గూగుల్ సొంత క్యాంపస్ | Google to get 7.2 acres in Hyderabad IT corridor for its campus | Sakshi
Sakshi News home page

గూగుల్ సొంత క్యాంపస్

May 13 2015 2:22 AM | Updated on Apr 4 2019 5:12 PM

గూగుల్ సొంత క్యాంపస్ - Sakshi

గూగుల్ సొంత క్యాంపస్

రానున్న నాలుగేళ్లలో హైదరాబాద్లో రూ. వెయ్యి కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఐటీ దిగ్గజం గూగుల్ సంస్థ అంగీకరించిందని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

అమెరికాలో మంత్రి కేటీఆర్ సమక్షంలో అధికారుల ఒప్పందం
సాక్షి, హైదరాబాద్: సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తొలిసారిగా ఆసియాలో.. అందులోనూ హైదరాబాద్‌లో సొంత క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది. గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో 7.2 ఎకరాల్లో రూ. వెయ్యి కోట్లతో భారీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది. అమెరికా వెలుపల ఉన్న గూగుల్ క్యాంపస్‌లలోకెల్లా ఇదే అతిపెద్దది కానుంది. అంతేకాదు, వచ్చే నాలుగేళ్లలో ఇక్కడి ఉద్యోగుల సంఖ్యను కూడా రెట్టింపు చేయనుంది. ఈ మేరకు గూగుల్‌తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకుంది. అమెరికా పర్యటనలో ఉన్న ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు సమక్షంలో ఒప్పందంపై మంగళవారం ఆ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, గూగుల్ సంస్థ ప్రెసిడెంట్ డేవిడ్ రాడ్‌క్లిఫ్ సంతకాలు చేశారు. కాలిఫోర్నియాలోని గూగుల్ సంస్థ కేంద్ర కార్యాలయం మౌంటెన్‌వ్యూలో ఈ కార్యక్రమం జరిగింది.
 
 కేటీఆర్ మాట్లాడుతూ తాజా ఒప్పందం మేరకు గూగుల్ సంస్థ ఆసియాలో తమ తొలి క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంద న్నారు. వచ్చే ఏడాది క్యాంపస్ నిర్మాణం చేపడతారని చెప్పారు. ఈ క్యాంపస్‌లో 13 వేల మంది ఉద్యోగులు పనిచేయొచ్చన్నారు. హైదరాబాద్‌లోని కొత్త ప్రాంగణాన్ని 4 ఏళ్లలో పూర్తి చేస్తామని డేవిడ్ రాడ్‌క్లిఫ్ పేర్కొన్నారు. నిర్మాణం పూర్తయితే రెండు మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయం అందుబాటులోకి వస్తుందన్నారు. అంతకుముందు గూగుల్ సంస్థకు చెందిన పలు విభాగాల డెరైక్టర్లతో కేటీఆర్ భేటీ అయ్యారు. రాష్ర్ట విద్యారంగంలో అంతర్జాతీయ ప్రమాణాలను నెలకొల్పేందుకు, విద్యార్థుల్లో కంప్యూటర్ విజ్ఞానాన్ని పెంపొందించేందుకు, కేంద్రం చేపట్టిన ‘డిజిటల్ ఇండియా’ కార్యక్రమానికి కూడా గూగుల్ సహకారం కావాలని కోరారు.
 
 తెలంగాణలో గూగుల్ స్ట్రీట్ వ్యూ: ప్రముఖ నగరాల్లోని భౌగోళిక వివరాలు, దర్శనీయ ప్రదేశాలు, హోటళ్లు, షాపింగ్‌మాల్స్ తదితర సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించే గూగుల్ స్ట్రీట్ వ్యూ సేవలను భారత్‌లో తొలిసారిగా తెలంగాణలో అందించేందుకు గూగుల్ అంగీకరించిందని కేటీఆర్ తెలిపారు. ఈ విధానం అందుబాటులోకి వస్తే ప్రపంచంలోని ఏ ప్రదేశ వివరాలనైనా ఎప్పటికప్పుడు తెలుసుకోగలమన్నారు. హైదరాబాద్ వంటి నగరాల్లో పౌరులకు సాంకేతిక సౌలభ్యంతోపాటు వ్యాపారాభివృద్ధికి కూడా ఇది దోహదపడుతుందన్నారు. స్ట్రీట్ వ్యూ సాయంతో ప్రతి భవనాన్ని మ్యాపింగ్ చేయడం ద్వారా ఆస్తి పన్నుతోపాటు ఇతర పౌర సేవల విషయంలో పౌరులకు, ప్రభుత్వానికి ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్‌లో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న ఇంటింటికీ ఇంటర్నెట్ కార్యక్రమం పట్ల గూగుల్ ప్రతినిధులు ఆసక్తిని కనబరిచారని, దీనిపై అధ్యయనం చేసేందుకు త్వరలో ప్రత్యేక బృందాన్ని తెలంగాణకు పంపేందుకు గూగుల్ అంగీకరించిందని కేటీఆర్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement