ్ పర్యటన సందర్భంగా ఈ విషయాన్ని విలేకరులకు తెలిపారు. ఎప్పటి నుంచో డ్యామ్ ఎత్తు పెంచాలని కోరుతున్న నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన కొద్ది రోజుల్లోనే ఈ అనుమతి రావడం గమనార్హం.

 

 1961 ఏప్రిల్ 5న జవహర్ లాల్ నెహ్రూ శంకుస్థాపన చేసిన ఈ డ్యామ్.. ముంపు ప్రాంతాలు, పునరావాస సమస్యలతో ఆలస్యమవుతూ వచ్చింది. ఇప్పుడిప్పుడే ప్రాజెక్టు పూర్తవుతోంది. ఎనిమిదేళ్ల కిందట డ్యామ్ ఎత్తును 121.92 మీటర్లకు పెంచుకునేందుకు ఎన్‌సీఏ అనుమతి ఇవ్వగా.. అది సరిపోదని, మరింత పెంచాలని గుజరాత్ ప్రభుత్వం చాలా కాలంగా కోరుతోంది.

 

 ఇప్పుడు ఎత్తును పెంచడం ద్వారా.. ప్రస్తుత సామర్థ్యానికి మూడు రెట్లు ఎక్కువగా నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం వస్తుందని, రాష్ట్రంలో రైతుల కష్టాలు తీర్చగలమని రాష్ట్ర ఆరోగ్య మంత్రి నితిన్ పటేల్ చెప్పారు. డ్యామ్‌కు 35 గేట్లు ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పుడు మళ్లీ ఎత్తు పెంచాల్సి రావడంతో నిర్మాణం పూర్తికావడానికి మరో మూడేళ్లు పట్టే అవకాశముందని చెప్పారు.

 

 ఈ ప్రాజెక్టు ద్వారా 1,450 మెగావాట్ల జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. దాన్ని మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్‌లకు పంపిణీ చేస్తారు. దీని ద్వారా గుజరాత్‌లో 17.92 లక్షల హెక్టార్లకు, రాజస్థాన్‌లో 2.46 లక్షల హెక్టార్లకు నీరందే అవకాశముంటుంది. అలాగే  గుజరాత్, రాజస్థాన్‌లలో పలు ప్రాంతాలకు తాగునీరు అందుతుంది.

 

 ప్రపంచంలోనే ఇది రెండో అతిపెద్ద కాంక్రీటు గ్రావిటీ డ్యామ్(పరిమాణంలో). మొదటిది అమెరికాలోని గ్రాండ్ కూలీ ప్రాజెక్టు. అలాగే ఇది ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్పిల్ వే డిశ్చార్జి సామర్థ్యాన్ని కలిగి ఉంది.

 

 పెంపునకు వ్యతిరేకంగా పోరాటం: మేధా పాట్కర్

 

 డ్యామ్ ఎత్తు పెంపును నర్మదా బచావో ఆందోళన్(ఎన్‌బీఏ) తీవ్రంగా వ్యతిరేకించింది. నర్మదా నదిపై భారీ డ్యామ్‌ల నిర్మాణానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న ఈ సంస్థ చైర్‌పర్సన్ మేధా పాట్కర్ ముంబైలో మాట్లాడుతూ.. ఎత్తు పెంచాలన్న నిర్ణయం అప్రజాస్వామికమని, పెంపు వల్ల 2.5 లక్షల మంది నివాసముండే పలు ప్రాంతాలు, ఆలయాలు, మసీదులు, చర్చిలు, షాపులు, పంటలు ముంపునకు గురవుతాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే, వాస్తవ పరిస్థితిని పరిగణనలోకి తీసుకోకుండానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. మోడీ ప్రధాని అయ్యారు కాబట్టే దీనికి అనుమతి లభించిందన్నారు. దీనిపై తాము పోరాటం చేస్తామన్నారు.

 

 సామాజిక న్యాయశాఖ నివేదిక ఇచ్చాకే..: ఉమా భారతి

 

 ముంపు ప్రాంతాల ప్రజలకు పునరావాసం విషయంలో 100 శాతం సంతృప్తి వ్యక్తంచేస్తూ సామాజిక న్యాయ శాఖ నివేదిక ఇచ్చిన తర్వాతే ఎత్తు పెంపునకు అనుమతి ఇచ్చినట్లు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి గురువారం ఢిల్లీలో చెప్పారు. ప్రాజెక్టుతో సంబంధమున్న నాలుగు రాష్ట్ర్రాలనూ సంప్రదించాకే నిర్ణయం తీసుకున్నామన్నారు.




 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top